‘‘అమ్మా! అడక్కుండానే జన్మనిచ్చావ్. ఏడిస్తే పాలిచ్చావ్... వానోస్తే గొడుగు ఇచ్చావ్... ఆడుకోవడానికి బొమ్మలు ఇచ్చావ్... వాడుకోవడానికి డబ్బులు ఇచ్చావ్... వేసుకోవడానికి బట్టలిచ్చావ్... చూసుకోవడానికి అద్దమిచ్చావ్... రాసుకోవడానికి పలకనిచ్చావ్... గీసుకోవడానికి గడ్డమిచ్చావ్.! అందుకే.. అందుకే... నువ్వు నాకు నచ్చావ్... కానీ, ఎందుకమ్మా ఇంత ఎర్లీగా చచ్చావ్? అయినా, నువ్వు నాకు నచ్చావ్.’’
- నువ్వు నాకు నచ్చావ్
డైనింగ్ టేబుల్ దగ్గర కుటుంబ సభ్యులంతా ఆకలితో అలమటిస్తుంటే... ప్రార్థన పేరుతో భోజన సమయంలో నటుడు ప్రకాష్ రాజ్ చెప్పిన ఈ కవిత ఇప్పటికీ జనం నాలుకలపై నానుతూనే ఉంది. డైలాగులు చెప్పడంలో కాస్త హాస్య చతురత అద్దడం వల్ల ప్రేక్షకులు తరచూ గుర్తు చేసుకుంటూ మళ్లీ మళ్లీ నవ్వుకుంటున్నారు. నలుగురిని నవ్వించే అలాంటి పాత్రలే కాదు... కరడు కట్టిన ప్రతినాయకుడి పాత్రల్లోనూ పరకాయ ప్రవేశం చేసి జనాన్ని భయభ్రాంతులకు గురిచేయడంలో ఈ తరం నటుడిగా ఆయన శైలే ప్రత్యేకం.
‘‘ఒరేయ్.! నా దగ్గరనుంచి కోటి రూపాయలు పట్టుకుపో... మళ్లా సంపాదించుకుంటాను. ఏరా! పది కాసుల బంగారం పట్టుకుపో... మళ్లా కొనుక్కొంటాను. నా గుండెను పట్టుకుపోతే ఎట్టారా? ఒరేయ్.! నా హార్ట్ రా! లైఫ్.. వైఫ్... లవ్యూ! స్వప్న సంక్రాంతి ముగ్గయితే అందులో నేను గొబ్బెమ్మను రా!’’
- ఒక్కడు
సాధారణంగా హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ నడుస్తుంటుంది. కానీ, ఒక్కడు సినిమాలో మాత్రం విలన్ కూడా హీరోయిన్‌ని అమితంగా ప్రేమిస్తాడు. ఆమె కోసం తీవ్రస్థాయిలో తపన పడడంలో విలక్షణతను చాటుకున్నాడు. ఆ విలక్షణతను తెరపై పరిచి నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఆయనే.. నటరాజ విశ్వరూపం సినీ వినోద సీమకు దక్కిన నట ప్రకాశం... ప్రకాష్ రాజ్.
"నేను మోనార్క్‌ని... నన్నెవరూ మోసం చేయలేరు.!’’
- సుస్వాగతం
ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో చిత్రాలు... ఇంకెన్నో పాత్రలు. ప్రకాష్ రాజ్ ఓ పాత్ర పోషిస్తున్నారంటే తెరపై కన్నా.. సమాజంలో మన కళ్లెదుట మనకు తెలిసిన ఓ వ్యక్తి కనిపించినట్లే అనిపిస్తుంది. అంతలా ప్రేక్షకులను తన పాత్రలో మమేకం చేసే సత్తా ఆయనది.
బెంగళూరులో 1965 మార్చి 26 న పుట్టిన ప్రకాష్ రాజ్ పేరు చెప్పగానే సంపూర్ణ నటుడు కళ్లముందు కదలాడుతాడు. నాయికానాయకులు కథను నడిపించే ప్రధాన సూత్రధారులైతే... చుట్టూ ఉన్న నటులంతా శాయశక్తులా ప్రతిభతో సొగసులద్దినవాళ్లే. వాళ్లలో క్యారెక్టర్ ఆర్టిస్టులు చెప్పుకోదగ్గ పాత్రల్ని మొదటి నుంచి పోషిస్తున్నారు. ఎస్.వీ రంగారావు, నాగభూషణం, గుమ్మడి, రావు గోపాలరావు నుంచి నేటివరకూ ఎందరెందరో క్యారెక్టర్ ఆర్టిస్టులు తెరంగేట్రం చేసి తమ ముద్ర వేశారు. ఆ కోవలోనే ప్రకాష్ రాజ్ ఈ తరం నటుడిగా సుప్రసిద్ధుడయ్యాడు. అయినా.. ఆయన నట వైభవాన్ని ఒక చట్రంలో బిగించలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతినాయకుడిగా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా... ఇలా అన్ని రకాల పాత్రల్లోనూ ఇట్టే ఒదిగిపోయే నటుడిగా ప్రకాష్ రాజ్‌కి భిన్నమైన శైలి ఉంది.
అన్ని రంగాల్లోనూ..
ఆర్టిస్ట్‌గా ప్రకాష్ రాజ్‌లో ఎన్ని పార్శ్వాలో? తొలినాళ్లలో రంగస్థల కళాకారుడిగా, తెరపై నటుడిగా, తెర వెనుక నిర్మాతగా, దర్శకుడిగా, టెలివిజన్ ప్రెజంటర్‌గా.. ఇలా అనేక రూపాల్లో సృజనను ఆవిష్కరించారు. దక్షిణాది భాషా చిత్రాలతో సహా బాలీవుడ్‌లోనూ నటించి కీర్తి పతాకం ఎగురవేశారు. రంగస్థలం నుంచి జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన కళారుడిగా ఎదిగారు.
అదే ఆయన రహస్యం..
ఈ స్థాయికి చేరుకోవడానికి వెనుక కఠోర శ్రమ ఉందా? అన్న మీడియా ప్రశ్నకు ప్రకాష్ రాజ్ ఇచ్చిన సమాధానం ఆశ్చర్యం కలిగిస్తుంది.
"ఏం చేయాలో తెలియని తికమక, అయోమయం నుంచి మొదలైన ప్రయాణం ఎన్నో అవరోధాల్ని ఎదుర్కొంది. కళ్లముందు కనిపించి దిగంతాలు చేరుకోవాలని చేసే యత్నంలో ఎప్పటికప్పుడు సరికొత్త దిగంతాలు ఊరించేవి" అని ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
అంతలోనే... "ఇప్పటికీ నా ప్రయాణంలో గమ్యాలు తప్ప లక్ష్యాలు లేవుంటూనే.. అంది వచ్చిన ఒక్కో అవకాశాన్ని స్వీకరిస్తూ ముందుకు సాగాను" అని ఆయన అంటారు.
ఆయన చెప్పేది నిజమే. కారణం... కాలేజీలో చదువుతున్నప్పుడు ఈయన వైఖరి దగ్గరగా గమనించిన జీకె గోవిందరావు అనే అధ్యాపకుడు ఓరోజు... ‘ఇక్కడెందుకు? నీ టైం, మా టైం వేస్ట్ తప్ప’ అని కసురుకోవడంవల్లే తన జీవితం మలుపు తిరిగిందని ప్రకాష్ రాజ్ స్వయంగా చెప్తారు. ఆరోజు అంతర్మథనంతో బెంగళూరు రోడ్ల మీద అలా నడుచుకుంటూ వెళ్లి... చివరికి కళాక్షేత్రం ముందు ప్రకాష్ రాజ్ ఆగారు. రంగస్థలంపై నాటకాలు ప్రదర్శించే సంస్థ అది. ఆ సంస్థ అందించిన ప్రోత్సాహంతో ప్రకాష్ రాజ్‌లోని నటుడు వెలుగులోకి వచ్చారు. తొలినాళ్లలో నెలకి మూడొందల రూపాయల పారితోషికంతో నాటకాలను ప్రదర్శించేవారు. సుమారు రెండువేల వీధి ప్రదర్శనలు అప్పట్లో ఆయన ఖాతాలో జమయ్యాయి.
వ్యక్తిగత జీవితం..
ప్రకాష్ రాజ్ 1994లో లలిత కుమారి అనే ఆర్టిస్ట్‌ని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.. మేఘన, పూజ; ఒక కుమారుడు సిద్దు ఉన్నారు. 2009 లో లలిత కుమారితో విడాకుల తరవాత 2010 లో పోనీ వర్మను ప్రకాష్ రాజ్ పెళ్లాడారు. వీరికి వేదాంతం అనే కుమారుడు ఉన్నారు. రాజకీయాల్లో ఆసక్తి ఉన్న ప్రకాష్ రాజ్ పలుసార్లు రాజకీయ వ్యాఖ్యల ద్వారా కూడా ప్రజలకు సుపరిచితం. ప్రస్తుతం ఆయన కర్ణాటక నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు.
బహుభాషా కోవిదుడు..
ప్రకాష్ రాజ్ బహుభాషలు తెలిసిన నటుడు. మాతృభాష కన్నడం. ఆపై.. తమిళ్, తెలుగు, మలయాళం, మరాఠీ, హిందీ, ప్రపంచ భాష ఇంగ్లీష్‌లో ప్రావీణ్యత పుష్కలంగా ఉంది. ఏ భాషా చిత్రంలో నటిస్తే.. అందులో అంతరంగాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. 'గుల్జార్' కవితలంటే ఆయనకు మహా ఇష్టం. ఆలాగే తెలుగులో 'అమృతం కురిసిన రాత్రి' ఇష్టమైన పుస్తకం. ఆయన శ్రీ శ్రీ ని చదివారు. చలం భావజాలాన్ని పట్టుకున్నారు. అందువల్ల ఆయనని అన్ని భాషల ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. మావాడేనంటూ ఆత్మీయత పంచారు. ఈ తరహా ధోరణే నటుడిగా ఆయన విజయానికి ప్రధాన కారణం.
సీరియల్స్‌తో ప్రారంభమై..
దూరదర్శన్ కన్నడ సీరియల్స్ ద్వారా తెరపై నటుడిగా ఆయన కెరీర్ ప్రారంభమైంది. ‘బిసిలు కుదిరే’, ‘గుద్దాడ భూత’ అనే సీరియల్స్ ఆయనకు మంచి పేరు తెచ్చాయి. ఆ తరువాత అయన కన్నడ సినీరంగంలో కొన్ని చిత్రాల్లో సహాయ పాత్రలు ధరిస్తూ ప్రాచుర్యంలోకి వచ్చారు. ‘రామాచారి’, ‘రణధీర’, ‘నిషాకర్ష’, ‘లాకప్ డెత్’ లాంటి చిత్రాల్లో ఆయన సపోర్టింగ్ రోల్స్ వేశారు. కన్నడ కథానాయకుడు విష్ణువర్ధన్ నటించిన ‘హరికేయ కురి’ చిత్రం ప్రకాష్ రాజ్ నట జీవితంలో టర్నింగ్ పాయింట్. ప్రకాష్ రాజ్ నటనకు మెచ్చిన హీరోయిన్ గీత.. దర్శకుడు కె. బాలచందర్‌కి పరిచయం చేసింది.
ఆయనే మార్గదర్శకత్వం..
బాలచందర్ పరిచయంతో ప్రకాష్ రాయ్ కాస్తా ప్రకాష్ రాజ్‌గా మారారు. ‘డ్యూయెట్’ ద్వారా తమిళ సినీరంగానికి బాలచందర్ ద్వారా పరిచయమయ్యారు. కమల్, రజని తదితర హీరోలందరికీ అవకాశాలిచ్చి ప్రోత్సహించిన బాలచందర్‌ని ప్రకాష్ రాజ్ ఆత్మీయంగా నాన్నగారు అని పిలిచేవారు. ఓ పక్క తమిళ చిత్రాల్లో బిజీగా ఉంటూనే కన్నడ సినిమాల్లోనూ నటిస్తూ వచ్చారు.
అవార్డులు- పురస్కారాలు
మణిరత్నం రూపొందించిన బయోపిక్ ‘ఇరువురు’లో ప్రకాష్ రాజ్ కీలక భూమిక పోషించారు. 1998లో ఈ సినిమాలో నటనకు గానూ ఉత్తమ సహాయ నటుడిగా జాతీయస్థాయి పురస్కారాన్ని అందుకున్నారు. 2009లో ‘కాంచీవరం’ చిత్రానికిగానూ.. ఉత్తమ నటుడిగా జాతీయస్థాయిలో అవార్డు సాధించారు. ‘పుట్టక్కన్న హైవే’ సినిమాను కన్నడంలో నిర్మించి... ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారాన్ని పొందారు. ఇంకా ఎన్నెన్నో అవార్డులు పొందారు.
నిర్మాణంలోనూ..
నిర్మాతగా ప్రకాష్ రాజ్ పలు చిత్రాలు నిర్మించారు. తమిళంలో ‘దయా’, ‘నామ్’, ‘అజాఘియా తీయి’, ‘కందనాల్ ముందాల్’, ‘పోయి’, ‘మోజీ’, ‘వెళ్లి తీరాయ్’. ‘అభియుమ్ నానుమ్’. ‘ఇనిధు ఇనిధు’, ‘మైలు’, ‘ధోని’ చిత్రాలు నిర్మించారు. కన్నడలో ‘నాను నాన్న కనసు’, ‘పుట్టక్కన్ హై వే’ నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో ‘పయనం’, ‘గగనం’, ‘గౌరవం’ చిత్రాలు రూపొందించారు. తమిళ, తెలుగు, కన్నడలో ‘ఉలవచారు బిర్యాని’, తెలుగు, కన్నడలో ‘మనవూరి రామాయణం’, ‘ఇదోళ్లే రామాయణ’ చిత్రాలు నిర్మించారు. కొన్ని చిత్రాలకు దర్శకత్వమూ వహించారు.
ఇదీ చదవండి: కరోనాకు కృతజ్ఞతలు చెప్పిన విద్యాబాలన్