'స్టార్ హీరో సినిమా'... ఈ మాట చాలు. సినిమా వ్యాపారం జరగడానికి. క్లాప్ కొట్టిన రోజే అడ్వాన్సులు వచ్చేస్తుంటాయి. శాటిలైట్ హక్కుల కోసం కర్చీఫులు వేసేసుకుంటారు. ఓవర్సీస్ బిజినెస్ చిటికెలో పూర్తయిపోతుంది. ఇలాంటప్పుడు పరిశ్రమ అంతా స్టార్ హీరోల చుట్టూ తిరగడంలో ఆశ్చర్యం ఏముంది? వీళ్ల నుంచి వచ్చే సినిమాలు ఏడాదికి డజను దాటకపోవచ్చు. కానీ సంవత్సరమంతా వాటి గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. మరి 2019లో టాప్ హీరోల ఆధిపత్యం కొనసాగిందా? ఎవరు ఎలాంటి చిత్రాలతో మెప్పించారు? రానున్న ఏడాదిలో వాళ్ల వ్యూహాలేంటి?
స్టార్ హీరోలతో సినిమా అంటే మాటలు కాదు. కాంబినేషన్లు కుదరాలి. కథలు సిద్ధమవ్వాలి. అందుకే వారి నుంచి చిత్రాలు రావడం గగనమయ్యేది. ఇప్పుడు పరిస్థితి కాస్త మారింది. మన కథానాయకులు కాస్త చురుగ్గానే ఉంటున్నారు. ఓ సినిమా చేతిలో ఉన్నప్పుడే మరో కథ గురించి ఆలోచిస్తున్నారు. ఎప్పుడైతే పెద్ద హీరోలు పోటాపోటీగా సినిమాలు తీస్తారో, అప్పుడు పరిశ్రమలో ఉత్సాహకరమైన వాతావరణం కనిపిస్తుంటుంది. ఈ ఏడాది అదే జరిగింది. 2020లోనూ ఇదే పరిస్థితి కనిపించబోతోంది.
ఈ ఏడాదంతా బిజీగా గడిపాడు మహేశ్ బాబు. వేసవిలో 'మహర్షి'ని రంగంలోకి దించాడు. ఆ చిత్రం వసూళ్ల పండగ చేసుకుంది. మహేశ్ 25వ సినిమాగా విడుదలై, తన పాత సినిమాల రికార్డులన్నీ తిరగరాసింది. విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. ఆ వెంటనే 'సరిలేరు నీకెవ్వరు'తో బిజీ అయిపోయాడు మహేశ్. సంక్రాంతికి ఈ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. ఆ తరవాత ఎలాంటి సినిమాలు చేయాలన్న విషయంలోనూ మహేశ్ స్పష్టతతోనే ఉన్నాడు. 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ కథకు ఓకే చెప్పాడు. వంశీ పైడిపల్లితో మరో సినిమా చేయబోతున్నాడు. మరోవైపు మహేశ్ కోసం కొత్త కథలు సిద్ధమవుతున్నాయి. వాటిలో సగం కథలు ఓకే చేసినా 2025 వరకూ మహేశ్ కాల్షీట్లు నిండిపోతాయి.
ప్రభాస్ నుంచి ఈ ఏడాది ఒకే ఒక్క సినిమా వచ్చింది. అదే 'సాహో'. దాదాపు రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. సుదీర్ఘ కాలం సెట్స్‌లోనే ఉండిపోయింది. అయితే ఆశించిన ఫలితం దక్కలేదు. నిర్మాణ వ్యయం భారీగా ఉండడం వల్ల నష్టాలు తప్పలేదు. ప్రస్తుతం 'జాన్' చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఈ సినిమాను ఈ ఏడాదే విడుదల చేద్దామనుకున్నా కుదర్లేదు. 2020 వేసవిలో ఈ చిత్రం రానుంది. శంకర్ చెప్పిన కథకు ప్రభాస్ పచ్చజెండా ఊపారని ప్రచారం జరుగుతోంది. అయితే అధికారికంగా ఈ విషయం తేలాల్సి ఉంది.
మిశ్రమ ఫలితాలు:
చిరంజీవి కలల చిత్రం 'సైరా నరసింహారెడ్డి'.. ఈ ఏడాదే విడుదలైంది. నిర్మాతగా రామ్‌చరణ్ భారీగా ఖర్చు పెట్టాడు. కానీ నష్టాలు తప్పలేదు. ప్రస్తుతం కొరటాల శివ సినిమాతో బిజీగా ఉన్నాడు చిరు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. రామ్‌చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' ప్రేక్షకుల్ని ఏమాత్రం మెప్పించలేకపోయింది. మితిమీరిన యాక్షన్, లాజిక్ లేని సన్నివేశాల వల్ల బాక్సాఫీసు ముందు తేలిపోయింది. 'ఆర్ ఆర్ ఆర్' కోసం చరణ్ ముందస్తుగా కొన్ని కసరత్తులు చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో గాయపడ్డాడు. మళ్లీ కోలుకుని 'ఆర్ ఆర్ ఆర్' షూటింగులో పాల్గొంటున్నాడు. 2020లో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
అగ్ర హీరోల్లో వెంకటేశ్ తన ప్రభావం చూపించగలిగారు. ఈ ఏడాది ప్రారంభంలో 'ఎఫ్ 2'తో వచ్చాడు. చివర్లో 'వెంకీ మామ'గా సందడి చేశాడు. రెండు చిత్రాలూ బాక్సాఫీసును మురిపించాయి. తెలుగునాట అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా 'ఎఫ్ 2' నిలిచింది. బాలకృష్ణ నుంచి మూడు చిత్రాలొచ్చాయి. 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'ఎన్టీఆర్ మహానాయకుడు' నిరాశపరిచాయి. ఆయన నటించిన 'రూలర్' ఇటీవలే విడుదలైంది. నాగార్జున నుంచి వచ్చిన 'మన్మథుడు 2' నిరాశపరిచింది. పట్టాలెక్కాల్సిన 'బంగార్రాజు' కథ తేలకపోవడం వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవలే 'వైల్డ్ డాగ్' కోసం రంగంలోకి దిగాడు నాగ్. సాల్మన్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. నాగార్జున అతిథి పాత్రలో నటించిన బాలీవుడ్ చిత్రం 'బ్రహ్మస్త్ర' 2020లో విడుదల కానుంది.
ఈ ఏడాది అగ్ర హీరోల్లో కొంతమంది రికార్డు వసూళ్లతో హుషారు తెచ్చారు. ఇంకొంతమంది పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకుని, భవిష్యత్తుకు బాటలు వేసుకునే పనిలో ఉన్నారు. విజయోత్సాహంతో ఒకరు, విజయాన్ని అందుకోవాలన్న తపనతో మరొకరు ముందడుగు వేస్తున్నారు. మరి వీళ్ల ప్రయత్నాలు 2020లో ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.
అగ్ర కథానాయకులంతా రెండేసి మూడేసి చిత్రాలతో బిజీగా ఉంటే.. ముగ్గురి పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజల నుంచి ఈ ఏడాది సినిమాలేం రాలేదు. 'అరవింద సమేత' తరవాత 'ఆర్ ఆర్ ఆర్'కు కాల్షీట్లు ఇచ్చాడు ఎన్టీఆర్. రాజమౌళి సినిమా అంటే రెండేళ్లయినా పడుతుంది. ఇక ఎన్టీఆర్ కనిపించేది 2020లోనే. అట్లీ చెప్పిన కథను ఎన్టీఆర్ ఓకే చేశాడు. రాజమౌళి తరవాత అట్లీతోనే ఎన్టీఆర్ సినిమా ఉంటుంది.
'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' తరవాత అల్లు అర్జున్ కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరించాడు. త్రివిక్రమ్‌తో సినిమా ఓకే చేసినా, అది పట్టాలెక్కడానికి సమయం పట్టింది. వీరి కలయికలో రూపొందిన 'అల.. వైకుంఠపురములో' ఈ సంక్రాంతికి విడుదల కానుంది. ఈలోగా సుకుమార్ సినిమానూ పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. 'ఐకాన్' అనే మరో కథ బన్నీ చేతిలో ఉంది. రవితేజకు 2018లో వరుసగా పరాజయాలు పలకరించాయి. వీఐ ఆనంద్‌తో చేసిన 'డిస్కోరాజా' ఈ ఏడాదే వస్తుందనుకున్నారు. కానీ 2020 జనవరికి మారింది. అందుకే ఈ ఏడాది రవితేజ నుంచి సినిమా రాలేదు.
ఇది చదవండి: రివ్యూ 2019: హాట్ సీన్లు, ఘాటు ముద్దులకు ప్రేక్షకులు నో!