"ప్రతి ముప్ఫై సంవత్సరాలకు బతుకు తాలూకు ఆలోచన మారుతుంది. సినిమా వాళ్లు ట్రెండ్ అంటారు. వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు. రాజకీయ నాయకులు తరం అంటారు. మామూలు జనం జనరేషన్ అంటారు. కానీ ప్రతి జనరేషన్‌లోనూ ఆ కొత్త థాట్‌ని ముందుకు తీసుకెళ్లేవాడు ఒక్కడే వస్తాడు. వాణ్ని టార్చ్ బేరర్ అంటారు"... అరవింద సమేత’లో త్రివిక్రమ్ రాసిన డైలాగ్ ఇది.
అవును.. ప్రతి ముప్ఫై ఏళ్లకు జీవన సరళి మారుతుంది. కానీ సినిమా ట్రెండ్ మారడానికి మాత్రం అంత సమయం అవసరం లేదు. పదేళ్లలోనే అభిరుచులు మారతాయి. సినిమాల తీరు మారుతుంది. తీసే విధానం మారుతుంది. చూసే పద్ధతిలోనూ మార్పు కనిపిస్తుంది. ఇది చాలామంది ప్రతిభావంతుల్ని వెలికి తీసుకొస్తుంది. వాళ్లే ట్రెండ్ సృష్టిస్తారు. ముందుండి నడిపిస్తారు. వాళ్లనే సినిమా పరిభాషలో స్టార్లు అంటారు. ఈ దశాబ్దాన్ని ప్రభావితం చేసిన హీరోలు, దర్శకులు, రచయితలు, సంగీత దర్శకులు చాలామందే ఉన్నారు. వాళ్లలో ఓ పదిమంది మాత్రం చిత్రసీమపై తమదైన ముద్ర వేశారు. ఆ పదిమందినీ మరోసారి పరిచయం చేస్తున్నాం. కొత్త దశాబ్దికి స్వాగతం పలుకుతూ
ప్రభాస్
తెలుగు సినిమా ఎంతోమంది స్టార్లని చూసింది. సీనియర్ల తర్వాత పవన్‌కల్యాణ్, మహేష్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్‌చరణ్‌లు స్టార్లుగా ఎదిగి తిరుగులేని అభిమాన గణంతో బాక్సాఫీసుని శాసిస్తున్నారు. ‘వర్షం’తో స్టార్‌గా అవతరించిన ప్రభాస్ ఈ దశాబ్దంపై ప్రత్యేకముద్ర వేశారు. మరో అడుగు ముందుకేసి పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నారు.
‘డార్లింగ్’తో ఈ దశాబ్దాన్ని ప్రారంభించిన ఆయన ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’, ‘రెబల్’, ‘మిర్చి’, ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’, ‘సాహో’ చిత్రాలు చేశారు. ‘బాహుబలి’కి ముందు, తర్వాత అన్నట్టుగా రెండు భాగాలుగా వచ్చిన ఆ సినిమాలు ప్రభాస్ జీవితాన్నే మలుపుతిప్పాయి. అంతకుముందు హిందీలో ఎంతోమంది తెలుగు హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నా పెద్దగా విజయవంతం కాలేదు. ‘బాహుబలి’తో అక్కడ ప్రభాస్ తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు.
అనుష్క
కథానాయకుల్లో సూపర్‌స్టార్‌లు చాలామందే. అలాంటి గుర్తింపు తెచ్చుకున్న నాయికలు మాత్రం అరుదుగానే కనిపిస్తారు. లేడీ సూపర్‌స్టార్ అనిపించుకున్న నాయికల్లో అనుష్క ఒకరు. ‘అరుంధతి’తో ఆమె స్టార్‌హోదాని అందుకున్నారు. మళ్లీ ప్రేక్షకులపై ఆ స్థాయి ప్రభావం చూపించడం కష్టమేనేమో అన్న అనుమానాల్ని పటాపంచలు చేస్తూ ఆమె కథల్ని ఎంపిక చేసుకున్నారు. ఓ వైపు కమర్షియల్ కథలు చేస్తూనే.. మరోవైపు అవకాశం వచ్చినప్పుడల్లా నాయికా ప్రాధాన్య చిత్రాలు చేశారు.
‘బాహుబలి’ చిత్రాలతో పాటు ‘రుద్రమదేవి’, ‘భాగమతి’ తదితర చిత్రాలతో ఆమె తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం ‘నిశ్శబ్దం’ చిత్రం చేస్తున్నారు. ఇదివరకు బలమైన కథానాయిక పాత్రతో ఒక కథని సిద్ధం చేసుకోవాలంటే, ‘ఇలాంటి పాత్రని మోసే నాయిక ఎవరున్నారు?’ అనే ప్రశ్న వచ్చేది. కానీ ఇప్పుడు వెంటనే అనుష్క పేరు గుర్తుకొస్తుంది. అలాంటి పాత్రల్ని చేసే విషయంలో నవతరం నాయికలకి స్ఫూర్తిని నింపారు అనుష్క.
రాజమౌళి
దక్షిణాది సీమ బాలీవుడ్ వైపు చూస్తుంటుంది. అలాంటి బాలీవుడ్డే ఉలిక్కిపడి తెలుగు సీమ వైపు లుక్కేసింది. దానికి కారణం ఎస్.ఎస్.రాజమౌళి. అపజయమెరుగని దర్శకధీరుడు.. రాజమౌళి. ఆయన ఆలోచనలే కాదు, అందులోని పాత్రలూ ఆకాశమంత ఎత్తులో ఉంటాయి. అందివస్తున్న సాంకేతిక నైపుణ్యాన్ని ఒడిసిపట్టి, దాన్ని తన కథలకు అన్వయించి, అద్భుతాలు సృష్టించే టెక్నిక్ జక్కన్న భలే పట్టేశారు. ఈ పదేళ్లలో రాజమౌళి తీసినవి నాలుగు చిత్రాలే. అయితేనేం..? ఆ కనికట్టుకి అంతా ఆశ్చర్యపోయారు. బడ్జెట్ ఉంటే, మనం కూడా హాలీవుడ్‌ని మించిన విన్యాసాలు వెండి తెరపై చూడొచ్చన్న నమ్మకం కలిగింది.
‘బాహుబలి’ వచ్చాక ప్రాంతీయ చిత్రాల్ని తక్కువ అంచనా వేయకూడదన్న సందేశం బాలీవుడ్‌కి చేరిపోయింది. ఇదంతా రాజమౌళి కృషి. ఆయన కన్న కల. దేశ వ్యాప్తంగా అత్యంత ప్రతిభావంతమైన దర్శకుల జాబితాలో రాజమౌళి పేరు తొలి వరుసలోనే ఉంటుంది. అదీ రాజమౌళి ముద్ర. ఆయన్నుంచి ‘ఆర్ ఆర్ ఆర్’ వస్తోంది.
విజయ్ దేవరకొండ
స్టార్లు అజమాయిషీ చలాయించే కాలం ఇది. బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే, ఈ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టడం కష్టం. అలాంటిది ఎవరి అండా లేకుండా స్వశక్తితో స్టార్‌గా మారడం అంటే మాటలు కాదు. అలా జనాన్ని మెప్పించి, చిత్రసీమని మైమరపించిన కథానాయకుడు విజయ్ దేవరకొండ.
2011లో వెండితెరకు పరిచయమైన విజయ్ ప్రభంజనం ‘పెళ్లి చూపులు’తో మొదలైంది. ‘అర్జున్‌రెడ్డి’తో స్టార్‌గా మారారు. ‘గీత గోవిందం’ రూ.వంద కోట్ల క్లబ్‌లో చేరడంతో తిరుగులేని హీరోగా మారిపోయారు. తన కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’. ‘పెళ్లి చూపులు’ సమయానికి పారితోషికం కూడా సరిగా అందలేదు. సొంత డబ్బులతో కొత్త చొక్కాలు కొనుక్కుని ఆ సినిమా ప్రమోషన్లకు హాజరయ్యారు. అదే హీరో ఇప్పుడు ఓ దుస్తుల కంపెనీని స్థాపించారు. రూ.పది కోట్ల పారితోషికం అందుకుంటున్నారు. బాలీవుడ్‌లోనూ విజయ్ స్టైలింగ్‌కి అభిమానులున్నారు.
నాని
చిత్రసీమలో నాని ఓ బుల్లి సూపర్ స్టార్. రేడియోజాకీ, సహాయ దర్శకుడు.. ఇలా మొదలైన నాని ప్రస్థానం ఈ స్థాయికి చేరుకుంటుందని ఊహించి ఉండరు. ఇదంతా తన కష్టమే. కథల్ని ఎంచుకోవడంలో, పాత్రకు న్యాయం చేయడంలో నాని ఎప్పుడూ విఫలం కాలేదు. ‘అష్టా చమ్మా’తో తన ప్రస్థానం 2008లోనే మొదలైంది. 2010 నుంచి సినీ జీవితంలో మలుపుల్ని చూశారు.
‘అలా మొదలైంది’, ‘పిల్ల జమిందార్’, ‘ఈగ’.. అన్నీ హిట్టే. ఆ తరవాత కొన్ని పరాజయాలు పలకరించాయి. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో మళ్లీ గాడిన పడ్డారు. ‘భలే భలే మగాడివోయ్’తో తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్నారు. ‘జెంటిల్‌మెన్’, ‘మజ్ను’, ‘నేను లోకల్’, ‘నిన్ను కోరి’, ‘ఎంసీఏ’ ఇలా వరుస విజయాలు సాధించారు. కొత్తకథలకు, కొత్త దర్శకుల ఆశలకూ నాని చిరునామాగా నిలిచారు. ‘జెర్సీ’ నానిలోని నటనని మరో కోణంలో చూపించింది. నిర్మాతగా ‘అ’ చిత్రాన్ని నిర్మించి మెచ్చుకోళ్లు పొందారు. ‘హిట్’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘బిగ్ బాస్’ వ్యాఖ్యాతగానూ మెప్పించారు.
దిల్‌రాజు
చిత్ర పరిశ్రమలో విజయాల శాతం చాలా తక్కువ. సినిమా తీసి, విడుదల చేయడమే ఒక పెద్ద విజయంగా భావిస్తుంటారు చాలామంది నిర్మాతలు. అలాంటి పరిస్థితుల్లో ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు తీయడమంటే విశేషమే. అగ్ర నిర్మాణ సంస్థలు సైతం సినిమాలకి దూరమవుతున్న పరిస్థితుల్లో దిల్‌రాజు నిర్మాతగా, పంపిణీదారుడుగా విజయాల్ని సొంతం చేసుకున్నారు. కుటుంబ కథల జోలికి వెళ్లడమే మానేశారు నిర్మాతలు. కానీ దిల్‌రాజు విలువలతో కూడిన కథల్ని నిర్మిస్తూ కుటుంబ ప్రేక్షకుల్ని థియేటర్‌కి తీసుకొచ్చారు.
ఈ పదేళ్ల కాలంలో ‘బృందావనం’ ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘శతమానం భవతి’, ‘ఫిదా’, ‘ఎమ్.సి.ఎ’, ‘ఎఫ్ 2’, ‘మహర్షి’ తదితర కుటుంబ కథలు ఆయన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుంచి వచ్చాయి. వాణిజ్య ప్రధానమైన కథలతోనూ ఆయన మరిన్ని విజయాల్ని అందుకున్నారు. దశాబ్దకాలంలో దాదాపు 23 చిత్రాల్ని ఆయన నిర్మించారు. 2017లో మాత్రమే ఆయన ఆరు చిత్రాల్ని నిర్మించారు. వచ్చే ఏడాది ఆయన నిర్మాణ సంస్థ నుంచి ‘96’ రీమేక్, ‘వి’, ‘సరిలేరు నీకెవ్వరూ’, ‘ఐకాన్’ తదితర చిత్రాలు రాబోతున్నాయి.
సమంత
సమంత ఇంతింతై అన్నట్టుగా ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. ‘ఏమాయ చేసావె’తో ప్రయాణం మొదలుపెట్టిన ఆమె తొలి నాళ్లలో, సింహ భాగం కథానాయికల తరహాలోనే కమర్షియల్ నాయికలాగే కనిపించింది. కానీ అనుభవం పెరుగు తున్నకొద్దీ ఆమె జూలు విదిల్చింది. కథల ఎంపికలో పరిణితిని ప్రదర్శిస్తూ, నటిగా తానేంటో నిరూపించుకుంది. ఈ పదేళ్ల కాలంలో సమంత సినిమాల్ని పరిశీలిస్తే నటిగా ఆమె ఎంతగా మారిందో స్పష్టమవుతుంది.
‘ఈగ’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘మనం’, ‘అఆ’, ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘యు టర్న్’, ‘మజిలీ’, ‘సూపర్ డీలక్స్ (తమిళం), ‘ఓ బేబీ’ చిత్రాలతో నటిగా ఆమె ప్రత్యేకమైన ముద్ర వేసింది. ‘సినిమాని నిలబెట్టింది...’ అనేంతగా ఆమె తన నటనతో ప్రభావం చూపించింది. పాత్రల పరంగా ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించే కథానాయికగా సమంత గుర్తింపు సాధించింది.
దేవిశ్రీ ప్రసాద్
దేవిశ్రీప్రసాద్... ఉత్సాహానికి నిలువెత్తు కటౌట్‌లా ఉంటారు. తన మాట, పాట, బీటు, రాగం..అన్నిట్లోనూ జోరే! వేదిక ఎక్కితే డ్యాన్స్ చేస్తారు... చేయిస్తారు. పసందైన పాటలకు ట్యూన్ కట్టడమే కాదు, అవసరమైతే ఆ పాటలు తానే రాసేస్తారు. పాడేస్తారు. హీరోల్ని, హీరోయిన్లనీ సింగర్లుగా మార్చారు. అందుకే ఈ దశాబ్దం చూసిన, విన్న ప్రతిభావంతమైన సంగీత దర్శకుడయ్యారు. ఈ పదేళ్లలో దేవి అందుకున్న విజయాలెన్నో. ఈ పదేళ్ల ప్రయాణంలో దాదాపు 50 చిత్రాలకు సంగీతం అందించారు.
ఏటా కనీసం రెండు మూడు మ్యూజికల్ హిట్లు ఇచ్చారు. ‘100% లవ్’, ‘గబ్బర్‌సింగ్’, ‘మిర్చి’, ‘అత్తారింటికి దారేది’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘శ్రీమంతుడు’, ‘కుమారి 21 ఎఫ్’, ‘నేను శైలజ’, ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’, ‘రంగస్థలం’, ‘భరత్ అనే నేను’, ‘చిత్రలహరి’, ‘మహర్షి’..ఇలా ఎన్నో సినిమాల్లో తన పాటలతో మైమరపించారు.
కొరటాల శివ
అగ్ర హీరో సినిమా అంటే పాటలు, ఫైట్లు, ఇతరత్రా వాణిజ్యాంశాలేనా? ప్రేక్షకులపై ప్రభావం చూపేలా సామాజికాంశాల్ని స్పృశించడం సాధ్యం కాదా? ఇలాంటి సందేహాల్ని పటాపంచలు చేస్తూ విజయాల్ని సొంతం చేసుకుంటున్న దర్శకుడు కొరటాల శివ. రచయితగా పలు చిత్రాలకి పనిచేసిన ఆయన ‘మిర్చి’తో మెగాఫోన్ పట్టారు. పగవాడికి కూడా ప్రేమని పంచాలనే అంశాన్ని ‘మిర్చి’తో చెప్పారు. ఆ తర్వాత ‘శ్రీమంతుడు’తో ఊరి దత్తత గురించి, ‘జనతా గ్యారేజ్’తో పర్యావరణ స్పృహ గురించి, ‘భరత్ అనే నేను’తో నాయకుల హామీల విషయంలో జవాబుదారీతనం తదితర రాజకీయాంశాల్ని స్పృశించి వినోదాలు పంచారు.
2013 నుంచి స్థిరంగా తన ప్రభావం చూపిస్తున్న దర్శకుడు కొరటాల శివ. వాణిజ్యాంశాలు, సామాజికాంశాల జోడింపుతో సినిమాలు తీసే విషయంలో నవతరం దర్శకులకి స్ఫూర్తినిచ్చారు కొరటాల. ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడిగా ఓ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు.
రామజోగయ్య శాస్త్రి
‘అప్పట్లో వేటూరి... ఇప్పుడు సిరివెన్నెల...’తెలుగు సినిమాలో సాహిత్యం గురించి ఎప్పుడు చెప్పుకున్నా ఈ మాట తప్పకుండా వినిపించేది. వేటూరి, సిరివెన్నెల తరవాత ఆ స్థాయిలో తెలుగు సినిమా పాటని నడిపించలేదని వాపోయేవారు. నిజానికి చంద్రబోస్, సుద్దాలఅశోక్‌తేజ లాంటి రచయితలు తెలుగు సినిమా పాటని బోసిపోకుండా కాపాడారు. ఇప్పుడు కూడా అనంత శ్రీరామ్, శ్రీమణి, భాస్కరభట్ల లాంటి యువ గీత రచయితలు చక్కటి పాటల్ని రాస్తున్నారు. చంద్రబోస్ అయితే ఎవర్ గ్రీన్. అలతి పదాలతో అద్భుతాలు సృష్టించారు. ఈ దశాబ్దంలో ఎక్కువగా వినిపించిన పేరు రామజోగయ్యశాస్త్రి. ఈ పదేళ్లలో విడుదలైన ప్రతి పెద్ద సినిమాలోనూ ఈ గీత రచయిత పేరు కనిపించింది. ప్రతీసారీ తనదైన గళం విప్పారు. కలంతో సేద్యం చేశారు.
‘ఖలేజా’లో ‘సదాశివ సన్యాసి’ పాటతో ఆయన పేరు మార్మోగిపోయింది. ‘జనతా గ్యారేజ్’లోని ‘ప్రణామం’ నంది అవార్డును ఇంటికి తెచ్చింది. ‘శ్రీమంతుడు’లో టైటిల్ గీతంతో మరో నంది నడిచొచ్చింది. రామజోగయ్య శాస్త్రి కలం ఎటైనా సరే.. పరుగులు పెడుతుంది. మాస్ పాటలు, హీరోయిజాన్ని ఎలివేట్ చేసే గీతాలు, ఐటెమ్ నెంబర్లూ, భావోద్వేగమైన ఆలాపనలు.. దేనికైనా సరితూగుతారాయన. అందుకే పదేళ్ల కాలంలో ఏకంగా 800పైచిలుకు పాటలు రాసేశారు. అన్నట్టు ఆయనలో మంచి గాయకుడు ఉన్నారు. నటుడిగానూ కొన్ని చిత్రాలలో మెరిశారు.