కొన్నాళ్లుగా మాస్ మహారాజ రవితేజ సినీ కెరీర్ ఆశించిన స్థాయిలో లేదు. అయినప్పటికీ వరుస చిత్రాలతో బిజీగా గడిపేస్తున్నాడీ హీరో. జయాపజయాలతో సంబంధం లేకుండా చకచకా చిత్రాలు పూర్తి చేసేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్' చిత్రంలో నటిస్తున్నాడు. ఇది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
'క్రాక్' సినిమా చిత్రీకరణ అవుతుండగానే దర్శకుడు రమేష్ వర్మతోనూ ఓ చిత్రం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు మాస్ మహరాజ. మార్చిలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమా కథకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. 'రాక్షసుడు' తరహాలోనే ఈ మూవీని కూడా ఓ తమిళ రీమేక్‌గా రూపొందించబోతున్నాడట రమేష్.
తమిళంలో విజయవంతమైన 'శతురంగ వెట్టై 2' ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని పూర్తి రీమేక్‌గా చెప్పలేమని, కేవలం కథలోని కీ పాయింట్‌ను మాత్రమే తీసుకుని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఓ కొత్తకథను చూపించేందుకు సిద్ధమవుతున్నాడట రమేష్ వర్మ. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాను ఈ ఏడాది ఆఖరు నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశముంది.
ఇదీ చదవండి: వేదపాఠశాల నిర్వహణకు ఇల్లు దానం చేసిన ఎస్పీబీ