Prevent Cyber Crime : '5జీ' తరంలో వచ్చేదంతా ఇక వర్చువల్ (ఊహా) ప్రపంచమే. మెటావర్స్ సరికొత్త వాస్తవ అనుభూతిని అందించబోతోంది. అయితే, సైబర్ మోసగాళ్లు సృష్టించే 'మెటావర్స్ మాయ'లో మాత్రం మనం పడొద్దు. ఇక నుంచి.. 'మీకు నచ్చిన అనుభూతిని కలిగిస్తాం' అని, 'మిమ్మల్ని ఊహాప్రపంచపు అంచుల్లోకి తీసుకెళ్తాం' అని, అందుకు అవసరమైన ఎక్విప్‌మెంట్స్ (పరికరాల)ను తక్కువ ధరకే అందిస్తామని సైబర్ కేటుగాళ్లు బురిడీ కొట్టించవచ్చు. వారి ఊరడింపు మాటలకు ఉబలాటపడ్డామంటే.. ఇక అంతే. మన ఖాతా ఖల్లాసే..! డబ్బులు ఊరికే రావు అని మాత్రం గుర్తుంచుకోండి.
- మీ ప్రమేయం లేకుండా మీ ఫోన్ ఎనేబుల్ అయితే సాంకేతిక కారణాల వల్లనేమో అని నిర్లిప్తంగా ఉండకండి. వెంటనే మీ టెలికాం ఆపరేటరును సంప్రదించండి. అవసరమైతే మీరు చెప్పేవరకు మీ ఫోన్ నంబరును బ్లాక్‌లోనే ఉంచమని సూచించండి. సైబర్ మోసగాళ్లు కొంతసేపు మన ఫోన్ సేవలను నిలిపేసి.. తర్వాత వారే ఫోన్ చేసే అవకాశముంటుంది. 'మీకు 5జీ సేవలను అందించడంలో భాగంగా అంతరాయం ఏర్పడింది. మీకు '5జీ' ఇంటర్నెట్ వేగం పెంచేందుకు మీ ఫోన్‌కు ఓ లింకు పంపాం. దాన్ని క్లిక్ చేయండి' అనగానే నమ్మి మోసపోకండి.
- 5జీ రాకతో ఫోన్ వినియోగం పెరిగే అవకాశమున్న దృష్ట్యా.. ఆన్‌లైన్ బ్యాంకింగ్‌కు ప్రత్యేక మెయిల్ ఐడీని క్రియేట్ చేసుకుని వాడటం శ్రేయస్కరం. దాన్ని ఇతర సోషల్ ప్లాట్‌ఫాంలకు వినియోగించొద్దు.
- థర్డ్ పార్టీ యాప్‌ల వినియోగంలో జాగ్రత్తగా ఉండాలి. నమ్మకమైన యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
- దాదాపు ప్రతివారం, వీలైతే ప్రతిరోజూ మీ బ్యాంకు స్టేట్‌మెంట్లను పరిశీలించాలి.
కూర్చుని చర్చించండి
వినియోగదారులకు సైబర్ నేరాలు, నేరాగాళ్ల మోసాలగురించి వివరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా https://www.infosecawareness.in వెబ్‌సైట్‌ను రూపొందించింది. అందులో మొబైల్, డెస్క్‌టాప్, వై ఫై, బ్రౌజర్ భద్రత, వాట్సప్ సెక్యూరిటీ విధానం, డిజిటల్ ట్రాన్సాక్షన్, ఆన్‌లైన్ స్కాములు, పాస్‌వర్డులు, మెయిల్స్ పేరిట, సైబర్, వేధింపులు, ఫిషింగ్ దాడులు ఎలా ఉంటాయి, వాటిని ఎదుర్కొని సురక్షితంగా ఉండటం ఎలా అన్న వివరాలు తెలుగు, ఇంగ్లిషుతో సహా పలు భాషల్లో ఉన్నాయి.
- సైబర్ మోసగాళ్ల బాధితులకు జాతీయ స్థాయి టోల్‌ఫ్రీ నంబరు: 155260 సాంత్వన కలిగిస్తుంది. బాధితులు ఈ నంబరుకు ఫోన్ చేయగానే సిబ్బంది.. బాధితులకు సంబంధించిన బ్యాంకు వివరాలు సేకరిస్తారు. బ్యాంకు అధికారులను అప్రమత్తం చేసి మిగిలిన సొమ్ము నష్టపోకుండా చర్యలు చేపడతారు.
- సైబర్ నేరాల బాధితులు https://cybercrime.gov.in వెబ్‌సైట్‌లో నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. 1930కు కూడా కాల్ చేసి సహాయం పొందొచ్చు.
ఆన్‌లైన్ చెల్లింపు మోసాలకూ బీమా
యూపీఐ ద్వారా చెల్లింపులు జరిపేవారికి కూడా ఓ బీమా పాలసీ ఉంది అన్న విషయం తెలుసా? ప్రస్తుతం ఇది పేటీఎం యాప్‌లో అందుబాటులో ఉంది. యాప్‌లో పేమెంట్ ప్రొటెక్ట్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులో పేరు, మొబైల్ నంబరును ఎంటర్ చేసి రూ.30 ప్రీమియం చెల్లించాలి. అప్పటి నుంచి మనం చేసే యూపీఐ లావాదేవీలకు బీమా వర్తిసుంది. ఏడాదిలో ఒక్కసారే ఇది వర్తిస్తుందని తెలుసుకోవాలి. ఎంత మోసపోయినా.. కేవలం రూ.10 వేలు మాత్రమే మనం పొందే సదుపాయం ఇందులో ఉంటుంది. దీని ద్వారా మొత్తం రాబట్టకపోవచ్చు గానీ.. బాధితులకు ఈ బీమా సదుపాయం కొంత ఊరటనిచ్చేదే. కొత్త సంవత్సరంలో మీరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఇక నుంచి.. మేం అపరిచిత వ్యక్తుల ఫోన్లకు స్పందించబోమని, వారు పంపే మెసేజ్‌లు, లింకులు, మెయిల్స్‌లను నమ్మబోమని, ఎవరితోనూ ఓటీపీలు, పిన్‌లు, సీవీవీలు, చెప్పబోమని, సైబర్ నేరాల ఉచ్చులో చిక్కకుండా జాగ్రత్త పడతామని కొత్త సంవత్సర వేళ ప్రమాణం చేయండి. ఇంటిల్లిపాది తీర్మానం చేసుకోండి.
ఇవీ చదవండి:
మహా విజ్ఞానం.. అద్భుత పరిజ్ఞానం.. 2022లో కొంగొత్త ఆవిష్కరణలు ఇవే!