Streaming Videos: బోర్ కొడుతుందని యూట్యూబ్ ఓపెన్ చేసి నచ్చిన వీడియోలు చూస్తుంటాం. అంతలో మొబైల్ డేటా పరిమితి ముగియడంతో వీడియో ఆగిపోతుంది.. గతంలో బుక్‌మార్క్ చేసిన వీడియోలను చూద్దామని ఓపెన్ చేస్తే కరెంట్ పోవడంతో ఇంటర్నెట్ ఆగిపోతుంది.. ఇలాంటి సమస్యల నుంచి బయటపడేందుకు వీడియోలను డౌన్‌లోడ్ చేసుకుని తర్వాత చూసేందుకు డివైజ్‌లో స్టోర్ చేసుకుంటాం. అలా యూట్యూబ్, డైలీమోషన్, ట్విట్చ్, విమియో వంటి వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాం నుంచి నచ్చిన వీడియోలను డౌన్‌లోడ్ చేసుకుని ఎన్నిసార్లయినా చూడొచ్చు. మరి ఆన్‌లైన్ వీడియోలను ఎలా డౌన్‌లోడ్ చేయాలి? అందుకు సమాధానమే ఆన్‌లైన్ వీడియో డౌన్‌లోడింగ్ టూల్స్. ఇంతకీ అవేంటీ? ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం.
వీడియో డౌన్‌లోడ్ హెల్పర్ (Video DownloadHelper)
ఇదో బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్. క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు అందుబాటులో ఉంది. యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, విమియో, డైలీమోషన్, లిండా, ట్విట్టర్, యుడెమీ, సౌండ్ క్లౌడ్, టుంబ్లర్ వంటి వాటితోపాటు దాదాపు అన్ని రకాల వీడియో స్ట్రీమింగ్‌లను సపోర్ట్ చేస్తుంది. రోజూ ఆన్‌లైన్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునే వారికి ఈ ఎక్స్‌టెన్షన్ ఎంతో ఉపయోగపడుతుంది. బ్రౌజర్‌లో వీడియో చూస్తూ ఈ ఎక్స్‌టెన్షన్ ఐకాన్‌పై క్లిక్ చేస్తే సదరు వీడియో డౌన్‌లోడ్ అవుతుంది. తర్వాత ఎక్కడ సేవ్ చేయాలో సూచించమని కోరుతూ పాప్-అప్ విండో ప్రత్యక్షమవుతుంది. అలా మీకు కావాల్సిన వీడియోలను సులువుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
![Streaming Videos](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14523403_videodownloadhelper.jpg)
4కే వీడియో డౌన్‌లోడర్ (4K Video Downloader)
ఇది విండోస్, మ్యాక్, లైనక్స్ ఓఎస్‌లను సపోర్ట్ చేస్తుంది. అన్ని రకాల ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ వేదికల నుంచి వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పీసీ/కంప్యూటర్‌లో ఈ టూల్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న వీడియో లింక్‌ను కాపీ చేసి 4కే వీడియో డౌన్‌లోడర్‌లో పేస్ట్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలానే యూట్యూబ్‌లో ఏదైనా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకుంటే అందులో కొత్తగా వచ్చే వీడియోలు ఆటోమేటిగ్గా 4కే వీడియో డౌన్‌లోడర్‌తో పీసీ/కంప్యూటర్‌లో డౌన్‌లోడ్ అవుతాయి. 8k, 4k, 1080p, 720p క్వాలిటీ వీడియోలతోపాటు, MP4, MKV, FLV, MP3, M4A ఫార్మాట్ వీడియో/ఆడియోలను ఈ టూల్ సాయంతో డౌన్‌లోడ్ చేయొచ్చు.
![Streaming Videos](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14523403_4k-video-downloader.jpg)
ఫ్రీమేక్ వీడియో డౌన్‌లోడర్ (Freemake Video Downloader)
ఆన్‌లైన్ వీడియో డౌన్‌లోడింగ్ టూల్ అనగానే ఎక్కువ మంది గుర్తుచేసుకునేది ఫ్రీమేక్ వీడియో డౌన్‌లోడర్. దీని ద్వారా యూజర్స్ సులువుగా తమకు నచ్చిన ఫార్మాట్‌లో వీడియో/ఆడియోలను డౌన్‌లోడ్ చేయొచ్చు. అయితే ఇది విండోస్, మ్యాక్ ఓఎస్‌లను సపోర్ట్ చేస్తుంది. ఈ టూల్‌ను సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేసిన తర్వాత డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న వీడియో యూఆర్‌ఎల్‌ను కాపీ చేసి ఫ్రీమేక్ వీడియో డౌన్‌లోడర్‌లో పేస్ట్ చేసి, ఫార్మాట్ ఎంచుకుంటే సరిపోతుంది.
![Streaming Videos](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14523403_videodownloader.jpg)
జేడౌన్‌లోడర్ (JDownloader)
ఇతర వీడియోడౌన్‌లోడింగ్ టూల్స్‌కు భిన్నంగా ఇది పనిచేస్తుంది. ఇందులో వీడియో ప్లే అయిన పేజ్ యూఆర్‌ఎల్‌ను కాపీ చేసి టూల్‌లో కాపీ చేయాలి. తర్వాత పేజీలోని అన్ని వీడియోల జాబితా చూపిస్తుంది. అందులో మీకు కావాల్సిన వీడియోను ఎంచుకుని డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ టూల్ ఇన్‌స్టాల్ చేసేప్పుడు బింగ్ సెర్చ్ లాంటి ఇతర టూల్స్ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచిస్తుంది. అలాంటివి స్క్రీన్ మీద కనిపించినప్పుడు డిక్లెయిన్ క్లిక్ చేయమని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఇది విండోస్, లైనెక్స్, మ్యాక్ ఓఎస్‌లను సపోర్ట్ చేస్తుంది.
![Streaming Videos](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14523403_jdownloader.jpg)
యూట్యూబ్-డీఎల్ (Youtube-dl)
కమాండ్ లైన్ ఎక్కువగా ఉపయోగించే వారికి ఈ టూల్ ఉపయోగపడుతుంది. ఇందులో వీడియో క్వాలిటీ, ప్లే లిస్ట్ ప్రాసెసింగ్, డౌన్‌లోడ్ రేట్ లిమిట్, ఒకేసారి ఎక్కువ వీడియోలు డౌన్‌లోడ్ చేయడం, ఫైల్స్‌కు ఆటోమేటిగ్గా పేర్లు ఇవ్వడం, సబ్‌టైటిల్స్‌తోపాటు డౌన్‌లోడ్ చేసుకోవడం వంటి ఎన్నో ఫీచర్లును మార్చుకుంటూ వీడియోలను డౌన్‌లోడ్ చేయొచ్చు. 3GP, AAC, FLV, M4A, MP3, MP4, OGG, WAV, WEBM ఫార్మాట్లను ఇది సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు కమాండ్ లైన్ ఉపయోగించకపోతే, పైన పేర్కొన్న టూల్స్‌లో ఏదో ఒక దాంతో వీడియోలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
![Streaming Videos](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14523403_youtube-dl.jpg)
ఇదీ చూడండి: