ప్రముఖ బాలీవుడ్ నటి, మిస్ ఇండియా వరల్డ్ నటాషా సూరి కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపింది. ఈ నెల మొదట్లో పుణె వెళ్లిన నటాషా.. ముంబయికి తిరిగి రాగానే అనారోగ్యానికి గురైంది. అనంతరం పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది.
"నేను అన్ని జాగ్రత్తలు తీసుకుని పుణె వెళ్లా. తిరిగి వచ్చాక, ఆగస్టు 3న అనారోగ్యానికి గురయ్యా. జ్వరం, గొంతునొప్పి రావడం ప్రారంభించాయి. దీంతో కరోనా పరీక్షలు నిర్వహించుకోగా.. పాజిటివ్‌గా తేలింది."
-నటషా సూరి, బాలీవుడ్ నటి.
తన సోదరి, అమ్మమ్మలకు కూడా పరీక్షలు నిర్వహించినట్లు నటాషా వివరించింది. "నా కుటుంబ సభ్యులూ కాస్త అనారోగ్యం బారిన పడ్డారు. త్వరలోనే వారి నివేదికలు వస్తాయి. ప్రస్తుతం నేను అన్ని నిబంధనలు పాటిస్తూ, చికిత్స తీసుకుంటూ.. హోమ్ క్వారంటైన్లో ఉన్నా" అని పేర్కొంది.
ప్రస్తుత సమయంలో తన తర్వాత చిత్రం 'డేంజరస్' ప్రమోషన్స్ నుంచి తప్పుకున్నట్లు తెలిపింది నటాషా. ఇందులో బిపాసా బసు, కరన్ సింగ్‌లు ప్రధాన పాత్రలు పోషించారు. భూషన్ పటేల్ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 14న ఎమ్ఎక్స్ ప్లేయర్లో విడుదల కానుందీ సినిమా.