సినిమా.. అదో అందమైన రంగుల ప్రపంచం. వెండితెరపై ప్రేక్షకుడిని ఆకట్టుకోవడానికి తారలు బాగా కష్టపడుతుంటారు. అయితే చిత్రీకరణ సమయంలోనూ చిన్నచిన్న తప్పిదాలు జరుగుతుంటాయి. వాటిని ఈ మధ్య కాలంలో బ్లూపర్స్ అని, బిహైండ్ ద సీన్స్ అంటూ విడుదల చేస్తున్నారు. అయితే కెమెరాకు చిక్కని కొన్ని సంఘటనలూ ఉంటాయి. వాటిని అప్పుడప్పుడు షోలలో, ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేస్తూనో సెలబ్రిటీలు పంచుకుంటారు. అవి చాలా మందిని విశేషంగా ఆకట్టుకుంటాయి. అలాంటి కొన్నింటిపై లుక్కేయండి...
హాలీవుడ్లో
హాలీవుడ్ హీరో లియోనార్డో డికాప్రియో 'డిజాంగ్ అన్చైన్డ్' సినిమాలో కెల్విన్ క్యాండీ అనే పాత్ర పోషించారు. అందులో ఓ సీన్లో కాస్త కర్కశంగా ప్రవర్తించాల్సి ఉంటుంది. అయితే ఆ చిత్రీకరణలో పాత్రలో లీనమైన లియో.. గాజు డైనింగ్ టేబుల్ పైన చేయి పెట్టి నిజంగా సుత్తితో కొట్టుకున్నారు. వెంటనే చేయి నుంచి రక్తం దారలా కారిపోయిందట. అయితే అది గ్రహించినా.. నొప్పితోనే షూటింగ్ పూర్తిచేసారట. ఆ చిత్ర దర్శకుడు క్వెంటిన్ మాత్రం లియోనార్డో నిబద్ధతకు ముగ్ధుడైనట్లు తెలిపారు. ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్, బాఫ్టా అవార్డులు సహా బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో ఆస్కార్ అందుకుంది.

జోకర్
ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న 'జోకర్' రోల్ గురించి అందరికీ తెలుసు. 'ద డార్క్ నైట్' సినిమాలో ఆ క్యారెక్టర్ హీత్ లెడ్జర్ చేశారు. అయితే ఈ చిత్రంలోని పాత్రను ఆవాహనం చేసుకునేందుకు నెలన్నర పాటు ఓ హోటల్ రూంలో ఒక్కడే ఉండిపోయారట లెడ్జర్. ఆ ఐసోలేషన్ పీరియడ్‌లో రోల్‌కు సంబంధించిన సైకాలజీ మొత్తం వంటబట్టించుకున్నారట. అలానే జోకర్ శాడిస్ట్ నవ్వును అప్పుడే నేర్చుకున్నారట.

మొక్కజొన్న తోట
అంతరిక్షం గురించి తెలుసుకోవాలనుకునే వాళ్లు తప్పకుండా చూసే సినిమాల్లో 'ఇంటర్స్టెల్లార్' ఉంటుంది. అయితే ఇందులో ఓ సీన్‌ను మొక్కజొన్న తోటలో తెరకెక్కించారు. దాని కోసం గ్రాఫిక్స్ పెడదాం అని నిర్మాతలు అనుకుంటే డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ మాత్రం నిజమైన తోటను సృష్టించాలని పట్టుబట్టారట. అలా 500 ఎకరాల్లో మొక్కజొన్న పంట పెంచి.. దానిలోనే చిత్రీకరణ పూర్తి చేశారు. అయితే సినిమా షూటింగ్ పూర్తయ్యాక పండిన పంట అమ్మితే లాభానికే సేల్ అయిందట.

ది టెర్మినేటర్
ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ యాక్షన్ ఎవరికి నచ్చదు చెప్పండి. ఈ హీరో 'టెర్మినేటర్' పాత్ర ఎందరినో విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఆ సినిమా చిత్రీకరణ సమయంలో ఓ ఘటన జరిగింది. షూటింగ్ మధ్యలో కాస్త విరామం ప్రకటించగా.. మొహానికి మేకప్ తీయడం మర్చిపోయిన ఆర్నాల్డ్ పక్కనే ఉన్న లాస్ఏంజిల్స్ డౌన్‌టౌన్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లారట. టెర్మినేటర్ పాత్రలో సగం కాలిన ముఖం, దవడ కనిపిస్తూ ఉండే ఆ రూపం చూసి అక్కడివారు భయపడ్డారట. అయితే వెంటనే విషయం గుర్తించిన ఆయన.. అక్కడ నుంచి వెనక్కి వచ్చేశారట.

కలిసిన వెంటనే న్యూడ్ సీన్
1997లో విడుదలై సంచలన విజయం సాధించిన 'టైటానిక్' సినిమా గురించి తెలియని వారు ఉండరు. ఇందులో లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్లెట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 16 వేల కోట్ల వసూళ్లు రాబట్టింది. అంతటి పేరు పొందిన ఈ సినిమాలోని ఓ సీన్లో కేట్ నగ్నంగా నటించింది. అయితే ఈ సన్నివేశం గురించి దర్శకుడు చెప్పగానే అంగీకరించిన కేట్.. లియోనార్డోను కలవగానే ఎలాంటి బెరుకు, రిహార్సల్స్ లేకుండా.. హీరో రాగానే దుస్తులు తీసేసి న్యూడ్ సీన్ పూర్తిచేసిందట. ఆ సీన్‌తోనే వారిద్దరూ తొలిసారి పరిచయం అయినట్లు ఆమె ఓ సందర్భంలో చెప్పింది.

బాలీవుడ్లో
అమితాబ్, శశికపూర్
యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన అమితాబ్ బచ్చన్‌కు తమ్ముడిగా శశికపూర్ 'దివార్', 'సుహాగ్', 'దో అవుర్ దో పాంచ్', 'నమక్ హలాల్' వంటి సిల్వర్ జూబ్లీ సినిమాల్లో నటించారు. ఆ చిత్రాలతో అమితాబ్‌తో సమానమైన పేరు కూడా తెచ్చుకున్నారు. అయితే 1981లో వచ్చిన 'సిల్‌సిలా' చిత్రంలో మాత్రం అమితాబ్ బచ్చనే.. శశికపూర్‌కు తమ్ముడిగా నటించారు.

ధర్మేంద్ర, సురయ్యా
హీమ్యాన్ ధర్మేంద్రకు అలనాటి నటీమణి సురయ్యా అంటే చెప్పలేనంత అభిమానం. సినిమాల్లోకి రాకముందు సురయ్యా నటించిన 'దిల్లగి' (1949) సినిమాను కొన్ని మైళ్ల దూరం నడిచి ఏకంగా నలభై సార్లు చూశారట. 1960లో ధర్మేంద్ర 'దిల్ భి తేరా హమ్ తేరే' సినిమాలో తొలిసారి పరిచయం అయినప్పుడు అందుకున్న పారితోషికం 51 రూపాయలు మాత్రమే.

నలభై దశకంలో సినిమా పరిశ్రమ మీద చాలా చిన్న చూపు ఉండేది. సంగీత దర్శకుడు నౌషాద్‌ను ఒక సంగీత దర్శకుడిగా కాకుండా ఒక 'దర్జీగా' పెళ్లి కూతురు కుటుంబానికి నౌషాద్ తల్లిదండ్రులు పరిచయం చేశారు. ఆ పెళ్లి ఊరేగింపులో బ్యాండ్ మేళం వాళ్లు వాయించిన పాటలు నౌషాద్ అందించిన సంగీతం 'రత్తన్' (1949) సినిమాలోవి కావడం విశేషం. ఆ చిత్రానికి సంగీతం అందించినందుకు ఆ రోజుల్లోనే నౌషాద్ అందుకున్న పారితోషికం పాతిక వేలు.
మహ్మద్ అలీ, మహ్మద్ రఫీ
మహ్మద్ రఫీకి బాక్సింగ్ క్రీడ అంటే ఎంతో ఇష్టం. ఆయన అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు నిర్వాహకులను ప్రపంచ బాక్సింగ్ వీరుడు మహ్మద్ అలీతో అపాయింట్‌మెంట్ ఇప్పించమని కోరాడు. విషయం తెలుసుకున్న అలీ తనే స్వయంగా రఫీ బస చేసిన హోటల్‌కు వచ్చి ముచ్చటించారు.

సునీల్‌దత్, నర్గీస్
సునీల్ దత్ సినిమాల్లోకి రాక ముందు సిలోన్ రేడియో జాకీగా పనిచేసేవారు. ఒకసారి ఆయన అభిమాన నటి నర్గీస్‌ను ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది. తీరా ఇంటర్వ్యూ మొదలుపెట్టే సమయానికి సునీల్ దత్‌కు నోట మాట రాలేదు. దాంతో ఆ ఇంటర్వ్యూ రద్దయింది. అయితే ఆ అమ్మాయినే చివరికి తన భార్యగానూ చేసుకున్నారు సునీల్.

టాలీవుడ్లో
ఆస్కార్ వేదికపై చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే అది గమనించిన ఆస్కార్ ప్రతినిధులు.. అవార్డుల ప్రధానోత్సవానికి ఆయన్ని ఆహ్వానించారు. అలా అకాడమీ అవార్డుల వేడుకకు వెళ్లిన తొలి టాలీవుడ్, దక్షిణాది నటుడు చిరంజీవే. 1987లో జరిగిన అవార్డు సంబరాలకు ఆయన హాజరయ్యారు.

'రుద్రమదేవి' సినిమాలో అనుష్క భారీగా ఆభరణాలు ధరించి కనిపిస్తుంది. చిత్రీకరణ కోసం ఎక్కువ మొత్తం డబ్బు వెచ్చించి నిజమైన బంగారు నగలను తెచ్చారు. అయితే షూటింగ్ సెట్లో 1.5 కిలోల బంగారు నగలను ఎవరో తస్కరించారట. అప్పట్లో ఓ ముగ్గురిపై కేసు కూడా నమోదు చేశారు పోలీసులు.

తెలుగు తెరపై తనదైన హాస్యంతో ఎందరినో కడుపుబ్బా నవ్వించిన యాక్టర్ బ్రహ్మానందం. ఇప్పటికీ నటిస్తున్న వారిలో అత్యధిక చిత్రాల్లో కనువిందు చేసిన వ్యక్తి ఈయనే. అందుకే బ్రహ్మీకి గిన్నిస్‌బుక్‌లోనూ చోటు దక్కింది. 2015లో ఈ ఫీట్ సాధించే నాటికే వేయికి పైగా చిత్రాలు పూర్తి చేశారు.
సబ్‌మెరైన్ ఆధారంగా తెరకెక్కిన వార్ సినిమా 'ఘాజి'. ఈ తరహాలో రూపొందిన తొలి భారతీయ చిత్రమిదే. ఈ సినిమాను దర్శకుడు సంకల్ప్‌రెడ్డి షార్ట్‌ఫిల్మ్ రూపంలో యూట్యూబ్‌లో పెడదామని అనుకున్నారట. హిందీ, తెలుగులో విడుదలైన ఈ చిత్రం డబ్ చేయకుండానే రెండు భాషల్లో తెరకెక్కించారు. ఒక్కోరోజు ఒక్కో భాషలో చిత్రీకరణ జరిపేవారట.
విక్టరీ వెంకటేశ్, రితికా సింగ్ కలిసి నటించిన చిత్రం 'గురు'. 30 ఏళ్ల కెరీర్లో వెంకీ తొలిసారి ఈ చిత్రంలో ఓ పాట పాడారు. ఈ సినిమా చిత్రీకరణకు నిజమైన బాక్సర్లనే ఆర్టిస్టులుగా పెట్టారు. నటి రితికా కూడా ఫ్రొఫెషనల్ బాక్సరే. చిత్రంలో చూపించిన చాలా మంది జాతీయ స్థాయిలో భారత్ తరఫున ఆడి టైటిళ్లు గెలిచిన వాళ్లు ఉన్నారట.
