భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రతలకు హాని కలిగిస్తోందనే ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వం చేత వేటుకు గురైన ప్రముఖ షార్ట్ వీడియో మేకింగ్ ఫ్లాట్‌ఫాం టిక్‌టాక్ తిరిగి భారత్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టిక్‌టాక్ లేని లోటును పూరించడానికి ప్రముఖ సామాజిక మాధ్యమాలైన యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లు వేర్వేరు పేర్లతో నెటిజన్ల ముందుకు వచ్చాయి. కానీ అవి అంతగా ప్రభావం చూపలోకపోయాయి. దీంతో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన టిక్‌టాక్ తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు తిరిగి భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుందని తెలుస్తోంది.
టెక్నాలజీకి సంబంధించిన కొన్ని వార్తా సంస్థల కథనాల ప్రకారం.. టిక్‌టాక్ మాతృసంస్థ అయిన బైట్‌డ్యాన్స్ ఆ అప్లికేషన్ పేరులోని కొన్ని అక్షరాలు మార్చి అంటే.. ఈ TikTok కాస్తా TickTock పేరుతో అదే కంటెంట్‌తో తిరిగి భారతీయ మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా అనుమతులు పొందేలా ప్రయత్నిస్తోందట. ఇందుకు సంబంధించిన అనుమతుల కోసం కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్, ట్రేడ్‌మార్క్స్ (సీజీపీడీటీఎం)కు దరఖాస్తు చేసిందట.
కొత్త పేరుతో వస్తోన్న అప్లికేషన్లో కూడా గతంలోలానే మల్టీ మీడియా ఎంటర్టైన్మెంట్ కంటెంట్‌తో పాటు మల్టీ మీడియా ఇంట్రాక్టివ్ అప్లికేషన్లను కూడా తీసుకువస్తున్నారు. నిజానికి ఇది భారత్ నిషేధించిన యాప్ లాంటిదే. అయితే ఇది పక్కాగా ఎప్పుడు మనదేశంలో లాంచ్ చేస్తారు అనే దానిపై ఎవరి దగ్గరా పూర్తిస్థాయి సమాచారం లేదు.
ఏదైమైనా.. భద్రతపరమైన సవాళ్లను ఎదుర్కోవాలి అంటే బైట్‌డ్యాన్స్ కొంత కష్టపడక తప్పదు. అంతేగాకుండా టిక్‌టాక్ ఆన్లైన్ కంటెంట్‌ను నిక్షిప్తం చేయడానికి తిరిగి చైనా సర్వర్లను ఉపయోగిస్తే గతంలో చవి చూసిన చేదు అనుభవాలనే తిరిగి రుచి చూడాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి: చైనా సర్వర్లకు 'పబ్జీ' కొత్త గేమ్ డేటా?