Twitter as X.COM : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్‌తో ఒక ఆటఆడుకుంటున్నారు. తాజాగా ట్విట్టర్ వెబ్‌సైట్‌ను x.comకు అనుసంధానం చేసినట్లు ప్రకటించారు. ఇప్పటికే బ్లూబర్డ్ లోగోను మార్చేసిన ఎలాన్ మస్క్.. దాని స్థానంలో X సింబల్ లోగోను తీసుకొచ్చారు. ఇది మస్క్ మస్తిష్కంలో 'X'కు ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది. రానున్న రోజుల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని X కార్పొరేషన్ ద్వారానే నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం.
ఎక్స్ ప్రస్థానం.. అలా మొదలైంది!
Elon musk x.com history : ఎలాన్ మస్క్‌కు X అంటే చాలా ఇష్టం. 1990 సంవత్సరం నుంచే మస్క్‌కు Xతో బాగా అనుబంధం ఉంది. వాస్తవానికి 1999లో ఎలాన్ మస్క్ X.COM పేరుతో స్టార్టప్‌ను ప్రారంభించారు. కానీ తరువాత ఆ డొమైన్ PayPal చేతుల్లోకి వెళ్లిపోయింది. అయితే 2017లో ఎలాన్ మస్క్ x.comను మరలా కొనుగోలు చేశారు. ఇది తన సెంటిమెంట్ అని కూడా ఆ సందర్భంలో మస్క్ పేర్కొనడం విశేషం. తనకు ఆ డొమైన్‌ను తిరిగి అందించిన పేపాల్‌కు ధన్యవాదాలు కూడా తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్తబ్దుగా ఉంచిన ఆ డొమైన్‌తో.. ప్రస్తుతం ట్విట్టర్‌ను అనుసంధానం చేశారు.
X - సెంటిమెంట్
Elon musk X sentiment analysis : ఎలాన్ మస్క్‌కు X అంటే ఎంతో సెంటిమెంట్. అందుకే తను ప్రారంభించిన కంపెనీల్లో X అక్షరం వచ్చేలా చాలా జాగ్రత్త తీసుకుంటారు. అంతరిక్ష ప్రయోగాల కోసం 2022లో ప్రారంభించిన సంస్థ SpaceX; ఎలక్ట్రిక్ కారు మోడల్ X, చివరకు తన కుమారుల్లో ఒకరికి పెట్టిన పేరులోనూ (ఎక్స్ ఏఈ ఏXII) X అనే పదాన్ని వదలలేదు. ఇటీవల xAI పేరుతో ఒక కృత్రిమ మేధ సంస్థను కూడా మస్క్ స్థాపించారు. తాజాగా ట్విట్టర్ పేరెంట్ సంస్థ పేరునూ 'ఎక్స్ కార్పొరేషన్'గా మార్చారు.
తాజా పరిణామాలతో ట్విట్టర్ లోగోతోపాటు ట్విట్టర్.కామ్ స్థానంలో x.com చేరిపోయింది. సోమవారం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇవి అందుబాటులోకి వచ్చేశాయి.
ఎవ్రిథింగ్ యాప్
Elon musk Everything app : సామాజిక వేదికగా, పేమెంట్స్ యాప్‌గా అన్ని సేవలు ఒకే యాప్‌లో అందించేందుకు ఎలాన్ మస్క్ కృషి చేస్తున్నారు. దీనికి ఎవ్రిథింగ్ యాప్ అని కూడా ఆయన అంటున్నారు. ముఖ్యంగా ఇది చైనాలో చాలా పాపులర్ అయిన వీచాట్ మాదిరిగా ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. దాదాపు 100 కోట్ల క్రియాశీల యూజర్లు ఉన్న వీచాట్ యాప్‌లో.. సోషల్ మీడియా పోస్టులు పెట్టవచ్చు, పర్షనల్ మెసేజ్‌లు పంపవచ్చు. అలాగే ఫుడ్ ఆర్డర్, క్యాబ్ సేవలు పొందవచ్చు. ఇదే విధంగా తన ఎవ్రిథింగ్ యాప్ ఉండాలని మస్క్ కోరుకుంటున్నారు. అందులో భాగంగానే ట్విట్టర్ యాప్‌ను కొనుగోలు చేసినట్లు ఇంతకు ముందే ఆయన ప్రకటించారు.
భారీ మార్పులు తథ్యం!
Twitter CEO : ట్విట్టర్లో త్వరలో భారీ మార్పులు వస్తాయని ఆ సంస్థ సీఈఓ లిండా యకారినో స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఆడియో, వీడియో, మెసేజ్, పేమెంట్స్/ బ్యాంకింగ్ సేవలు అన్నీ ఒకే యాప్‌లో అందుబాటులోకి వస్తాయని ఆమె పేర్కొన్నారు.