అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల పాత్ర మెరుగుపర్చేందుకు దోహదపడేలా ఏర్పాటు చేసిన 'ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్'(ఇన్-స్పేస్) ఛైర్మన్ పదవి కోసం ఇస్రోకు చెందిన ముగ్గురు సీనియర్ శాస్త్రవేత్తల పేర్లను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించారు అధికారులు.
విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఎస్ సోమ్‌నాథ్, యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ పీ కున్హికృష్ణన్, ఇస్రో ఇంటీరియల్ సిస్టమ్ యూనిట్ డైరెక్టర్ శ్యామ్ దయాల్ దేవ్ల పేర్లను ప్రతిపాదించినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే తుది పేరును ఖరారు చేయనున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి ఇన్‌స్పేస్ ప్రకటన జారీ చేస్తుందని వెల్లడించారు.
ఇన్-స్పేస్
ఇన్-స్పేస్ సంస్థ ఏర్పాటును ఆమోదిస్తూ కేంద్ర కేబినెట్ ఈ ఏడాది మొదట్లో నిర్ణయం తీసుకుంది. సింగిల్ విండో నోడల్ ఏజెన్సీగా ఇది ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇస్రో అంతరిక్ష ప్రయోగాలలో ప్రైవేటు సంస్థలు, స్టార్టప్‌లు భాగస్వామ్యం అయ్యేలా ఈ సంస్థ ప్రోత్సాహం అందిస్తుంది. ప్రైవేటు సంస్థలకు అనుమతులు ఇవ్వడం సహా వారి పనితీరును పర్యవేక్షిస్తుంది.
ఇన్-స్పేస్ బోర్డులో ప్రైవేటు పరిశ్రమ వర్గాలు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలను ప్రోత్సహించేందుకు ఇది జాతీయ స్థాయిలో నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది.
ఇదీ చదవండి- అంతరిక్ష పోటీలో ప్రైవేటు భాగస్వామ్యం పాత్ర ఏంటి?