ETV Bharat / science-and-technology

కాల గర్భంలో తరువాత కనుమరుగయ్యేది మనిషేనా? - ఆరో మహా అంతర్ధాన ప్రక్రియ

జీవుల అంతర్ధానం అనగానే డైనోసార్లు కనుమరుగవటమే గుర్తుకొస్తుంది. భూమిని ఢీకొట్టిన గ్రహ శకల ప్రభావంతో అంత పెద్ద డైనోసార్లు పూర్తిగా అదృశ్యమైపోయాయి మరి. మనకు కాస్త సమీప కాలంలో జరిగింది కావటం, తరచూ దీని గురించి ప్రస్తావిస్తుండటంతో ఇదే మన మనసులో మెదులుతుంటుంది. నిజానికి దీనికన్నా ముందే నాలుగు సార్లు జీవులు పెద్ద ఎత్తున అంతర్ధానమయ్యాయి. ఇప్పుడు మనం ఆరో మహా అంతర్ధాన ప్రక్రియలోనే జీవిస్తున్నాం. దీనికి మనిషి ప్రోద్బలమే కారణమవుతుండటం విషాదం. ఇంతకీ మహా అంతర్ధానాలు ఎలా సంభవిస్తాయి? వీటి నుంచి మనం నేర్చుకోవలసిందేంటి? ఇవి మళ్లీ జరగకుండా ఆపటమెలా?

5 species that disappear from earth
మహా అంతర్ధానం
author img

By

Published : Jun 23, 2021, 12:16 PM IST

నకేమీ తెలియకపోవచ్చు. ఎలాంటి తేడా కనిపించకపోవచ్చు. కానీ భూమ్మీద మనిషితో సహ జీవనం చేసే జీవులు శరవేగంతో అంతరిస్తున్నాయి. గత 50 ఏళ్ల నుంచీ వెన్నెముక గల ప్రాణులు (సకశేరుకాలు) సగటున 68% మేరకు తగ్గిపోయాయి. ప్రస్తుతం 35వేల జాతులు అంతరించే దశలో ఉన్నాయి. ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ (ఐయూసీఎన్‌) చెబుతున్న మాట ఇది. ఒక్క 20వ శతాబ్దంలోనే దాదాపు 543 సకశేరుకాలు అంతర్ధానమైనట్టు పరిశోధన పత్రాలు పేర్కొంటున్నాయి. దీనికి ఒకరకంగా మనల్నే నిందించుకోవాల్సి ఉంటుంది. భూగోళం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పర్యావరణ సంక్షోభానికి మనిషే ప్రధాన కారణమన్నది కాదనలేని సత్యం. పారిశ్రామిక విప్లవం ఆరంభమైనప్పట్నుంచే ఇది మొదలైంది. గ్రీన్‌హౌజ్‌ వాయువుల ఉద్గారాలు, ఓజోన్‌ పొర తగ్గటం దగ్గర్నుంచి అడవుల నరికివేత, ప్లాస్టిక్‌ వ్యర్థాలు, జంతువుల అక్రమ వ్యాపారం వరకూ అన్నీ పర్యావరణానికి హాని చేస్తూనే వస్తున్నాయి. జీవుల మనుగడను ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్తేస్తూనే ఉన్నాయి. వాతావరణ మార్పు, జీవ జాతుల అంతర్ధానం సహజమైన ప్రక్రియేనని వాదించేవారు లేకపోలేదు. ఒకరకంగా ఇది నిజమే కావొచ్చు కూడా. ఆ మాటకొస్తే తొలి ఐదు మహా అంతర్ధానాలు మనిషి లేనప్పుడే జరిగాయి. కానీ అప్పటితో పోలిస్తే అంతర్ధాన ప్రక్రియ ఇప్పుడు మరింత వేగంగా సాగుతుండటమే ఆందోళనకరమైన విషయం.

5 species that disappear from earth
కాలగర్భం

మనమే కారణమా?
శిలాజాలు మనకన్నా ముందు నివసించిన జీవులనే కాదు, మనుషులు లేని సమయంలో అవి ఎంతకాలం సహజంగా మనుగడ సాగించాయనేదీ తెలియజేస్తాయి. దీన్నే నేపథ్య వేగం (బ్యాక్‌గ్రౌండ్‌ రేట్‌) అంటారు. ఇది ఏటా ప్రతి 10 లక్షల జీవులకు ఒక జాతి అంతరించటంతో సమానం. ప్రస్తుతం మానవ చర్యల మూలంగా ఈ వాస్తవ నేపథ్య వేగం లక్షలాది రెట్లు ఎక్కువగా పెరిగిపోయింది. అంటే జీవులు సహజంగా అంతరించే వేగంతో పోలిస్తే ఇప్పుడు చాలా చాలా త్వరగా అంతరిస్తున్నాయనే అర్థం. మానవ కార్యకలాపాలు లేనట్టయితే అంతరించిపోయిన జీవజాతుల్లో కొన్ని 800 ఏళ్ల నుంచి 10వేల ఏళ్ల వరకు ఇంకా మనుగడ సాగించి ఉండేవని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో పరిశీలిస్తే ఇదే నిజమేననీ అనిపిస్తుంది. నాసా లెక్కల ప్రకారం- కొవిడ్‌ ఆరంభంలో పలు దేశాల్లో విధించిన నిర్బంధం ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాలు 17%, నైట్రోజన్‌ ఆక్సైడ్‌ స్థాయులు 20% పడిపోయాయి. జలవనరులు శుభ్రమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా పట్టణ వీధుల్లో జంతువులు షికారు చేయటమూ చూశాం. ఇవి భూగోళం తిరిగి కోలుకుంటోందనే ఆశలు రేకెత్తించాయి. కానీ అదంతా తాత్కాలికమే. మనుషుల రాకపోకలు, చర్యలు యథావిధిగా మొదలయ్యాక అంతర్ధాన వేగం మునపటి స్థితికే చేరుకుంది. పర్యావరణ పర్యటన ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి సంరక్షణను బాగానే ఉత్తేజితం చేసింది. అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించటంతో ఇది కాస్తా ప్రమాదం అంచుకు చేరుకుంది. పర్యటకుల నుంచి ఆదాయం రాకపోవటంతో ప్రకృతి సంరక్షకులు జంతువులను కాపాడలేక చేతులెత్తే స్థితికి చేరుకున్నారు. బోట్స్‌వానాలో ఖడ్గమృగాలు, దక్షిణ అమెరికాలో చిరుతలు, భారత్‌లో పులులు వేటగాళ్ల బారినపడి ప్రాణాలు కోల్పోవటం ఈ విషయాన్నే కళ్లకు కడుతోంది.

ఆపగలిగింది మనమే

జీవుల ఆరో అంతర్ధాన ప్రక్రియ వేగం పుంజుకోవటానికి కారణమవుతున్నప్పటికీ దీన్ని ఆపగలిగిందీ మనిషే. కొవిడ్‌-19 విజృంభణ నేపథ్యంలో వన్యప్రాణి మార్కెట్లు పర్యావరణానికే కాదు, ఆరోగ్యానికీ హానికరమేనన్న స్పృహ పెరగటం కొత్త ఆశలు రేకేత్తిస్తోంది. వియత్నాం ప్రభుత్వం వన్యప్రాణుల దిగుమతి, అక్రమ వన్యప్రాణి మార్కెట్లపై నిషేధం విధించింది కూడా. ఇలాంటి ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా అమలైతే మంచి ఫలితం కనిపిస్తుందనటం నిస్సందేహం. ఇందుకు సాంకేతిక పరిజ్ఞానం వాడకమూ ఎంతగానో ఉపయోగపడుతుంది.

జీవుల సంఖ్యను పర్యవేక్షించటం

ఉపగ్రహ చిత్రాలు, కృత్రిమ మేధ మేళవింపుతో అంతరిక్షం నుంచే జంతువులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించొచ్చు. ఇటీవల ఆఫ్రికా గడ్డి మైదానాల హైరెజల్యూషన్‌ ఫొటోలతో పరిశోధకులు రూపొందించిన ఆల్గోరిథమ్‌ దీనికి మంచి ఉదాహరణ. దీంతో వేలాది మైళ్ల విస్తీర్ణంలో ఏనుగులను లెక్కించారు. అదీ క్షణాల్లోనే. పెద్ద జంతువులనే కాదు.. చిన్న ప్రాణులను, పొదల్లో దాగున్న వాటిని గుర్తించే విధంగానూ దీన్ని తీర్చిదిద్దే దిశగా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ఆరంభించారు. ఉదాహరణకు- పెంగ్విన్ల కాలనీల సైజును బట్టి వాటి సంఖ్యను లెక్కించటం, పాద ముద్రల ఆధారంగా చిన్న జంతువుల గుంపులను పసిగట్టటం.

క్లోనింగ్‌

క్లోనింగ్‌ ప్రక్రియ మరో పరిష్కారం కానుంది. సుమారు 30 ఏళ్ల కిందట చనిపోయిన బ్లాక్‌ ఫుటెడ్‌ ఫెర్రెట్‌ క్షీరదం నుంచి కొత్త జంతువును విజయవంతంగా క్లోన్‌ చేసినట్టు గత సంవత్సరం శాస్త్రవేత్తలు ప్రకటించటం గమనార్హం. ఉత్తర అమెరికాలో నివసించే ఇవి 1980లో చిన్న గుంపుగా కనిపించేంతవరకు అంతరించాయనే అనుకున్నారు. అనంతరం వీటిని పెంచినప్పటికీ మరోసారి అంతరించే ముప్పులో పడ్డాయి. దీంతో 1980లో చనిపోయిన ఆడ ఫెర్రెట్‌ జన్యు ప్రతి నుంచి క్లోన్‌ చేశారు. ఇలా క్లోన్‌ చేసిన జంతువులను కొంత కాలం తర్వాత తిరిగి అడవుల్లో విడిచిపెట్టే అవకాశముందని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.

ఐదు మహా అంతర్ధానాలు ఇవే!

అతి తక్కువ భౌగోళిక సమయంలో (దాదాపు 28 లక్షల సంవత్సరాల కాలంలో) సుమారు మూడొంతుల జీవులు మరణించటాన్ని మహా అంతర్ధానంగా శాస్త్రవేత్తలు పేర్కొంటారు. ఇలాంటివి ఇప్పటివరకు భూమ్మీద ఐదు సంభవించాయి. వీటిని పరిశీలిస్తే మనం చేయకూడని పనులేంటో కూడా అర్థమవుతుంది.

5 species that disappear from earth
ఆర్డోవిసియన్‌-సిలురియన్‌

1. ఆర్డోవిసియన్‌-సిలురియన్‌ అంతర్ధానం (44 కోట్ల ఏళ్ల క్రితం)

పగడాలు (కోరల్స్‌), బ్రాకియోపాడ్స్‌ వంటి ప్రాణులు నీటి లోతుల్లో నివసిస్తూ, ఇంకా భూమి మీదికి అడుగుపెట్టని కాలంలో జరిగిన అంతర్ధానమిది. వాతావరణం మార్పుతో సముద్రాల ఉష్ణోగ్రత మారిపోవటం దీనికి మూలం. ఫలితంగా మహా సముద్రాల్లో 85% జీవులు అంతరించిపోయాయి. ఆర్డోవిసియన్‌ కాలంలో దక్షిణ మహాఖండం గోండ్వానాలో పెద్దఎత్తున మంచు గడ్డకట్టటంతో ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు తగ్గిపోయాయి. దీంతో జీవుల ఆవాసాలు, ఆహార చట్రం దెబ్బతిన్నాయి. సంతానోత్పత్తి తగ్గిపోయింది. చివరికి జీవులు పెద్ద సంఖ్యలో అంతరించిపోయాయి.

5 species that disappear from earth
లేట్‌ డెవోనియన్‌

2. లేట్‌ డెవోనియన్‌ అంతర్ధానం (36.5 కోట్ల ఏళ్ల క్రితం)

డెవోనియన్‌ కాలాన్ని 'చేపల యుగం'గానూ పిలుస్తుంటారు. అది భూమి మీద జీవుల పరిణామం ఆరంభమవుతున్న కాలం. వీటిల్లో చాలావరకు మహా సముద్రాల నుంచి భూమి మీదికి చేరుకున్నవే. చెట్లు, పవ్వుల వంటివి ఈ రెండో మహా అంతర్ధానానికి కారణమయ్యాయని భావిస్తుంటారు. చెట్లు వేళ్లను రూపొందించుకోవటం మొదలెట్టాక అవి రాళ్లూ రప్పలను మట్టిగా మార్చటం ఆరంభించాయి. పోషకాలతో కూడిన ఈ మట్టి సముద్రాల్లోకి చేరుకోవటం వల్ల నాచు (ఆల్గే) పెద్దఎత్తున పుట్టుకొచ్చింది. ఇవి మహా సముద్రాల మీద భారీ 'మృత ప్రాంతాలు' ఏర్పడేలా చేశాయి. నీటిలోని ఆక్సిజన్‌ను ఆల్గే స్వీకరించటంతో అక్కడి సముద్ర ప్రాణులకు ఊపిరి ఆడలేదు. వీటి ఆహార చట్రం అస్తవ్యస్తమైంది. అగ్ని పర్వతాలు పేలటం వల్ల సముద్రాల్లో ఆక్సిజన్‌ శాతం తగ్గిపోయి ఉండొచ్చన్నది కొందరు శాస్త్రవేత్తల వాదన. ఏదేమైనా మారిన పరిస్థితులను తట్టుకోలేని జీవులు పెద్ద ఎత్తున మరణించాయి. సుమారు 75% జీవులు అంతరించాయి.

5 species that disappear from earth
పర్మియన్‌-ట్రయాసిక్‌

3. పర్మియన్‌-ట్రయాసిక్‌ అంతర్ధానం (25.3 కోట్ల ఏళ్ల క్రితం)

భూమ్మీద సంభవించిన అతిపెద్ద జీవుల అంతర్ధానం ఇదే. అందుకే దీన్ని 'మహా మరణం' అనీ అంటారు. ఇది భూగోళం మీది మొత్తం జీవుల్లో 90% ప్రాణులను అంతం చేసింది. దీనికి మూలం అగ్ని పర్వతాలు విపరీతంగా పేలటం. పర్మియన్‌ కాలం చివర్లో ప్రస్తుతం సైబీరియా ఉన్న ప్రాంతంలో భారీగా అగ్ని పర్వతాలు విస్ఫోటమయ్యాయి. దీంతో వాతావరణంలోకి పెద్ద ఎత్తున కార్బన్‌ డయాక్సైడ్‌ విడుదలైంది. గ్రీన్‌హౌజ్‌ ప్రభావంతో భూమి వేడెక్కింది. సముద్ర మట్టాలు పెరిగిపోయాయి. సముద్ర జలాల్లో కార్బన్‌ డయాక్సైడ్‌ కలవటంతో ఆక్సిజన్‌ తగ్గిపోయి ప్రాణులు విలవిల్లాడిపోయాయి. దీంతో 96% సముద్ర జీవులు అంతరించిపోయాయి. ఆమ్ల వర్షం కురవటంతో నేల మీద 70% జీవులు అంతరించాయి.

5 species that disappear from earth
ట్రయాసిక్‌-జురాసిక్‌

4. ట్రయాసిక్‌-జురాసిక్‌ అంతర్ధానం (20.1 కోట్ల ఏళ్ల క్రితం)

అది డైనోసార్లు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కాలం. దురదృష్టం కొద్దీ ఆ సమయంలోనే పెద్ద సంఖ్యలో అగ్ని పర్వతాలు పేలటం మొదలైంది. నాలుగో మహా అంతర్ధానానికి కారణమేంటన్నది స్పష్టంగా తెలియదు. కానీ ప్రస్తుతం అట్లాంటిక్‌ మహా సముద్రం ఉన్న ప్రాంతంలో భారీగా అగ్ని పర్వతాలు పేలాయని శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. దీంతో పర్మియన్‌ కాలంలో మాదిరిగానే వాతావరణంలో కార్బన్‌ డయాక్సైడ్‌ స్థాయులు పెరిగి, వాతావరణం మారిపోయింది. కార్బన్‌ డయాక్సైడ్‌ మోతాదులు పెరగటంతో భూ ఉపరితలం కింద గడ్డకట్టిన మంచు నుంచి మిథేన్‌ వాయువు విడుదలైందనీ కొందరు శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. కారణమేదైనా భారీ మొసళ్లు, ఆకాశంలో ఎగిరే టెరోసార్స్‌ సైతం కనుమరుగయ్యాయి. దాదాపు 80% జీవులు అంతరించాయి.

5 species that disappear from earth
కె-పీజీ

5. కె-పీజీ అంతర్ధానం (6.6 కోట్ల ఏళ్ల క్రితం)

ఇది డైనోసార్లు చనిపోయిన రోజుగా పరిచితమైంది. దీనికి మూలం భూమిని భారీ గ్రహ శకలం ఢీకొట్టటం. ప్రస్తుత మెక్సికోలోని యుకటన్‌ ప్రాంతంలో 13 కిలోమీటర్ల వెడల్పు గల గ్రహ శకలం గంటకు 72వేల కి.మీ. వేగంతో ఢీకొట్టింది. దీంతో సుమారు 1,450 కిలోమీటర్ల మేర భూమి దగ్ధమైంది. ఎగిసిన ధూళి, దుమ్ముతో నెలల కొద్దీ వాతావరణం నల్లబడిపోయింది. సూర్యరశ్మి అందక చెట్లు ఎండిపోయాయి. డైనోసార్ల ఆహార చట్రం అస్తవ్యస్తమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గి, తీవ్రమైన చలి నెలకొంది. ఫలితంగా 18 కోట్ల ఏళ్ల పాటు సాగిన డైనోసార్ల హవాకు తెరపడింది. సుమారు 75% జీవులు కనుమరుగయ్యాయి. ఆకాశంలో ఎగిరే, భూమిలో దాక్కొనే, సముద్రం లోతుల్లోకి వెళ్లగల జీవులు బతికి బయటపడ్డాయి.

ఇదీ చూడండి: వాతావరణ మార్పులతో ముసురుతున్న ముప్పు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.