మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ప్రైవసీ ఫీచర్‌ను డెస్క్‌టాప్ యూజర్లకు పరిచయం చేయనుంది. స్క్రీన్ లాక్ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌తో డెస్క్‌టాప్‌లో యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారీ పాస్‌వర్డ్ ఎంటర్ చేయమని కోరుతుంది. దీనివల్ల యూజర్ చాట్ సంభాషణలకు అదనపు భద్రత ఉంటుందని వాట్సాప్ భావిస్తోంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే సాధారణ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఇప్పటిదాకా వాట్సాప్ డెస్క్‌టాప్ వెర్షన్ యాప్‌కు పాస్‌వర్డ్ భద్రత లేదు. ఒక్కసారి డెస్క్‌టాప్ యాప్‌లో లాగిన్ చేస్తే, తర్వాత లాగిన్ చేయాల్సిన అవసరంలేదు. దీనివల్ల యూజర్ కంప్యూటర్/పీసీని ఇతరులు ఉపయోగించేప్పుడు వాట్సాప్ యాప్‌ను యాక్సెస్ చేయొచ్చు. దీంతో వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతోందని యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సమస్యకు చెక్ పెడుతూ వాట్సాప్ మొబైల్ యాప్ తరహాలో డెస్క్‌టాప్ యాప్‌కు సైతం స్క్రీన్ లాక్ ఫీచర్‌ను తీసుకురానుంది. యూజర్ యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారీ పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. నంబరు పాస్‌వర్డ్‌తోపాటు ఫింగర్‌ప్రింట్ సెన్సర్ భద్రతను కూడా తీసుకొస్తున్నారు. టచ్‌ఐడీ సెన్సర్ ఉన్న కంప్యూటర్/ల్యాప్‌టాప్ యూజర్లు వాట్సాప్ యాప్‌కు ఫింగర్‌ప్రింట్ లాక్ పెట్టుకోవచ్చు. ఒకవేళ యూజర్ పాస్‌వర్డ్ మరిచిపోతే, యాప్ నుంచి లాగౌట్ చేసి, క్యూఆర్ కోడ్ స్కాన్ సాయంతో లాగిన్ చేయొచ్చు.