Instagram Server Down : ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్ సేవలు అమెరికా సహా పలుదేశాల్లో సోమవారం ఉదయం ఒక్కసారిగా నిలిచిపోయాయి. 1,88,000 మంది యూజర్లకు ఇన్‌స్టాగ్రామ్ పనిచేయలేదని.. డౌన్‌డిటెక్టర్ అనే వెబ్సైట్ వెల్లడించింది. భారత్‌లోనూ ఈ ప్రభావం కనిపించిందని తెలిపింది. దీనిపై స్పందించిన మెటా ప్రతినిధులు.. సమస్యకు కారణాలను అన్వేషిస్తున్నామని తెలిపారు. అంతరాయానికి క్షమాపణలు చెప్పారు.
భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 4 గంటల సమయంలో ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు ఒక్కొక్కరుగా ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌ను ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ.. యాప్ పనిచేయడం లేదని వెల్లడించారు. గత 24 గంటల్లో ఇన్‌స్టాగ్రామ్ సరిగ్గా పనిచేయట్లేదని అనేక మంది వినియోగదారులు మేసేజ్‌లు పెడుతున్నట్లు .. డౌన్‌డిటెక్టర్ అనే వెబ్సైట్ వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లో ఇబ్బందులు ఉన్నాయని 87 శాతం మంది తెలిపారని పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్ వెబ్సైట్లో సమస్య ఎదుర్కొంటున్నామని 9 శాతం మంది.. లాగిన్ సమస్యలను ఎదుర్కొంటున్నామని 4 శాతం మంది తెలిపారని వెల్లడించింది.
భారత్‌లోనూ అంతరాయం..
భారత్‌లోనూ 9,357 మంది ఇన్‌స్టాగ్రామ్ సేవల్లో అంతరాయాన్ని ఎదుర్కొన్నారు. వీరిలో 42 శాతం మంది సర్వర్ వల్ల ఇబ్బందులు, 41 శాతం మంది ఇన్‌స్టాగ్రామ్ యాప్ వల్ల.. 16 శాతం మంది లాగిన్ సమస్య ఎదుర్కొన్నామని వెల్లడించారు.
రెండు నెలల క్రితం నిలిచిపోయిన ఇన్‌స్టాగ్రామ్ సేవలు..
అంతకుముందు ఈ ఏడాది మార్చి 9న.. ఇన్‌స్టాగ్రామ్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది యూజర్లు యాప్‌లో సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లుగా సంస్థకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ప్రముఖ ఔటేజ్ ట్రాకింగ్ వెబ్సైట్ 'డౌన్ డిటెక్టర్' వెల్లడించింది. 'డౌన్ డిటెక్టర్' నివేదిక ప్రకారం.. అమెరికాలో 46,000 కంటే ఎక్కువ మంది యాప్ వినియోగదారులు ఇన్‌స్టా యాక్సెస్ చేసే సమయంలో సమస్యను ఎదుర్కొన్నట్లుగా సంస్థకు కంప్లైంట్ చేశారు. యూకే, భారత్, ఆస్ట్రేలియా సహా వివిధ దేశాల నుంచి వేలాది మంది యూజర్లు ఈ సమస్యపై మెటా సంస్థకు రిపోర్ట్ చేసినట్లు 'డౌన్ డిటెక్టర్' వెబ్సైట్ పేర్కొంది. ఇప్పటి వరకు సుమారు 27,000 మందికిపైగా ఈ సమస్య తలెత్తిన్నట్లు వెబ్సైట్ తెలిపింది.
ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ సేవల అంతరాయంపై ఫిర్యాదుల్లో 50 శాతం రిపోర్ట్లు.. సర్వర్ డౌన్‌కు సంబంధించినవని.. కాగా, మరో 20 శాతం ఇన్‌స్టాగ్రామ్‌లో లాగిన్ అయ్యే సమయంలో ఎదుర్కొన్న సమస్యలని వెబ్సైట్ చెప్పింది. దీనిపై స్పందించాలన్న ప్రముఖ లండన్ న్యూస్ ఏజెన్సీ సంస్థ 'రాయిటర్స్' చేసిన అభ్యర్థనకు మెటా వెంటనే స్పందించలేదు.