కరోనా వైరస్ చైనాకు ఊపిరిసలపకుండా చేస్తోంది. అంతకంతకూ విజృంభిస్తూ జనాల ప్రాణాలు బలితీసుకుంటోంది. దాన్ని అడ్డుకునే మార్గం దొరక్క చైనా ప్రభుత్వానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. కరోనా ధాటికి దాదాపు వెయ్యి మంది వరకు ప్రాణాలు కోల్పోగా మరో 40వేల మంది పరిస్థితి విషమంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది వైద్యులు, శాస్త్రవేత్తలు ఈ వ్యాధికి మందు కనుగొనేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నా ఇప్పటి వరకూ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. అందుకే ప్రపంచ దేశాలు సైతం చైనాను ఆదుకోలేకపోతున్నాయి.
ప్రముఖ నటుడు జాకీచాన్ ఒకడుగు ముందుకేసి కరోనా వైరస్‌కు విరుగుడు కొనుగొనేందుకు సహకరించాలని.. మందు కనిపెట్టిన వారికి రూ.1 కోటి బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. జాకీచాన్ ఇప్పటికే సహాయ చర్యలకు ఉపక్రమించారు. తనవంతు బాధ్యతగా వుహాన్‌లో ప్రజలకు మాస్కులు పంపిణీ చేపట్టారు.
"సైన్స్, సాంకేతిక కలిస్తే వైరస్‌కు పరిష్కారం దొరుకుతుంది. కరోనాకు విరుగుడు త్వరలోనే దొరుకుతుంది. దాన్ని కనిపెట్టే సత్తా చాలా మందిలో ఉందని నా నమ్మకం. ఈ వ్యాధికి మందు కనిపెట్టేది ఎవరైనా సరే నేను వారికి రూ. 1 కోటి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను."
- జాకీచాన్, ప్రముఖ నటుడు
ఇదీ చదవండి: 'సరిహద్దులు మూసేస్తేనే కరోనా త్వరిత వ్యాప్తి'