వినియోగదారులకు భద్రతాపరంగా మరింత మెరుగైన సేవలు అందించడంలో భాగంగా గూగుల్ సంస్థ ప్లేస్టోర్ నుంచి 11 యాప్‌లను తొలగించింది. భద్రతా తనిఖీల్లో భాగంగా ఈ యాప్‌లన్నింటిలో.. 'జోకర్ మాల్‌వేర్'ను గూగుల్ గుర్తించి చర్యలు తీసుకున్నట్లు చెక్ పాయింట్ అనే సెక్యూరిటీ సొల్యూషన్స్ సంస్థ తెలిపింది. వినియోగదారులు వెంటనే ఆ యాప్‌లను తమ మొబైల్ ఫోన్‌ల నుంచి తొలగించాలని గూగుల్ సూచించినట్లు సమాచారం.
ఇలా వస్తుంది...!
హ్యాకర్లు ఎంచుకున్న కొన్ని యాప్‌ల సాయంతో వినియోగదారుడి ఫోన్లోకి ఈ మాల్వేర్ను ప్రవేశపెడతారు. ఆ తర్వాత ఆ వైరస్... యాప్‌ల ద్వారా యూజర్ ప్రమేయం లేకుండా నకిలీ ప్రీమియం సర్వీసులను సబ్‌స్క్రైబ్ చేసుకుంటుంది. ఫోన్‌కు సంక్షిప్త సందేశం పంపి అందులోని ఓటీపీని ఆటోమేటిక్‌గా తీసుకొని నిర్ధరించుకుంటుంది. ఈ ప్రక్రియ పూర్తయి బ్యాంక్ ఖాతా నుంచి మనీ విత్ డ్రా అయినట్లు సందేశం వచ్చేవరకు వినియోగదారుడికి ఏం తెలియదు. కనీసం ఈ విషయాన్ని గూగుల్ ప్లే ప్రొటెక్షన్ ఫ్రేమ్‌వర్క్ కూడా గుర్తించలేకపోయిందట. తాజాగా ఈ వైరస్ గుట్టును పసిగట్టిన గూగుల్.. జోకర్ వైరస్‌కు బందీగా ఉన్న 11 యాప్‌లను స్టోర్ నుంచి తొలగించింది.
ఈ నెల మొదట్లో కూడా నిబంధనల ఉల్లంఘన, సమాచార అపహరణ ఆరోపణల కింద 25 యాప్‌లను ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించింది. వీడియో/ఫొటో ఎడిటింగ్, వాల్‌పేపర్, ఫ్లాష్ లైట్ యాప్‌లకు వినియోగదారుల నుంచి ఎక్కువ ఆదరణ ఉండటం వల్ల అటువంటి వాటి నుంచే మాల్‌వేర్ వ్యాప్తి జరుగుతోందని పలు సైబర్ సెక్యూరిటీ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.
డెక్స్ ఫైల్ వల్లే...
తనను గుర్తించకుండా ఉండేందుకు జోకర్ వైరస్ పాత టెక్నిక్లను వినియోగిస్తోందని, రెండు మార్గాల ద్వారా స్మార్ట్ ఫోన్లలోకి ప్రవేశిస్తోందని నిపుణులు వెల్లడించారు. మాల్వేర్ను తయారు చేసిన వారు దాని కోడ్‌ను తగ్గించారని, అది కూడా 'డెక్స్' ఫైల్ రూపంలో ఉండి, గుర్తించేందుకు క్లిష్టతరంగా మారిందని స్పష్టం చేశారు.
ఇవే ఆ యాప్‌లు...
ఇమేజ్ కంప్రెస్, రిలాక్సేషన్, ఆండ్రాయిడ్ ఎస్ఎంఎస్, చీరి, సెండ్ ఎస్ఎంఎస్, లవింగ్ లవ్ మెసేజ్, విత్ మీ, హెచ్ఎం వాయిస్, ఫ్రెండ్స్ ఎస్ఎంఎస్, రికవరీ ఫైల్స్, ఎల్ ప్లాకర్, రిమైండ్ మీ, మెమొరీ గేమ్ ట్రయినింగ్ తొలగించిన యాప్‌ల జాబితాలో ఉన్నాయి.