Whatsapp Update: మనకు తెలియనివారికి ఆన్‌లైన్ స్టేటస్, లాస్ట్ సీన్ ఫీచర్లు కనిపించనీయకుండా వాట్సాప్ కొత్త ప్రైవసీ అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు రకాల పరికరాలకూ అందుబాటులో ఉంటుంది. కొన్ని థర్డ్ పార్టీ యాప్‌లు లాస్ట్ సీన్, ఆన్‌లైన్ స్టేటస్‌లను చూడటానికి వాట్సాప్ యాప్ నుంచి సమాచారాన్ని సేకరించే అవకాశముండటంతో ఈ భద్రత మార్పులు తీసుకొచ్చింది. ఏదైనా వాట్సాప్ ఖాతాతో ఇంతకుముందెన్నడూ ఛాట్ చేయనట్టయితే వారికి ఇకపై మన ఆన్‌లైన్ స్టేటస్ కనిపించదు. దీంతో అపరిచితులకు మన సమాచారం చిక్కకుండా చేసినట్టయ్యింది.
Whatsapp Disappearing Messages: వాట్సాప్ ఇటీవల అన్ని కొత్త చాట్లలో వారం వ్యవధిలో మెసేజ్‌లు వాటంతటవే మాయమయ్యే వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. దీనికి మరో రెండు సమయాలనూ జోడించింది. దీంతో 24 గంటల్లో, 90 రోజుల్లో మెసేజ్‌లు మాయమయ్యేలా ఎంచుకోవటానికి వీలుంటుంది.
ఫొటోనే స్టిక్కర్‌గా..
వాట్సాప్‌లో స్టికర్ల వాడకం కొత్తేమీ కాదు. వీటినే వాడుకోవాలనేమీ లేదు. మనకు ఇష్టమైన ఫొటోలనూ స్టికర్‌గా మార్చుకొని, పంపుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతానికి వాట్సాప్ వెబ్‌లోనే అందుబాటులో ఉంది. ముందుగా వాట్సాప్ వెబ్‌ను ఓపెన్ చేసి, ఏదైనా ఛాట్‌ను ఎంచుకోవాలి. అటాచ్‌మెంట్ గుర్తును నొక్కి స్టికర్స్‌ను ఎంచుకోవాలి. అప్పుడు ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ఓపెన్ అవుతుంది. ఇందులోంచి వాట్సాప్ స్టికర్‌గా మార్చుకోవాలని అనుకుంటున్న ఫొటోను ఎంచుకోవాలి. తర్వాత బాక్స్‌లో మూలలను సరిచేసి, సెండ్ యారోను నొక్కాలి. అది స్టికర్‌గా మారి అవతలివారికి చేరుతుంది. దీన్ని మున్ముందు వాడుకోవాలనుకుంటే రైట్ క్లిక్ ద్వారా సేవ్ చేసుకోవచ్చు.
ఇవీ చూడండి: ట్విట్టర్లో టిక్‌టాక్ తరహా స్వైపింగ్ ఆప్షన్!