Space Garbage Around Earth : వివిధ దేశాలు చేస్తున్న అంతరిక్ష ప్రయోగాల వల్ల రోదసీలో భారీ సంఖ్యలో వ్యర్థాలు పేరుకుపోయాయి. 10 సెంటీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్న మిలియన్ల కొద్దీ అంతరిక్ష వ్యర్థాల వల్ల.. రోదసీలో మనం పంపిన ఉపగ్రహాలు ఇతర కీలక పరికరాలకు భీకర ముప్పు పొంచి ఉంది. ఇలాంటి చిన్న వస్తువులను జాబితాలో చేర్చరు. ఐతే జాబితాలో చేర్చిన పెద్ద వస్తువులే 27 వేలకు పైగా ఉన్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తెలిపింది. వీటిలో 80 శాతం వ్యర్థాలే కావడం గమనార్హం. ఇక యాంటీ శాటిలైట్ పరీక్షలు కూడా రోదసీ ఆస్తులకు ముప్పు కలిగిస్తాయి. యాంటీ శాటిలైట్ పరీక్షలు చేయగలిగే సామర్థ్యం అమెరికా, రష్యా, భారత్, చైనా వద్ద మాత్రమే ఉంది.
అంతరిక్షంలో పెద్ద ఎత్తున వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల జులై 30వ తేదీన శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ ప్రయోగం ఒక నిమిషం పాటు ఆలస్యమైంది. షెడ్యూల్ ప్రకారం ఉదయం ఆరున్నరకు నింగిలోకి వెళ్లాల్సిన పీఎస్ఎల్వీ.. 6 గంటల 31 నిమిషాలకు వెళ్లినట్టు ఇస్రో తెలిపింది. 500 కిలోమీటర్ల పైన భూకక్ష్యలో అంతరిక్ష వస్తువులతో ఆ ప్రాంతం దట్టంగా నిండిపోవడం వల్ల ప్రయోగానికి ఆలస్యమైనట్టు పేర్కొంది.
వసుధైక కుటుంబం అన్న స్ఫూర్తితో..
ISRO Indian Space Research Organisation : భూ ఉపరితలం నుంచి 500 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూకక్ష్య అత్యంత విలువైనదని ఇస్రో తెలిపింది. వసుధైక కుటుంబం అన్న స్ఫూర్తితో ఇస్రో స్వచ్ఛందంగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసింది. ప్రయోగించిన రాకెట్ల కక్ష్యను 300 కిలోమీటర్లకు తగ్గించడం ద్వారా నాలుగవ దశలోని పీఎస్ఎల్వీ వ్యర్థాలు భూమికి తిరిగి చేరి కాలిపోతున్నాయి. ఇస్రో ఇలా చేయకపోతే పద్దెనిమిదేళ్లు పైకక్ష్యలోనే ఇవి వ్యర్థాలుగా తిరుగుతూ ఉంటాయి.
పెద్ద సైజులో 26వేల783 అంతరిక్ష వ్యర్ధాలు..
ISRO Space Debris : యూఎస్ స్పేస్ కమాండ్ అంచనా ప్రకారం 10 సెంటీమీటర్ల సైజు కన్నా పెద్ద సైజులో 26వేల783 అంతరిక్ష వ్యర్ధాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరింత చిన్న అంతరిక్ష వస్తువులు లక్షల సంఖ్యలో ఉన్నట్లు అంచనా. ఇందులో 40 శాతం స్పేస్ వ్యర్ధాలు అమెరికాకు చెందినవని.. రష్యాకు చెందినవి 28 శాతం, చైనాకు చెందినవి 19 శాతం ఉన్నట్లు ఇస్రో తన రిపోర్టులో తెలిపింది. భారత్ వల్ల ఏర్పడిన అంతరిక్ష వ్యర్ధాల శాతం కేవలం 0.8 శాతం మాత్రమేనని వివరించింది. సంఖ్యా పరంగా చూస్తే కేవలం 217 వస్తువులు మాత్రమే అని ఇస్రో తన రిపోర్టులో వెల్లడించింది.
మహా స్పేస్ఎక్స్.. రోదసి ప్రయోగాల్లో నవశకం.. భారత్‌లోనూ ప్రోత్సహిస్తే..
స్పేస్‌లో పెట్రోల్ పంపులు.. రోదసిలోనే రాకెట్లకు ఇంధనం.. త్వరలోనే సాకారం!