ఇంటర్నెట్ వాడాలంటే బ్రౌజర్ తప్పనిసరి. మీరు పర్సనల్ కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లు, మొబైల్స్‌లో వాడే గూగుల్ క్రోమ్, ఓపెరా మినీ, మోజిలా ఫైర్ ఫాక్స్ లాంటివన్నీ బ్రౌజర్లే. సూక్ష్మంగా చెప్పాలంటే.. బ్రౌజర్ అనేది ఇంటర్నెట్కు ఓ ద్వారం లాంటిది. దాని ద్వారానే మనకు అవసరమైన ప్రతిదీ బ్రౌజింగ్ చేయగలం. అయితే ఇదొక్కటే బ్రౌజర్ పనికాదు. సైబర్ దాడుల నుంచి డివైజ్లకు రక్షణ కల్పించడం కూడా అదే చూసుకుంటుంది.
సైబర్ అటాక్స్ నుంచి కాపాడాల్సిన బ్రౌజర్లే ఒక్కోసారి దాడులకు గురవుతుంటాయి. సైబర్ మోసగాళ్లు బ్రౌజర్లను హైజాక్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో అసలు బ్రౌజర్ హైజాకింగ్ ఎలా జరుగుతుంది? హైజాకింగ్ బారిన పడకుండా బ్రౌజర్‌ను ఎలా కాపాడుకోవాలి? తదితర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మీరు వాడుతున్న బ్రౌజర్లో మీకు తెలియకుండానే ఏదైనా మార్పుచేర్పులు జరుగుతున్నాయా? అయితే వెంటనే అలర్ట్ అవ్వండి. మీ బ్రౌజర్ హైజాకింగ్ కు గురైందని తెలుసుకోండి.
మిగిలిన సైబర్ నేరాల మాదిరిగానే బ్రౌజర్ హైజాకింగ్స్ కూడా యూజర్ల నుంచి డబ్బులు కొట్టేసేందుకు లేదా వారి డేటా చౌర్యం చేసేందుకే ఎక్కువగా జరుగుతుంటాయని నిపుణులు అంటున్నారు. బ్రౌజర్లలో కీలాగర్స్ లాంటి సాఫ్ట్ వేర్స్ లేదా స్పైవేర్స్ను ఇన్ స్టాల్ చేయడం ద్వారా బ్యాంకు వివరాలు లాంటి సున్నితమైన సమాచారాన్ని దొంగిలించేందుకు హైజాకర్స్ ప్రయత్నిస్తుంటారట. బ్రౌజర్ హైజాకింగ్‌కు గురైతే మనం ఏ వెబ్‌సైట్ ఓపెన్ చేసినా అది తిరిగి హైజాకర్ వెబ్‌సైట్ కే రీడైరెక్ట్ అవుతుంది. దీని వల్ల వారి వెబ్సైట్లకు యాడ్ రెవెన్యూ పెరుగుతుంది.
కొత్త సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేస్తున్నారా?
బ్రౌజర్లను హైజాక్ చేయడానికి సైబర్ నేరగాళ్లు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తుంటారు. యాడ్స్, మెసేజులు లేదా యాప్స్‌ను పాప్ అప్స్ రూపంలో పంపిస్తుంటారు. వాటిని ఓపెన్ చేసినా లేదా ఆయా టూల్స్‌ను ఇన్ స్టాల్ చేసినా బ్రౌజర్ హైజాక్ అవుతుంది. ముఖ్యంగా బ్రౌజర్లో వచ్చే ఎక్స్ టెన్షన్స్, డౌన్లోడ్ మేనేజర్స్ లాంటి టూల్స్, మెయిల్ అటాచ్‌మెంట్స్‌ను అంత తేలిగ్గా తీసుకోకూడదు. అవేంటో పూర్తిగా తెలుసుకోకుండా పొరపాటున ఇన్‌స్టాల్ చేశారా మీ బ్రౌజర్ హైజాక్ అయ్యే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి కొత్త సాఫ్ట్ వేర్ ఏదైనా డౌన్లోడ్, ఇన్‌స్టాల్ చేసే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించండి.
బ్రౌజర్ మొరాయిస్తోందా?
మీరు వాడుతున్న బ్రౌజర్ ఉన్నట్లుండి మొరాయిస్తోందా? సరిగ్గా పనిచేయట్లేదా? ఏ కారణం లేకుండానే అది నెమ్మదిగా రన్ అవుతోందా? అయితే అది హైజాకింగ్ కు గురైనట్లేనని అర్థం చేసుకోవాలి. అకస్మాత్తుగా బ్రౌజర్ పనితీరు నెమ్మదించిందంటే అది హైజాకర్ల పనే. బ్రౌజర్ వనరులను తీసుకుని దాని పనితీరును దెబ్బతీస్తుంటారు హైజాకర్లు. బ్రౌజర్ పనితీరును దెబ్బతీయడమే కాకుండా ఒక్కోసారి దాన్ని ఫ్రీజ్ లేదా క్రాష్ కూడా చేస్తుంటారు హైజాకర్లు. ఆ సమయంలో బ్రౌజర్ పూర్తిగా పనిచేయకపోవడాన్ని గమనించొచ్చు.
పాప్ అప్స్ వెల్లువలా వస్తున్నాయా?
మీ బ్రౌజర్లో ఎక్కడ చూసినా పాప్ అప్స్ కనిపిస్తున్నాయా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే. మీ సిస్టమ్‌ను హైజాక్ చేసినవారు అడ్డగోలుగా బ్రౌజర్లో పాప్ అప్స్ వచ్చేలా చేస్తుంటారు. పాప్ అప్ అంటే మామూలుగా అందరూ యాడ్స్ అనే అనుకుంటారు. కానీ ఎప్పుడూ లేనివిధంగా ఒకేసారి పదుల కొద్దీ యాడ్స్ రావడం కనిపిస్తే మాత్రం ప్రమాద ఘంటికలు మోగుతున్నట్లే.
హోమ్ పేజ్ లేదా సెర్చ్ ఇంజిన్ మారిందా?
మీరు వాడే బ్రౌజర్లో హఠాత్తుగా హోమ్ పేజ్ మారిందా? మీ ప్రమేయం లేకుండానే హోమ్ పేజ్ లేదా డీఫాల్ట్‌గా ఉండే సెర్చ్ ఇంజిన్ మారిందా? అయితే మీ బ్రౌజర్ హైజాక్ అయినట్లే. మీరు ఎప్పుడూ చూడని వెబ్ సైట్ హోమ్ పేజ్‌గా మారినా, మీరు ఎన్నడూ వినని సెర్చ్ ఇంజిన్ డీఫాల్ట్ సెర్చ్‌గా మారినా ఎవరో మీ బ్రౌజర్‌ను హ్యాక్ చేశారని అర్థం చేసుకోవాలి. మీకు తెలియకుండానే టూల్ బార్ లేదా ఏదైనా ఎక్స్ టెన్షన్ దానంతట అదే ఇన్ స్టాల్ అయ్యిందో దానర్థం బ్రౌజర్ హైజాకింగ్ కు గురయ్యిందనే! కాబట్టి బ్రౌజర్ పనితీరును ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తూ ఉండాలి.
ఒకే వెబ్‌సైట్ రీడైరెక్ట్ అవుతోందా?
మీరు ఏ వెబ్ సైట్ ఓపెన్ చేసినా తిరిగి ఒకే వెబ్ సైట్‌కు సెర్చ్ రీడైరెక్ట్ అవుతున్నా బ్రౌజర్ హ్యాకింగ్‌కు గురయ్యిందని గ్రహించాలి. ఇలాంటి సైబర్ అటాక్‌ను డొమైన్ నేమ్ సిస్టమ్ (డీఎన్ఎస్) అని పిలుస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. బ్రౌజర్ ఎలా స్పందిస్తుందనేది ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి.
బ్రౌజర్‌ను హైజాకింగ్ నుంచి ఎలా కాపాడాలి
కొన్ని సూచనలు పాటిస్తే బ్రౌజర్‌ను హైజాకింగ్ బారిన పడకుండా చూసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. మీరు ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్‌ను వాడుతున్నారు, ఏ బ్రౌజర్‌ను వినియోగిస్తున్నారనేది కాదు.. ఏది ఉపయోగించినా సరే, ఒకవేళ హైజాకింగ్ బారిన పడితే మాత్రం ఈ కింది సూచనలను పాటిస్తే సరిపోతుందని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.
- మీరు వాడుతున్న బ్రౌజర్, ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్కోండి.
- బ్రౌజర్లో జరుగుతున్న యాక్టివిటీని నిశితంగా పరిశీలిస్తూ ఉండండి. అందులో ఏదైనా తేడాగా లేదా ప్రమాదకరంగా అనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి.
- యాంటీ మాల్వేర్ లేదా యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్‌ను డౌన్లోడ్ చేస్కోండి.
- మీకు తెలియని ఈ-మెయిల్ అడ్రస్‌ల నుంచి వచ్చే లింక్స్ లేదా అటాచ్‌మెంట్స్‌ను ఓపెన్ చేయొద్దు.
- అధికారిక సైట్స్‌కు సంబంధించిన ఎక్స్‌టెన్షన్స్‌ను మాత్రమే వాడండి. వాటిని ఇన్ స్టాల్ చేసేముందు రేటింగ్స్ తెలుసుకోండి. అలాగే వాటిపై పరిశోధన చేశాకే ఇన్ స్టాల్ చేయండి.
- తెలియని సోర్సెస్ నుంచి సాఫ్ట్ వేర్‌ను డౌన్ లోడ్ చేయొద్దు.
- కొత్త ప్రోగ్రామ్‌ను ఇన్ స్టాల్ చేసే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అనుకోకుండా ఏదైనా అవాంఛనీయ సాఫ్ట్ వేర్లను ఇన్ స్టాల్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్త తప్పనిసరి.
- పబ్లిక్ వై-ఫై లేదా ఉచిత వై-ఫై వాడే సమయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోండి.
- మీ డివైజ్‌లో పాస్వర్డ్స్ విషయంలో జాగ్రత్త తీసుకోండి. పాస్వర్డ్ బలంగా ఉండాలి. అదే సమయంలో టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ లాంటివి పెట్టడం కూడా మంచిది. తద్వారా డేటా మరింత సురక్షితంగా ఉంటుంది.
యాంటీ వైరస్ ఇన్ స్టాల్ చేయండి
ఒకవేళ మీరు వాడుతున్న బ్రౌజర్ హైజాక్ అయ్యిందని అనుమానం వచ్చిందా? అయితే భయపడాల్సింది లేదు. ఆ హైజాకర్ ఎవరో గుర్తించేందుకు ప్రయత్నించండి. బ్రౌజర్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఏదైనా అవాంఛనీయ ఎక్స్ టెన్షన్స్ లేదా యాడ్ ఆన్స్ ఉన్నాయేమో చూడండి. ఒకవేళ మీరెంత ప్రయత్నించినా హైజాకర్‌ను తొలగించడం కావట్లేదా? అప్పుడు యాంటీ వైరస్ సూట్ సాయం తీసుకోండి. ఏదైనా అధికారిక యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్‌ను ఇన్ స్టాల్ చేసుకొని స్కాన్ చేయండి. నెట్టింట ఎన్నో ఉచిత మాల్ వేర్ రిమూవల్ టూల్స్ ఉన్నాయి. వాటి సాయం తీసుకోండి సరిపోతుంది.
నిరంతరం గమనిస్తూ ఉండండి
హైజాక్‌కు గురైన బ్రౌజర్‌ను సెట్టింగ్స్‌లోకి వెళ్లి మ్యానువల్‌గా రీస్టార్ట్ చేయొచ్చు. అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. బ్రౌజర్‌ను అన్ ఇన్ స్టాల్ చేయడమన్నది మీరు చివరి ఎంపికగా పెట్టుకోవాలి. ఒకవేళ అదే చేద్దామనుకుంటే మాత్రం మీ బ్రౌజర్‌ను బ్రేవ్, ఫైర్ ఫాక్స్, క్రోమ్ లాంటి సురక్షితమైన బ్రౌజర్లతో రీప్లేస్ చేయండి. అయితే ఏ బ్రౌజర్‌ను వాడినా దాని పనితీరును నిరంతరం గమనిస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ ఉండాలి.
ఇవీ చదవండి : ఫాస్ట్ ఛార్జింగ్‌తో స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ తగ్గుతుందా?
ఫేస్బుక్లో ఫేక్ ప్రొఫైల్స్‌తో విసిగిపోతున్నారా? వాటికి చెక్ పెట్టండిలా..