సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, సుమన్ ప్రతినాయకుడి పాత్రలో నటించిన సినిమా 'శివాజీ'. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుని, ప్రేక్షకాదరణ దక్కించుకుంది. అయితే షూటింగ్లో తొలిరోజు జరిగిన ఆసక్తికర విషయాన్ని తాజాగా జరిగిన 'ఆలీతో సరదాగా' షోలో సుమన్ చెప్పాడు. ఆ తర్వాత నుంచి తనలో మార్పొచ్చిందని అన్నాడు.
"చిత్రీకరణ తొలిరోజు మధ్యాహ్నం, భోజనం కలిసి చేద్దామని రజనీ అన్నారు. ప్రొడక్షన్ వాళ్లు క్యారియర్ పంపితే దాన్ని తీసుకుని ఆయన వద్దకు వెళ్లా. అన్నీ నాన్ వెజిటేరియన్ వంటకాలే. శనివారం కావడం వల్ల నేను తినను అని చెప్పా. ఎందుకు? అని అడిగారు. నేను వేంకటేశ్వరస్వామి పాత్ర చేశా కదా! సెంటిమెంట్. అందుకే నాన్‌వెజ్ తిననన్నా. "అలా తినొద్దని వేంకటేశ్వరస్వామి నీకు ఫోన్ చేసి చెప్పారా? నేను ఒక్కడినే తింటూ ఉంటే, నువ్వు చూస్తూ ఊరుకోలేవు కదా! నువ్వు తిను. మనసు వెజిటేరియన్‌గా ఉండాలి. ఇంకొకరికి హాని చేయకూడదు.. నువ్వు అందరికీ మంచి చెయ్. చిన్నప్పటి నుంచి నువ్వు నాన్‌వెజ్ తింటూనే ఉన్నావు కదా! నీ రక్తంలోనే నాన్ వెజిటేరియన్ ఉంది. మంచి మనసుతో ఉంటే, భగవంతుడు నీకు ఇవ్వాల్సినవన్నీ ఇస్తాడు.." అని రజనీ నాతో అన్నారు. అప్పటి నుంచి అవన్నీ మానేశా. ఎప్పుడైనా గుడికి వెళ్లినా, పండుగల సమయంలో మాత్రం నాన్‌వెజ్ తినను"
- సుమన్, నటుడు
ఇదీ చదవండి: నాని కొత్త గెటప్.. అలరిస్తున్న రాక్షసుడు లుక్