హాస్యనటుడిగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టి.. 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమాతో కథానాయకుడిగా మారి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్ రెడ్డి. నిర్మాతగా, దర్శకుడిగా కంటే నటుడిగానే సంతృప్తి చెందానంటున్నాడీ కమెడియన్. ప్రస్తుతం 'భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు' చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తూ, దర్శకనిర్మాతగా అవతారమెత్తాడు. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో ముచ్చటించాడు శ్రీనివాస్ రెడ్డి.
ఫ్లైయింగ్ కలర్స్ పేరుతో నిర్మాణ సంస్థ..
చిన్న కథతో కొత్తవారికి అవకాశమిస్తూ తక్కువ బడ్జెట్‌లో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. 'జయమ్ము నిశ్చయమ్మురా' చిత్ర స్క్రీన్‌ప్లే రచయిత చెప్పిన చిన్న లైన్ నుంచి ఈ కథను సిద్ధం చేసుకున్నాం. కథ బాగా నచ్చి నేనే స్వయంగా నిర్మించాలని అనుకున్నా. అందుకే 'ఫ్లైయింగ్ కలర్స్' పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించాం. ఇది మా హాస్యనటులందరూ కలిసి పెట్టుకున్న గ్రూప్. ఈ సంస్థ శాశ్వతంగా ఉండాలనే ఉద్దేశంతో అదే పేరుతో బ్యానర్‌ని రిజిస్టర్ చేయించా. దర్శకత్వ బాధ్యతను అనుకోకుండా అందుకున్నప్పటికీ దర్శకుడిగా మారాలన్న కల నాకు ఎప్పటి నుంచో ఉంది. అందుకే ఈవీవీ నుంచి అనిల్ రావిపూడి వరకు నేను పనిచేసిన ప్రతి ఒక్కరి వద్ద మెళకువలు నేర్చుకునేవాడిని. కథలో ప్రతి పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంది. ఇందులో చేస్తున్న సత్య, వెన్నెల కిషోర్, శంకర్ వంటి వారందరి గురించి నాకు బాగా తెలుసు. కాబట్టి మరో దర్శకుడితో తెరకెక్కించే కన్నా నేనే దర్శకత్వం వహిస్తే బాగుంటుందనిపించి ఆ బాధ్యత తీసుకున్నా.
![a specia interveiw with actor srinivas reddy abour his film bhagyanara veedhullo gammattu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5256819_ss.jpg)
అందుకే సినిమాకు ఆ పేరు పెట్టాం
'క్షణక్షణం', 'అనుకోకుండా ఒకరోజు' చిత్రాల తరాహాలో ఒకరోజులో ఉదయం నుంచి సాయంత్రంలోపు నడిచే కథ ఇది. మాదకద్రవ్యాల ముఠా నేపథ్యం చుట్టూ సినిమా సాగుతుంది. వీళ్లను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా.. అనుకోకుండా ఆ వ్యవహారంలో మేం చిక్కుంటాం. ఈ నేపథ్యంలో కథలోని పాత్రలన్నీ ఒకొక్కటిగా బయటకొస్తుంటాయి. ఇదంతా పూర్తిగా హైదరాబాద్ రోడ్లపైనే చిత్రీకరించడం, మాదకద్రవ్యాల చుట్టూ అల్లుకున్న కథ కావడం వల్ల అందుకు తగ్గట్లుగానే 'భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు' అనే పేరు పెట్టాం. మేం చెప్పాలనకున్న సందేశాన్ని ఎంతో వినోదాత్మకంగా చూపించబోతున్నాం. ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన అనేక అంశాల్ని ఇందులో నవ్వులు పూయించేలా చూపించాం".
దిల్ రాజు సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయి
"ఈ సినిమా కోసమే 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం చెయ్యలేకపోయా. మరో రెండు సినిమాలూ వదులుకున్నా. మా నాన్న ఇందులో చిన్న పాత్ర చేశారు. తొలి సన్నివేశాన్ని ఆయనపైనే తీశా. ఇటీవల ఆయన మరణించారు. ఈ చిత్రంతో మా అల్లుడిని నటుడిగా తెరకు పరిచయం చేస్తున్నాను. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నా. దిల్‌రాజు సలహాలు, సూచనలు మూవీకి ఎంతో ఉపయోగపడ్డాయి. స్వతహాగా హాస్యనటుడిని కాబట్టి దర్శకుడిగా వినోదాత్మక చిత్రాలు తెరకెక్కించడానికే ఇష్టపడతాను. దర్శకత్వం చేసినా నటుడిగా ఎప్పటికీ సినిమాలు చేస్తూనే ఉంటా. ప్రస్తుతం నాలుగు చిత్రాల్లో నటించబోతున్నా."
![a specia interveiw with actor srinivas reddy abour his film bhagyanara veedhullo gammattu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5256819_sds.jpg)
'గీతాంజలి', 'ఆనందోబ్రహ్మా' వల్ల ఎక్కువగా ఆ తరహా కథలే వస్తున్నాయని, హీరోగా అవకాశాలు వచ్చినా అదే జోనర్‌లో చేయడం ఇష్టం లేక ఒకే చెప్పట్లదట శ్రీనివాస్ . అల్లు అర్జున్ ఒకసారి ఫోన్ చేసినప్పుడు హారర్ చిత్రాలే చేస్తూ పోతే హారర్ స్టార్‌గా మారిపోతావని నవ్వుతూ అన్నట్లు తెలిపాడు. వెన్నెల కిషోర్, సత్య, షకలక శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న 'భాగ్యనగరం వీధుల్లో చిత్రం'.. డిసెంబరు 6న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
ఇవీ చూడండి.. వెండితెరపై శభాష్ 'మిథాలీ'... నటి ఎవరో తెలుసా..?