వాతావరణ మార్పు, భౌగోళిక రాజకీయ సంక్షోభాలు, పెరుగుతున్న అసమానత్వం వంటివన్నీ ప్రపంచానికి రోజురోజుకీ కొత్త సవాళ్లు విసురుతున్నాయి. ప్రతీ సవాలును మేధావులు, ఆవిష్కర్తలు అవకాశంగానే భావిస్తున్నారు. కొంగొత్త మార్గాలతో ప్రతికూలతలను అధిగమించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మునుపెన్నడూ ఎరగని విధంగా గత సంవత్సరం ఎన్నో కష్టనష్టాలు ఎదురైనా పరిష్కార దృక్పథంతోనే ముందుకు దూసుకుపోతున్నారు. ఆర్థిక, సామాజిక ఇబ్బందులను ఎదుర్కోవటమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవన గమనాన్ని మెరుగు పరచటం మీదా దృష్టి సారించారు. వినూత్న ఆలోచనలకు పెట్టింది పేరైన అంకుర సంస్థలు ఈ విషయంలో మరింత ముందు నడుస్తున్నాయి. అయితే పెద్ద సంస్థలతో పోలిస్తే వీటికి లభించే గుర్తింపు తక్కువే. వీటిని వెలికి తీసి, ప్రపంచానికి చాటాలన్నదే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌కు చెందిన న్యూ ఛాంపియన్స్ కార్యక్రమం ఉద్దేశం. ఈసారి మొత్తం 45 దేశాలకు చెందిన సుమారు 120 అంకుర సంస్థలు ఇందులో పాలు పంచుకున్నాయి. వీటిల్లో మూడు సంస్థలు న్యూ ఛాంపియన్స్ అవార్డులు దక్కించుకున్నాయి. క్లిష్ట సమయాల్లో సుస్థిర వృద్ధి, సామాజిక ప్రభావం, సామర్థ్యాల విభాగంలో ఇవి విజేతలుగా నిలిచి ఔరా అనిపించాయి.
వాడి పారేసే శస్త్రచికిత్స పనిముట్లు:
శస్త్రచికిత్సలో వాడే పరికరాలతో ఇన్‌ఫెక్షన్ల ముప్పు ఎక్కువ. కొన్నిసార్లు పరికరాలు విఫలం కావొచ్చు కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకొనే వైద్య సాంకేతిక సంస్థ జెంకో మెడికల్ ఒకసారి వాడి పారేసే వినూత్న సెట్ ఎక్స్ పరిజ్ఞానంతో ఇంప్లాంట్స్‌ను రూపొందించింది. సాన్ డీగోకు చెందిన ఇది ప్రధానంగా వెన్నెముకలో అమర్చే ఇంప్లాంట్స్‌పై దృష్టి సారించింది. వీటిని స్టెర్లైజ్ చేసి ఉంచిన పాలిమర్ పరికరాలతో వెన్నెముకలో అమర్చొచ్చు. శస్త్రచికిత్స అనంతరం ఈ పరికరాలన్నీ పారేసేవే.
వేరే వాళ్లకు ఉపయోగించటానికి కుదరదు. అందువల్ల సంప్రదాయ శస్త్రచికిత్స పద్ధతుల మాదిరిగా ఇన్‌ఫెక్షన్లు వ్యాపించే అవకాశముండదు. మామూలుగానైతే శస్త్రచికిత్స కోసం ఉపయోగించే పనిముట్లను మూడున్నర గంటల సేపు శుభ్రం చేసి క్రిములేవీ లేకుండా చూడాల్సి ఉంటుంది. ఇందుకు చాలా సమయం పడుతుంది. ఖర్చూ ఎక్కువే. అంతసేపు శుభ్రం చేసినా కొన్నిసార్లు ఇన్‌ఫెక్షన్లు వ్యాపించే అవకాశముంటుంది.
సెట్ ఎక్స్ పరిజ్ఞానంతో జెంకో మెడికల్ రూపొందించిన సాధనాలతో ఇలాంటి ఇబ్బందేమీ ఉండదు. పైగా ఎక్కువ బలాన్ని మోసేలా టైటానియంతో ఇంప్లాంట్స్‌ను రూపొందించటం విశేషం. ఈ ఇంప్లాంట్స్ సన్నటి రంధ్రాలతో కూడుకొని ఉంటాయి. ఇవి స్పాంజి మాదిరిగా చుట్టుపక్కల పదార్థాలను పీల్చుకుంటాయి. ఇలా ఎముక త్వరగా పెరిగేలా, రక్తనాళాలు ఏర్పడేలా చేస్తాయి. ఆవిష్కరణ పరంగానే కాదు.. పరికరాలను తరలించే విషయంలోనూ వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టింది.
వెండింగ్ యంత్రం పద్ధతిలో వీటిని చేరవేస్తుండటం విశేషం. అంటే పరికరంలో డబ్బులు వేసి లేదా చెల్లించి ఆసుపత్రి వద్దే కొనుక్కోవచ్చన్నమాట. వైద్య పరికరాల వాణిజ్యంలో ఇలా కొత్త అధ్యాయానికి తెర తీసింది. ఆసుపత్రులకే కాదు, రోగులకూ ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఈ విధానంతో ఒకో శస్త్రచికిత్సకు వెయ్యికి పైగా డాలర్లు ఆదా అవుతాయి. అందుకే సుస్థిర వృద్ధి విభాగంలో దీనికి పురస్కారం లభించింది.
ఆహారం-పొడి-ఆహారం:
కొవిడ్ మహమ్మారి తెచ్చిపెట్టిన పెద్ద చిక్కు- ప్రపంచవ్యాప్తంగా ఆహార సరఫరా దెబ్బతినటం. దీన్ని పరిష్కరించటానికి బ్లెండ్‌హబ్ రూపొందించిన పరిజ్ఞానం ఎంతగానో తోడ్పడుతోంది. మిగులు ఆహార ఉత్పత్తులను, నారింజ తొక్క వంటి పారేసే వ్యర్థాలను పొడిగా మార్చి అవసరమైనప్పుడు ఆహారంగా వాడుకోవటానికి వీలు కల్పించటం దీని ప్రత్యేకత. ప్రత్యేకమైన డీహైడ్రేషన్ పరిజ్ఞానంతో ముందుగా ఆయా పదార్థాలను ఎండిస్తారు. తర్వాత పొడిగా మారుస్తారు.
దీంతో పోషక విలువలు పెరగటమే కాదు.. ఎక్కువ కాలం మన్నుతాయి కూడా. ఈ పొడులను అవసరమైనప్పుడు ద్రవాహారంగా, ఘనాహారంగా, జెల్‌గా మార్చుకోవచ్చు. అందుకే ఈ పరిజ్ఞానాన్ని ఫ్రెష్2పౌడర్2ఫ్రెష్ అనీ పిలుచుకుంటున్నారు. అల్పాదాయ వర్గాల వారికి దీంతో మంచి పోషకాహారం లభించేలా చూడొచ్చు. 40 అడుగుల పొడవైన కంటైనర్లతో కూడిన సంచార ఆహార ఫ్యాక్టరీల ద్వారా అవసరమైన చోటే ఆహార పొడులను ఉత్పత్తి చేస్తుండటం గమనార్హం.
దీంతో నిల్వ చేయటానికి, తరలించటానికి అవసరమయ్యే ఖర్చూ తగ్గుతుంది. అంతర్జాతీయంగా మధ్యవర్తుల అవసరమూ తగ్గుతుంది. ఒకరకంగా ఆహార భద్రతకు ఇది ఎంతగానో ఉపయోగ పడుతుందన్నమాట. బ్లెండ్‌హబ్ ఆహార ఉత్పత్తి కేంద్రాలు మనదేశంలోనూ కొనసాగుతున్నాయి. మెక్సికో, స్పెయిన్, కొలంబియా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లోనూ అందుబాటులో ఉన్నాయి. స్థానిక రైతులు, చిన్న వ్యాపారులు, స్థానిక స్వచ్ఛంద సేవకులు ఇప్పటికే దీంతో ఎంతో ప్రయోజనం పొందుతున్నారు.
ఆహార పదార్థాలను పండించేవారిని, ఉత్పత్తి దారులను, వినియోగదారులను కలిపే మహత్తర మార్గంగా పేరొందింది. ఆహార సరఫరాను సేవా వాణిజ్యంగా మలవటం మూలంగానే బ్లెండ్‌హబ్ ప్రశంసలు పొందింది. సామాజిక ప్రభావం విభాగంలో విజేతగా నిలిచింది.
వినూత్న డిజిటల్ బోధన:
కొవిడ్-19 విజృంభించినప్పుడు విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. కానీ హోనోరిస్ యునైటెడ్ యూనివర్సిటీస్ బోధన మాత్రం కొనసాగింది. కారణం ఆగ్మెంటెడ్ రియాల్టీతో బోధించటం. ఆఫ్రికాలో ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల్లో మొట్టమొదటి, అతిపెద్ద నెట్‌వర్క్ కలిగున్నది ఇదే. జీవితంలో ఎప్పటికైనా విజయం సాధించాలనుకునే వారి కలలను వినూత్న విద్యా బోధనతో ఇది నిజం చేస్తోంది. దీని ద్వారా 15 సంస్థలు పనిచేస్తున్నాయి. వీటిల్లో 71వేలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇది 70 ప్రాంగణాలు, బోధన కేంద్రాలతో ఆన్‌లైన్ ద్వారా విద్యను బోధిస్తోంది.
కొన్నిచోట్ల ప్రత్యక్ష తరగతులూ నిర్వహిస్తున్నారు. ఆఫ్రికా దేశాల్లోని 32 పట్టణాల్లో దీని సేవలు అందుబాటులో ఉన్నాయి. హోనోరిస్ యునైటెడ్ యూనివర్సిటీస్ విద్యార్థులు యూరప్, అమెరికా, ఆసియాలోని 190కి పైగా యూనివర్సిటీలతోనూ అనుసంధానమై నేర్చుకుంటారు. వైద్యం, ఆరోగ్య శాస్త్రం, ఇంజినీరింగ్, ఐటీ, వాణిజ్యం, న్యాయం, భవన నిర్మాణం, లలిత కళలు, ఫ్యాషన్ డిజైనింగ్, మీడియా, రాజనీతి శాస్త్రం, విద్య.. ఇలా పలు రంగాల్లో 420 డిగ్రీలను దీని ద్వారా అందిస్తున్నారు. మరో ఐదేళ్లలో 17 లక్షల మందికి ఉన్నత విద్యను అందించాలనేది దీని సంకల్పం. కాబట్టే అడాప్టివ్ కెపాసిటీ విభాగంలో అవార్డును దక్కించుకుంది.
ఇవీ చదవండి:
నాసా ఆర్టెమిస్- 1 ప్రయోగం సక్సెస్.. క్షేమంగా భూమికి ఒరాయన్
వాట్సాప్‌లో ఫొటోస్, వీడియోస్ డిలీట్ అయ్యాయా?.. ఇలా చేస్తే అన్నీ వెనక్కి..