సినిమా రంగంలోకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే తనదైన ముద్రవేసిన నటి ఐశ్వర్యా రాజేశ్. విభిన్నమైన పాత్రల్ని ఎంచుకుంటూ... తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. తన మనసులోని మాటల్ని చెప్పిందిలా...
అభిరుచులు
డాన్స్ చేయడం, పాటలు పాడటం
మొదటి క్రష్
పదకొండు, పన్నెండో తరగతిలో ఉన్నప్పటి సంగతి. ఒకతను అంటే ఇష్టం ఉండేది. అతనికీ నేనంటే ఇష్టమే కానీ... కొన్నాళ్లయ్యాక అతను కనిపించడం మానేశాడు. కొన్నిరోజులు బాధనిపించింది కానీ మామూలైపోయా. డిగ్రీలో ఉన్నప్పుడు మరో అబ్బాయీ, నేనూ ప్రేమించుకున్నాం కానీ... తరువాత మా ఇద్దరికీ మనస్పర్థలు వచ్చి, విడిపోయాం.
ఆ రోజులు మళ్లీ రావు
చిన్నప్పుడు మేమంతా కలిసి వారానికోసారి సినిమాకు వెళ్లి ఆ తరువాత బయట భోంచేసేవాళ్లం. అలా వెళ్లినప్పుడు వీజీపీ యూనివర్సల్ కింగ్‌డమ్‌లో దోశలు తినడానికి ఇష్టపడేదాన్ని. ఐలాండ్ గ్రౌండ్స్‌లో జరిగే ఎగ్జిబిషన్‌లో పెద్ద అప్పళం, బజ్జీలూ లాగించేసేదాన్ని. బయటకు వెళ్లినప్పుడల్లా వాటిని ఎప్పుడూ మిస్ అయ్యేదాన్ని కాదు. ఇప్పుడు స్టార్‌హోటళ్లలో భోజనం చేస్తున్నా కూడా... అవకాశం వస్తే గనుక రోడ్డుపక్కన చిరుతిళ్లు తినడానికే ఇష్టపడతా.
అన్నీ మంచి జ్ఞాపకాలే
చదువుకునే రోజులు ఎప్పుడూ మధుర జ్ఞాపకాలే. కొన్నాళ్లు తిరుపతిలో చదువుకున్నా. అక్కడ రోజుకో మెనూ ఉండేది. ఆదివారాలు బ్రెడ్-ఆమ్లెట్, సెనగలు పెట్టేవారు. అయితే నెలకోసారి మమ్మల్ని చూసేందుకు వచ్చేటప్పుడు నాకిష్టమని రొయ్యల బిర్యానీ తెచ్చేది అమ్మ. అది ఎంత ఎక్కువగా ఉండేదంటే నేనొక్కదాన్నే తినలేక రూమ్‌కు తీసుకెళ్లి స్నేహితులకూ పంచిపెట్టేదాన్ని.
షూటింగ్ అంటే భయం
ఎందుకో తెలియదు కానీ... నాకు మొదటి నుంచీ షూటింగ్‌లంటే కాస్త భయమే. ముఖ్యంగా మొదటి రెండు రోజులూ కెమెరాను చూసినప్పుడు వణుకు వచ్చినంత పనవుతుంది. డైలాగు కూడా చెప్పలేను. ఆ తరువాత మళ్లీ మామూలైపోతా.
అందుకే అలా చెబుతుంటా
ఎక్కడైనా నా గురించి మాట్లాడాల్సి వస్తే నేను దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని చెబుతుంటా. చాలామంది అది విని 'నువ్వు ఇప్పుడు నటివి... అలా చెప్పొద్దు' అని సలహా ఇస్తుంటారు. కానీ నా మూలాల గురించి చెప్పడం వల్ల కనీసం కొంతమందిలోనైనా స్ఫూర్తి నింపొచ్చనేది నా అభిప్రాయం.
గ్లాసునీళ్లు తాగేస్తా
ఏదయినా సినిమాలో ఏడ్చే సన్నివేశం ఉందంటే ముందు గబగబా ఓ గ్లాసు నీళ్లు తాగేస్తా. తరువాత ఏడుపు దానంతట అదే వచ్చేస్తుంది. అలా ఎలా వస్తుందో నాకు కూడా తెలియదు.
ఇష్టపడే నటులు
రానా, సల్మాన్‌ఖాన్
చెన్నై అంటేనే ఇష్టం
ఓ నటిగా వివిధ దేశాలు తిరుగుతున్నా... నాకు మాత్రం మా చెన్నై అంటేనే ఇష్టం. ముఖ్యంగా చెట్టినాడు వంటకాలూ, మీనాక్షి టెంపుల్, అక్కడి ఆహారం అప్పుడప్పుడూ తినకపోతే ఏదో కోల్పోయిన భావన.
అందం అంటే...
కేవలం ముఖంచూసి ఒకరు అందంగా ఉన్నారని ఓ నిర్ణయానికి వచ్చేయడంలో అర్థంలేదనేది నా అభిప్రాయం. సినిమా అయినా... ఉద్యోగమైనా అప్పగించిన పనిని అద్భుతంగా చేయడంలోనే అందం ఉంటుందని అనుకుంటా.
ఇది చదవండి: ఐశ్వర్యను హీరోయిన్గా పనికిరావని అన్నారు!