వేసవి.. దసరా.. సంక్రాంతి అంటూ సినిమాల విడుదలలపై మొన్నటిదాకా పక్కా ప్రణాళికలతోనే కనిపించింది తెలుగు చిత్రసీమ. 2020లో వచ్చిన విరామం ప్రభావం కనిపించకుండా.. 2021లో పక్కాగా సినిమాల్ని విడుదల చేసి గట్టెక్కే ప్రయత్నం చేసింది. కానీ కరోనా రెండో దశ ఉద్ధృతితో ఆ ప్రణాళికలన్నీ తారుమారయ్యాయి. వరుసగా రెండోసారి వేసవి సీజన్ చేజారింది. దసరా సీజన్‌పైనా క్రమంగా నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి. మళ్లీ థియేటర్లు తెరుచుకునేది ఎప్పుడో.. చిత్రీకరణలు పునఃప్రారంభయ్యేదెప్పుడో తెలియని అనిశ్చితి. ఇక ఈ ఏడాదిలాగే.. వచ్చే సంక్రాంతి నుంచే కొత్త సినిమాల జోరు చూడొచ్చని లెక్కలేస్తున్నాయి సినీ వర్గాలు. వ్యాక్సినేషన్ ఊపందుకుంది కాబట్టి దసరా నుంచే థియేటర్లు మళ్లీ గాడిన పడొచ్చనే అభిప్రాయాలు మరోపక్క వినిపిస్తున్నాయి. ఏం జరిగినా విడుదల తేదీలు మరోసారి గజిబిజి అయ్యాయి.
చిత్రీకరణను పూర్తి చేసుకున్న సినిమాలకే విడుదల తేదీలపై ఇప్పుడు స్పష్టత లేదు. థియేటర్లు తెరచుకున్నా.. వంద శాతం ప్రేక్షకులతో ప్రదర్శనలు సాగుతాయా? యాభై శాతం ప్రేక్షకులకే అనుమతి అంటే విడుదల చేయాలా వద్దా? ఇలా ఎన్నో సందేహాలు. అనిశ్చితి కొనసాగుతున్నప్పటికీ.. నిర్మాతలు ఓటీటీవైపు మొగ్గు చూపడం లేదు. పరిమిత వ్యయంతో తెరకెక్కిన ఒకట్రెండు సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి తప్ప.. సింహభాగం థియేటర్లపై భరోసాతోనే ఉన్నాయి.
రేసులో బోలెడన్ని
'టక్ జగదీష్', 'లవ్‌స్టోరి', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్', 'ఖిలాడి', 'రిపబ్లిక్', 'మేజర్'.. ఇలా విడుదలకు ముస్తాబైన సినిమాలు చాలానే ఉన్నాయి. వీటిలో చాలా వరకు గతేడాది వేసవికే విడుదల కావల్సినవి. అయితే ఈ వేసవికీ రాలేకపోయాయి.
దసరాకి ముందైనా, తర్వాతైనా..ఎప్పుడు థియేటర్లు తెరుచుకున్నా ఇవన్నీ పోటీ పడతాయనడంలో సందేహం లేదు. ఇవేకాకా పరిమిత వ్యయంతో తెరకెక్కిన పలు సినిమాలూ విడుదలకి సిద్ధంగా ఉన్నాయి.
సంక్రాంతికి ఆ రెండేనా?
2021 సంక్రాంతికి ఎవరూ ఊహించని.. అప్పటిదాకా పండగ రేసులో లేని సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. మరి ఈసారి అదే సీన్ పునరావృతం అవుతుందా లేక ఇప్పటికే విడుదల తేదీల్ని ఖరారు చేసుకున్నవే వస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది. 2022 సంక్రాంతి లక్ష్యంగా మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న 'సర్కారు వారి పాట', పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమాలు చిత్రీకరణను జరుపుకొన్నాయి. ఇవి సంక్రాంతికి పోటీ పడటం వల్ల మిగతావేవీ మధ్యలోకి రాలేదు. ఇప్పుడు అనుకున్న సమయానికి సినిమాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేని పరిస్థితి. మరి ఈసారి సంక్రాంతికి ముందు ప్రకటించినట్టుగానే మహేష్, పవన్‌లే సందడి చేస్తారా? కొత్త సినిమాలొస్తాయా? వస్తే ఏ సినిమాలు రావొచ్చనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అగ్ర కథానాయకుల చిత్రాలైన 'ఆచార్య', 'ఆర్.ఆర్.ఆర్', 'అఖండ', 'రాధేశ్యామ్', 'కె.జి.ఎఫ్ ఛాప్టర్ 2','పుష్ప'.. ఇలా విడుదల కావల్సిన సినిమాలు బోలెడన్ని ఉన్నాయి. ఇప్పటికే 'ఆర్‌ఆర్‌ఆర్' శాటిలైట్, డిజిటల్ (థియేటర్లో విడుదల తర్వాత) హక్కులను రూ.325 కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: 'మా కుటుంబానికి ఆపద్బాంధవుడు చిరంజీవి!'