ఇది సాంకేతిక యుగం. కనీవినీ ఎరుగనివి, అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేయడం ఇక్కడ సర్వసాధారణం. ఒకప్పుడు ఓ డబ్బా ఫోన్ ఉంటే చాలు గొప్పగా ఫీల్ అయిపోయేవారు. ఇప్పుడు దాదాపు ప్రతి ఇంట్లో ఓ 'స్మార్ట్'ఫోన్ ఉంది. అందులోనూ ఆ స్మార్ట్‌ఫోన్.. రోజుకో కొత్త అప్డేట్తో పలకరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంతవరకు ఎవరూ ఎరుగని రీతిలో ఓ టెక్నాలజీని రూపొందిస్తోంది చైనాకు చెందిన ఫోన్ల తయారీ సంస్థ వివో. ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు ఫోన్లో కెమెరాలు.. డ్రోన్ల తరహాలో గాలిలోకి ఎగురుతాయి. వినడానికే కొత్తగా, వింతగా ఉన్నప్పటికీ.. దీనిపై వివో సీరియస్‌గా కసరత్తు చేస్తోంది. ఇదే జరిగితే ఇక సెల్ఫీ స్టిక్స్‌తో అవసరం లేనట్టే!
ఏంటీ డ్రోన్ వ్యవస్థ?
'డిటాచెబుల్ ఫ్లయింగ్ కెమెరా సిస్టమ్'ను వివో అభివృద్ధి చేస్తోంది. పేరుకు తగ్గట్టే.. ఫోన్లోని కెమెరాలు డ్రోన్లలాగా గాలిలో ఎగరనున్నాయి. అంటే ఫొటోలు డ్రోన్ల యాంగిల్లో వస్తాయన్నమాట.
ఇందుకు సంబంధించిన పేటెంట్ల కోసం వివో దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం.
ఎలా పనిచేస్తుంది?
వివో ప్రకారం.. ఈ డ్రోన్ వ్యవస్థ ఉండే ఫోన్.. సాధారణ స్మార్ట్‌ఫోన్‌లాగే ఉంటుంది. అయితే.. ఇందులో అదనంగా డ్యుయెల్ కెమెరా, మూడు ప్రాక్సిమిటీ సెన్సర్లు, నాలుగు ప్రొపెల్లర్లు, ఒక అదనపు బ్యాటరీ వ్యవస్థ ఉంటాయి. ఇవి ఓ మౌంటింగ్ బ్రాకెట్‌కు జోడించి ఉంటాయి. ఇవన్నీ ఫోన్ లోపలే ఉంటాయి. అవసరం అయినప్పుడు.. క్లిక్ చేస్తే.. ఫోన్ పైభాగం నుంచి అవి బయటకు వస్తాయి. ఆ తర్వాత మౌంటింగ్ బ్రాకెట్.. ఫోన్ నుంచి విడిపోయి.. గాలిలోకి ఎగురుతుంది. స్మార్ట్‌ఫోన్‌లో నుంచి దానిని కంట్రోల్ చేస్తూ ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు. అన్ని యాంగిల్స్‌లోనూ ఫొటోలు తీసుకునే విధంగా ఈ కెమెరాలను అమర్చనున్నారు.
అయితే.. ఇలా గాలిలో ఎగరడం వల్ల కెమెరాలకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏదైనా తగిలి అవి కిందపడిపోయే ప్రమాదం ఉంది. వీటిని కూడా దృష్టిలో పెట్టుకునే ఈ డ్రోన్ వ్యవస్థను రూపొందిస్తోంది వివో. ఏదైనా వస్తువును ఢీకొట్టకుండా ఉండేందుకు వాటిని ముందుగానే గుర్తించే విధంగా ఇందులో ప్రాక్సిమిటీ సెన్సర్లను అమర్చనుంది.
ఇదీ చూడండి:- వివో కొత్త ఫోన్ ఫీచర్స్ లీక్- ధరెంతంటే?