రోడ్డు ప్రమాదానికి గురైన హీరో రాజ్‌తరుణ్... కారు సీటు బెల్టు తన ప్రాణాల్ని కాపాడిందని తెలిపాడు. తన ఆరోగ్య పరిస్థితిపై అనేక వదంతులు వస్తున్నాయని వాటిపై వివరణ ఇచ్చేందుకు ఓ వీడియోను విడుదల చేశాడు.
" అల్కాపూర్ టౌన్‌షిప్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాను. అయితే నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదని కొన్ని వార్తలు వస్తున్నాయి. వాటిపై వివరణ ఇచ్చేందుకు ఈ వీడియో విడుదల చేస్తున్నాను. ప్రస్తుతం క్షేమంగానే ఉన్నా. ఘటన జరిగినప్పుడు సీటుబెల్టు ధరించకపోతే నా పరిస్థితి ఊహించుకోడానికే భయంగా ఉంది. దయచేసి మీరందరూ బైక్ మీద వెళ్లినపుడు హెల్మెట్, కారులో వెళ్లినప్పుడు సీటుబెల్టు ధరించడం మరిచిపోవద్దు. మీ ప్రేమకు ధన్యవాదాలు".
-- రాజ్ తరుణ్, సినీ హీరో
ఆగస్టు 18 అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. అల్కాపూర్ టౌన్‌షిప్ వద్ద కుడివైపునకు స్టీరింగ్ తిప్పే ప్రయత్నంలో .. కారు అదుపు తప్పి పక్కనున్న గోడను ఢీకొట్టిందని వెల్లడించాడు రాజ్‌తరుణ్. ఆ క్షణం ఏం చేయాలో అర్థంకాలేదని... అందుకే భయంతో అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లినట్లు తెలిపాడు. త్వరలో షూటింగ్‌లో పాల్గొంటానని స్పష్టం చేశాడు.
ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కారు యజమని, నిర్మాత ప్రదీప్‌కు నోటీసులు పంపించారు. అయితే సినిమా నిర్మాణ పనులు కోసం తన కారును ఎవరో తీసుకెళ్లారని... ప్రమాద సమయంలో వాహనాన్ని ఎవరు నడిపారో తనకు తెలియదని ప్రదీప్ చెప్పాడు.