గూగుల్... ప్రపంచంలో ఎక్కడ ఏమున్నా ఎవరికి ఏం కావాలన్నా దీన్లో ఒక్కమాట టైప్ చేస్తే చాలు... చిటికెలో సమాచారం మొత్తాన్నీ మన ముందుంచుతుంది. యూట్యూబ్... వినోదానికీ కొత్త విషయాలను నేర్చుకోవడానికీ దీన్ని కేరాఫ్ అడ్రెస్ అనే చెప్పాలి. ఇక, ట్విటర్, ఇన్‌స్టాలో ఒకటి సూటిగా సుత్తిలేకుండా బుల్లిసందేశాలతో పెద్ద విషయాలను చేరవేస్తే, రెండోది... ఫొటోలతో అన్ని విషయాలనూ కళ్లకు కట్టేస్తుంది. మరి, 2020లో భారతీయుల ఆసక్తులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ నాలుగింటిలో ఏమేం ఎక్కువగా వెతికారో ఏవి జనానికి తెగ నచ్చేశాయో చూడకపోతే ఎలా
బుట్టబొమ్మ అదరగొట్టేసింది!
మంచి పాట... దానికి తోడు ఉర్రూతలూపే డాన్స్... రెండూ కలిస్తే మనసు తాళం వెయ్యకుండా పాదాలు కదలకుండా ఉండగలవా... ఈ ఏడాది యూట్యూబ్‌లో అలాంటి వీడియో పాటలు ఏవని తెలుగు ప్రేక్షకుల్ని అడిగితే తడుముకోకుండా చెప్పే మాట బుట్టబొమ్మా బుట్టబొమ్మా (అల వైకుంఠపురములో). ఈ పాటకు విదేశీయులు కూడా ఫిదా అయిపోయారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన భార్యతో కలసి బుట్టబొమ్మ పాటకు నృత్యం చేసి టిక్ టాక్‌లో పెట్టాడంటేనే ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇంత ప్రాచుర్యం పొందింది కాబట్టే, దేశం మొత్తమ్మీదా ఎక్కువగా చూసిన పాటల వీడియోల్లో ఇది మూడో స్థానంలో నిలిచింది. టాప్ టెన్‌లో 'రాములో రాములా...' గీతం కూడా ఉంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన హిందీ పాప్ సాంగ్ 'గేందా ఫూల్' మొదటి స్థానంలో నిలిచింది.
టాప్ మ్యూజిక్ వీడియోలు...
1. బాద్షా - గేందా ఫూల్ (జాక్వెలిన్ ఫెర్నాండేజ్)
2. మోటో (అఫిషియల్ వీడియో)
3. అల వైకుంఠపురములో (బుట్టబొమ్మా...)
4. సుమిత్ గోస్వామి - ఫీలింగ్స్
5. ఇల్లీగల్ వెపన్ 2.0- స్ట్రీట్ డాన్సర్ త్రీడీ
![2020 roundup: butta bomma song top place](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10022061_movie-roundup-3.jpg)
టాప్ ట్రెండింగ్ వీడియోల్లో ఈటీవీ ఢీ యూట్యూబ్‌లో నిత్యం ఎన్నో వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. ఎక్కువ రాష్ట్రాల్లో హిందీ తెలిసినవాళ్లే ఉంటారు కాబట్టి సహజంగా దేశం మొత్తంమీదా ఎక్కువమంది చూసే వీడియోలు హిందీవే అయ్యుంటాయి. అలాంటిది దేశంలోనే ఎక్కువమంది చూసిన పది వీడియోల్లో తెలుగు ఛానెల్ ఈటీవీలో ప్రసారమైన ఓ పాట ఆరోస్థానంలో నిలిచిందంటే నిజంగా గొప్ప విషయమే. 'నాదీ నక్కిలీసు గొలుసు...' అంటూ ఢీ ఛాంపియన్స్ కార్యక్రమంలో పండు చేసిన నృత్యం ఇది. 'పండు పెర్ఫామెన్స్' పేరిట యూట్యూబ్‌లో కనిపించే ఈ వీడియోను 8.2 కోట్లమంది చూశారట. టాప్‌టెన్‌లో ఉన్న ఒకే ఒక్క తెలుగు వీడియో ఇదే. తొలిస్థానంలో హిందీలో అజయ్ నాగర్ నిర్వహించే క్యారీ మినాటి ఛానెల్‌లోని వీడియో ఉంది. దీన్ని 6.8 కోట్లమంది చూశారు.
వరుసలో తొలి ఐదు ఇవే...
1. క్యారీ మినాటి- స్టాప్ మేకింగ్ అజంప్షన్స్ (యూట్యూబ్ వర్సెస్ టిక్ టాక్‌ద ఎండ్)
2. జెకెకె ఎంటర్‌టెయిన్‌మెంట్- ఛోటు దాదా ట్రాక్టర్ వాలా
3. మేక్ జోక్ ఆఫ్ - ద లాక్‌డౌన్
4. టీఆర్‌టీ ఎర్తుగ్రుల్ సీజన్1(పీటీవీ)
5. బ్రిస్టి హోమ్ కిచెన్- చాకొలెట్ కేక్ ఓన్లీ త్రీ ఇంగ్రెడియంట్స్
అత్యధికంగా వెతికిన సినిమాలు...
'ధోనీ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకూ పరిచయమైన సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకుని చనిపోవడం ఈ ఏడాది సినీ ప్రేమికులందరినీ ఎంతో కలవరపెట్టింది. విధి విచిత్రం ఏంటంటే... సుశాంత్ నటించిన ఆఖరు చిత్రం 'దిల్ బెచారా'లోనూ అతడు చనిపోతాడు. సుశాంత్ చనిపోయిన తర్వాత డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైన ఈ సినిమా గూగుల్‌లో ఈ ఏడాది ఎక్కువగా అన్వేషించిన చిత్రంగా నిలిచింది.
వరుసలో ఉన్నవి... 1.దిల్ బేచారా, 2.సూరరయ్ పోట్రు, 3.తన్హాజీ, 4.శకుంతలా దేవి, 5.గుంజన్ సక్సేనా
ఎక్కువగా వెతికింది ఈ వ్యక్తుల్నే... 1.జో బైడెన్, 2.అర్నబ్ గోస్వామి, 3.కనికా కపూర్, 4.కిమ్ జొంగ్ ఉన్ 5.అమితాబ్ బచ్చన్
![2020 most retweet post](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10022061_movie-roundup-1.jpg)
ఆ శుభవార్త ఎందరికో నచ్చింది
2020 సంవత్సరానికిగానూ ట్విటర్ సంస్థ భారత్‌లో గోల్డెన్ ట్వీట్స్‌గా ప్రకటించిన వాటిలో అభిమానం, ఆనందం, బాధ... ఇలా అన్నీ ఉన్నాయి.
* అత్యధికంగా రీట్వీట్ అయిన ట్వీట్... తమిళ స్టార్ విజయ్ వేల సంఖ్యలో ఉన్న అభిమానులతో తీసుకున్న సెల్ఫీ. ఈ ఫొటోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చెయ్యగా సుమారు 1.5 లక్షల సార్లు రీట్వీట్ అయిందట.
* ట్విటర్‌లో ఎక్కువమంది లైక్ చేసిన ట్వీట్ కోహ్లీదే. ‘మేం ముగ్గురం కాబోతున్నామంటూ’ కోహ్లీ తను తండ్రిని కాబోతున్న శుభవార్తని ప్రకటించిన పోస్టుకి 6.45 లక్షల లైక్‌లు వచ్చాయట.
* అత్యధికంగా కోట్ చేసిన ట్వీట్... అమితాబ్ బచ్చన్ తనకు కరోనా సోకిన విషయాన్ని తెలియజేస్తూ చేసిందే.
ఎక్కువగా ట్వీట్ చేసిన వర్తమాన అంశాలు...
1.కొవిడ్ 19, 2.సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్, 3.హాథ్రస్
అత్యధికంగా ట్వీట్ చేసిన మూవీ హ్యాష్‌టాగ్‌లు
1.దిల్‌బేచారా, 2.సూరరయ్ పోట్రు, 3.సరిలేరు నీకెవ్వరు
ఎక్కువగా ట్వీట్ చేసిన క్రీడా హ్యాష్‌టాగ్‌లు
1.ఐపీఎల్2020, 2.విజిల్‌పోడు, 3.టీమ్ ఇండియా