సినిమా ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు ఎన్నో అంశాల దానికి ముడిపడి ఉంటాయి. ఏదైనా అవాంతరం తలెత్తినా, బడ్జెట్ సరిపోకపోయినా అక్కడిక్కడే ఆగిపోయిన చిత్రాలెన్నో ఉన్నాయి. ప్రపంచంలోని ఏ సినీ పరిశ్రమకైనా ఇలాంటి కష్టాలు తప్పవు! మరి అలానే భారీ బడ్జెట్‌తో, లాంఛనంగా మొదలైన కొన్ని బాలీవుడ్ సినిమాలు.. అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఆ తర్వాత అవి కార్యరూపం దాల్చలేదు. ఆ జాబితాలో అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ లాంటి స్టార్ల ప్రాజెక్టులు కూడా ఉన్నాయంటే నమ్మగలరా?
అర్ధాంతరంగా ఆగిపోయిన బాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలు
1) అప్నా పరాయ
1972లో అమితాబ్, రేఖ ప్రధాన పాత్రల్లో 'అప్నా పరాయ' సినిమాను ప్రారంభించారు. తొలి షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఫ్లాప్ స్టేటస్ కారణంగా బిగ్‌బీని ప్రాజెక్టు నుంచి దర్శకుడు తప్పించారు.
ఆ తర్వాత కొన్నాళ్లకు 'దునియా కే మిలా'గా టైటిల్ మార్చి సంజయ్ ఖాన్, రేఖలతో ఆ సినిమా తీశారు. 1974లో విడుదలవగా ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది ఆ సినిమా. సరిగ్గా అప్పుడే వచ్చిన అమితాబ్ 'జంజీర్' సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ సినిమా నుంచి బిగ్‌బీని తప్పించడం వల్ల ఆయనకు మంచే జరిగిందని బాలీవుడ్ పెద్దలు అభిప్రాయపడ్డారు.
2) టైమ్ మెషీన్
బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్ తీసిన 'టైమ్ మెషీన్'(1992) సినిమా సగంలోనే ఆగిపోయింది. హాలీవుడ్ చిత్రం 'బ్యాక్ టు ది ఫ్యూచర్' స్ఫూర్తిగా దీనిని ప్రారంభించారు. ఇందులో ఆమిర్ ఖాన్, రవీనా టాండన్, రేఖా, నసీరుద్దీన్ షా, గుల్షన్ గ్రోవర్, విజయ్ ఆనంద్ కీలకపాత్రల్లో నటించారు. నాలుగింట మూడొంతులు పూర్తయిన తర్వాత బడ్జెట్ సమస్య వల్ల షూటింగ్ ఆపేశారు. ఆ వెంటనే శేఖర్ కపూర్ అమెరికా వెళ్లిపోయారు.
3) పరిణామ్
అక్షయ్ కుమార్, దివ్య భారతి హీరోహీరోయిన్లుగా 'పరిణామ్' చిత్రం 1993లో మొదలైంది. అదే ఏడాది ఏప్రిల్‌లో దివ్యభారతి మృతి చెందడం వల్ల సినిమా అలానే ఆగిపోయింది.
![7 big-budget Bollywood films that were shelved due to wrong casting and ego clashes](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9831911_2.jpg)
4) దస్
సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ ప్రధానపాత్రల్లో 'దస్' అనే పెద్ద యాక్షన్ మూవీ తెరకెక్కాల్సింది. 1997లో షూటింగ్ కూడా ప్రారంభించారు. భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని నివారించే రహస్య ఏజెంట్ల పాత్రల్లో ఈ ఇద్దరు హీరోలు నటించారు. అయితే చిత్రీకరణ దశలో ఉండగానే దర్శకుడు ఆనంద్ కన్నుమూశారు. అసంపూర్తిగా ఉన్న చిత్రం విడుదలకు నోచుకోలేదు. అయితే ఇదే టైటిల్‌తో 2005లో సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, సునీల్ శెట్టి, శిల్పా శెట్టి ప్రధాన తారాగణంగా మరో సినిమా తెరకెక్కి విజయవంతమైంది.
![7 big-budget Bollywood films that were shelved due to wrong casting and ego clashes](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9831911_1.jpg)
5) టైమ్ టూ డాన్స్
స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరి ఇసా బెల్లా 'టైమ్ టూ డాన్స్' చిత్రంతో 2018లో బాలీవుడ్ అరంగేట్రం చేయాల్సింది. డాన్స్ పోటీలు కథాంశంతో దీనిని తెరకెక్కించారు. ఇందులో ఇస్ బెల్లాతో పాటు సూరజ్ పంచోలీ హీరోగా నటించారు. స్టాన్లీ డీ కోస్టా దర్శకత్వం వహించారు.
చిత్రీకరణ పూర్తి చేసుకున్న తర్వాత కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయాలని చిత్ర నిర్మాతలు అభిప్రాయపడ్డారు. దీనికి ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల అది అక్కడే ఆగిపోయింది. ఇస్ బెల్లా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మ నటిస్తున్న 'క్వాథా' సినిమాలో నటిస్తుంది.
6) షూబైట్
కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. దశాబ్దం క్రితం, సూజీత్ సర్కార్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ హీరోగా 'జానీ వాకర్' చిత్రాన్ని ప్రారంభించారు. అయితే ఆ సినిమా షూటింగ్ మొదలవలేదు. దర్శకుడు ఇదే కథను తీసుకుని యూటీవీ మోషన్ పిక్చర్స్‌ను సంప్రదించారు. ఆ తర్వాత దీనికి 'షూబైట్' అని టైటిల్ మార్పు చేశారు. ఈ సినిమా కథపై మీడియా, చిత్ర సంస్థల మధ్య భారీ న్యాయపోరాటం జరిగింది. ఈ ప్రక్రియలోనే షూబైట్ చిత్రీకరణను పూర్తి చేసినా.. ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. 2018లో ఈ సినిమా విడుదల కాబోతుందని అమితాబ్ ట్వీట్ చేసినా.. దీనిపై ఇప్పటికీ ఎలాంటి సమాచారం లేదు.
![7 big-budget Bollywood films that were shelved due to wrong casting and ego clashes](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9831911_4.jpg)
![7 big-budget Bollywood films that were shelved due to wrong casting and ego clashes](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9831911_3.jpg)