Tips for mobile apps: యాప్‌లోనైనా, ప్రోగ్రామ్‌లోనైనా తేలికగా పనులు చేసుకోవటానికి ఉపయోగపడే చిట్కాలంటే ఎవరికి ఇష్టముండదు? ఆయా యాప్‌లను తరచూ వాడుతున్నట్టయితే ఇలాంటివి మరింత సౌకర్యంగానూ ఉంటాయి. అలాంటి కొన్ని దగ్గరి దారులు ఇవిగో..
యూట్యూబ్ వీడియో అక్కడ్నుంచే
- పీసీలోనో, ల్యాప్‌టాప్‌లోనో యూట్యూబ్ వీడియోలు చూస్తుంటాం. ఏదో ఘట్టం ఆసక్తికరంగా అనిపిస్తుంది. మొత్తం వీడియోను కాకుండా ఆ భాగాన్నే నేరుగా ఇష్టమైనవారికి షేర్ చేయాలనిపిస్తే? ఇందుకు మార్గం లేకపోలేదు. వీడియో కిందుండే షేర్ బటన్‌ను నొక్కి, లింకు దిగువన చెక్‌బాక్స్‌ను చూడండి. అందులో వీడియోను ఆపేసినప్పటి సమయం ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది. ఆ సమయాన్ని ఎంచుకొని, లింక్‌ను కాపీ చేసి షేర్ చేసుకోవచ్చు. కావాలంటే వీడియోలో మీకు ఇష్టమైన సమయాన్ని కూడా ఎంచుకోవచ్చు.
స్క్రీన్ షాట్ అంతవరకే
- స్క్రీన్ షాట్ చాలాసార్లు అవసరపడుతుంది. మొత్తం స్క్రీన్‌ను ఫొటో తీస్తే భద్రతకు భంగం కలగొచ్చు. మరి అవసరమైన భాగాన్నే స్క్రీన్ షాట్ తీయాలంటే? మ్యాక్ వాడేవారైతే కమాండ్, షిఫ్ట్, 5 బటన్లను కలిపి ఒకేసారి నొక్కాలి. దీంతో చదరపు ఆకారం కనిపిస్తుంది. అవసరమైన భాగాన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. విండోస్ 10లోనైతే స్టార్ట్ బటన్‌తో సెర్చ్ బార్‌లోకి వెళ్లి స్నైపింగ్ టూల్ అని టైప్ చేయాలి. అప్పుడు స్క్రీన్ మీద బాక్స్ ప్రత్యక్షమవుతుంది. దీంతో అవసరమైన భాగాన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు.
గూగుల్‌లో కేవలం ఆ సైట్లే
- గూగుల్‌లో ఏదైనా సెర్చ్ చేస్తే వందల కొద్ది సైట్లు ప్రత్యక్షమవుతాయి. వీటిల్లో మనకు నిజంగా కావాల్సిన వెబ్‌సైట్‌ను వెతుక్కోవటానికే సమయం సరిపోతుంది. గూగుల్‌లోని సైట్ ఫీచర్‌తో ఇలాంటి ఇబ్బందిని తేలికగా తప్పించుకోవచ్చు. బ్రౌజర్‌లో గూగుల్‌ను ఓపెన్ చేసి వెబ్‌సైట్‌కు ముందు site: అని టైప్ చేస్తే సరి. ఉదాహరణకు మీరు ఈటీవీభారత్ వెబ్‌సైట్ కోసం సెర్చ్ చేస్తున్నారనుకోండి. site: www.etvbharat.com అని టైప్ చేయాలన్నమాట. దీంతో అన్నీ ఈటీవీభారత్ వెబ్‌సైట్‌కు సంబంధించిన అంశాలే కనిపిస్తాయి.
డాక్స్‌లోనూ వాయిస్ టెక్స్ట్
- ఫోన్‌లోని స్పీచ్-టు-టెక్స్ట్ ఫీచర్ ద్వారా మెసేజ్‌లను, ఈ మెయిళ్లను మాటలతోనే టైప్ చేయొచ్చని తెలిసిందే. మరి దీన్ని గూగుల్ డాక్స్‌లోనూ ఉచితంగానే వాడుకోవచ్చని తెలుసా? ఇందుకోసం ముందుగా గూగుల్ డాక్స్‌లో డాక్యుమెంట్‌ను తెరవాలి. టూల్స్ మెనూ ద్వారా వాయిస్ టైపింగ్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. అంతే.. మాట్లాడుతుంటే టెక్స్ట్ టైప్ అవుతుంది. ఇది కామా, న్యూ పేరాగ్రాఫ్ వంటి వాటినీ గుర్తిస్తుంది.
ఇదీ చూడండి: ట్విట్టర్లో టిక్‌టాక్ తరహా స్వైపింగ్ ఆప్షన్!