తరుణ్‌ను తెరపై తొలిసారి చూడగానే లేడీ ఫ్యాన్స్ ఆయనతో 'నువ్వే కావాలి'... 'నువ్వు లేక నేను లేను' అని అనేశారు. 'ప్రియమైన నీకు' అంటూ లేఖలు రాసేశారు. తరుణ్‌తో ఏకంగా 'నిన్నే ఇష్టపడ్డాను' అని చెప్పడానికి ఎంతోమంది అమ్మాయిలు ఎదురుచూశారంటే ఎటువంటి ఆశ్చర్యం లేదు. అంతలా ప్రేక్షకులను తన స్కీన్ర్ ప్రెజన్స్‌తో, నటనతో ఉక్కిరిబిక్కిరి చేసిన హీరో తరుణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ కోసం.
పుట్టింది చెన్నైలోనే
తరుణ్ 1983 జనవరి 8న చెన్నైలో జన్మించారు. తరుణ్ తల్లిదండ్రులు రోజా రమణి, చక్రపాణి. తల్లి రోజారమణి సినిమా నటి, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్. తండ్రి చక్రపాణి కూడా నటుడే. తరుణ్‌కు అమూల్య అనే సోదరి ఉన్నారు. చెన్నైలో ఐదవ తరగతి వరకు చదువుకొన్న తరుణ్ ఆ తరువాత హైదరాబాద్‌కు వచ్చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు రావడమే తరుణ్ కుటుంబం ఇక్కడకు మకాం మార్చడానికి కారణం.
రెండో తరగతిలోనే 'అంజలి'
తరుణ్ మద్రాస్‌లో రెండవ తరగతి చదువుతున్నప్పుడు మణిరత్నం 'అంజలి' సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఒకసారి తరుణ్ ఇంటికి ఓ కో-డైరెక్టర్ భోజనానికి వచ్చారట. ఆ సమయంలో తరుణ్‌ని ఆయన చూసి... మణిరత్నం 'అంజలి' అనే సినిమా తెరకెక్కిస్తున్నారని ఆ సినిమా కోసం ఓ పాత్రకు చిన్న అబ్బాయిని వెతుకుతున్నట్టు తరుణ్ తల్లిదండ్రులతో చెప్పారట. చివరికి ఆ పాత్రలో తరుణ్ నటించారు. 'అంజలి' సినిమాలో 'అర్జున్' పాత్రలో అద్భుతమైన నటనని ప్రదర్శించారు తరుణ్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
బాల నటుడిగా 'దళపతి', 'సూర్య ఐపిఎస్', 'పిల్లలు దిద్దిన కాపురం', 'ఆదిత్య 369', 'తేజ', 'మనసు మమత' తదితర సినిమాలలో తరుణ్ నటించారు. బాల నటుడిగానే తమిళ్‌లో 'మీరా', మలయాళంలో 'అభయం', 'జానీ' చిత్రాల్లో నటించారు. ఎస్వీ.కృష్ణారెడ్డి దర్శకత్వంలో నాగార్జున, రోజా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన 'వజ్రం' సినిమాలో చిన్నప్పటి నాగార్జున 'చక్రి' పాత్రలో ప్రేక్షకులను అలరించారు.
'నువ్వే కావాలి'తో హీరోగా ఎంట్రీ
1995లో వచ్చిన 'వజ్రం' చిత్రం తరువాత కొన్నాళ్ళు చదువు కోసం విరామం తీసుకొన్న తరుణ్ ఆ తరువాత 'నువ్వే కావాలి' సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత తరుణ్ 'అంకుల్', 'ప్రియమైన నీకు', 'చిరుజల్లు', 'అదృష్టం', 'నువ్వే నువ్వే', 'నిన్నే ఇష్టపడ్డాను', 'ఎలా చెప్పను', 'నీ మనసు నాకు తెలుసు', 'సఖియా', 'సోగ్గాడు', 'ఒక ఊరిలో', 'నవ వసంతం', 'భలే దొంగలు', 'శశిరేఖ పరిణయం', 'చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి', 'యుద్ధం', 'వేట', 'ఇది నా లవ్ స్టోరీ' సినిమాల్లో నటించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అభిమాని రక్త లేఖ
తరుణ్‌కు ఉన్న లవర్ ఇమేజ్ ఎంత విపరీతమైనది అంటే ఒకసారి ఓ అమ్మాయి తరుణ్‌కు రక్తంతో లేఖ రాసిందట. అది చూసి షాక్ అవడం తరుణ్ వంతయింది. ఆ తరువాత ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకొని ఆ అమ్మాయి తల్లిదండ్రులతో, ఆ అమ్మాయితో తల్లి రోజారమణితో మాట్లాడించారట తరుణ్. ఇష్టం ఉండచ్చు కానీ దానికీ ఓ హద్దు ఉంటుందని ఆ అభిమానితో రోజారమణి చెప్పారట.
వెంటనే కౌంటర్లు
తరుణ్ తక్కువమందితో మాట్లాడినా ఎంతో నిజాయితీయా మాట్లాడుతారు. అలాగే, అబద్ధాలు ఆడడం తరుణ్‌కి ఇష్టం ఉండదు. తరుణ్‌తో మాట్లాడాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎవరైనా కౌంటర్ వేస్తే తరుణ్ వైపు నుంచి కౌంటర్‌లు వెంటనే పడతాయట. ఈ విషయం తెలిసిన తరుణ్ ఇంటి సభ్యులు, స్నేహితులు తరుణ్‌పై కౌంటర్లు వేయకుండా జాగ్రత్తగా ఉంటారట.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
పక్కా నాన్ వెజ్
తరుణ్ పక్కా నాన్ వెజిటేరియన్. అయితే, మంగళవారం, శనివారం మినహాయిస్తే మిగిలిన రోజులలో శాఖాహారాన్ని ముట్టుకోరు. మంగళవారం ఆంజనేయ స్వామి కోసం, శనివారం వెంకటేశ్వర స్వామి కోసం మాంసాహారం తినరు.
ప్రతీరోజు గంట పూజ
తరుణ్ ప్రతి రోజూ గంటసేపు వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తారు. ఒకసారి ఇలా స్విట్జర్‌ల్యాండ్‌లో తరుణ్ పూజ చేస్తూ ఓ కట్ట అగరబత్తులు వెలిగించారట. అక్కడ స్మోక్ డిటెక్టర్ ఉండడం వలన వెంటనే తరుణ్ నివాసానికి పోలీసులు వచ్చేశారట. దేవుళ్ళను అగరబత్తులతో పూజిస్తామని ఆ పూజా సామాగ్రిని చూపించి పోలీసులకు వివరణ ఇచ్చుకోవడానికి తరుణ్ కుటుంబీకులకు పది నిముషాలు పట్టింది. ఈ విషయం రోజారమణి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఇష్టమైన నాయిక - నయనతార
లేడీ సూపర్ స్టార్‌గా అభిమానుల మనసు దోచుకొన్న నయనతారకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పనక్కరలేదు. తన నటనతో తరుణ్ అభిమానాన్ని కూడా సొంతం చేసుకొన్నారు నయనతార. తనకు ఇష్టమైన కథానాయిక నయనతార అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు తరుణ్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం
ఇండస్ట్రీకి పరిచయమైన తొలి చిత్రంతోనే 'లవర్ బాయ్' ఇమేజ్‌ని సంపాదించుకొన్న తరుణ్ కొన్నాళ్ల పాటు వరుసవిజయాలతో ముందుకు దూసుకుపోయారు. అయితే, ఆ తరువాత కొన్ని ఫెయిల్యూర్స్ చూశారు. అయినప్పటికీ తన ఆత్మవిశ్వాసం మాత్రం చెదిరిపోలేదని అంటున్నారు తరుణ్. అలాగే ప్రధాన పాత్రలు కాకుండా వేరే పాత్రలు వస్తే వాటిలో ఎట్టిపరిస్థితుల్లోనూ నటించనని కూడా అంటున్నారు.
క్రికెట్, సినిమాలలో ఒకటి ఎంచుకోమంటే
క్రికెట్, సినిమాలలో ఒకటి ఎంచుకోమంటే కచ్చితంగా సినిమాలనే ఎంచుకుంటానని అంటున్నారు ఈ స్టార్. సినిమాల్లోకి ఎలాగో వచ్చేశాను కాబట్టి ఇదే తన జీవితం అయిపోయిందని తన మనసులో ఉన్న మాటను ఒకసారి మీడియా ముందు ఉంచారు.
పురస్కారాలు
1990లో వచ్చిన 'మనసు- మమత' సినిమాలోని నటనకు గానూ ఉత్తమ బాల నటుడిగా నంది పురస్కారాన్ని అందుకొన్నారు. అదే సంవత్సరం వచ్చిన 'అంజలి' సినిమాలోని పాత్రకు కూడా ఉత్తమ బాల నటుడిగా జాతీయ సినిమా పురస్కారాన్ని పొందారు. 1991వ సంవత్సరం నాటి 'పిల్లలు దిద్దిన కాపురం' సినిమాలోని ఓ బాల నటుడిపాత్ర పోషించిన తరుణ్ ఆ సినిమాకి కూడా నంది అవార్డుని అందుకోగలిగారు. అదే ఏడాది వచ్చిన మలయాళ సినిమా 'అభయం'కు గానూ జపాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఓ పురస్కారం అందుకోగలిగారు.
1992నాటి 'తేజ' సినిమాలో తేజ పాత్రకుగానూ నంది అవార్డు ఫర్ బెస్ట్ చైల్డ్ యాక్టర్ అందుకొన్నారు. ఇండస్ట్రీకి దూరంగా ఉన్నట్లనిపించినా...మంచి సినిమాలు చేసేందుకు ఎప్పుడూ సిద్ధమేనని సంకేతాలిస్తున్నారు తరుణ్. అవకాశాలు చేజిక్కించుకుని మళ్ళీ తరుణ్ తెరపై కనిపించి అలరిస్తారని అభిమానుల ఆశతో ఎదురుచూస్తున్నారు.
ఇదీ చదవండి:సన్నీ గోవా లుక్స్.. చూస్తే మతిపోవాల్సిందే!