ప్రముఖ ఆన్లైన్ మల్టీప్లేయర్ గేమ్ అయిన ప్లేయర్ అన్నోన్స్ బ్యాటిల్ గ్రౌండ్(పబ్జీ)పై భారత ప్రభుత్వం వేటు వేసింది. ఇప్పటికే పలువురు యువత ఈ ఆటకు బానిసలుగా మారారు. వ్యక్తిగత గోప్యత, దేశ భద్రతకు దీని వల్ల ముప్పు ఉందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో పబ్జీ కారణంగా పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారని.. చిన్నారుల్లో మానసిక ఒత్తిడి కారణమవుతోందని ఇప్పటికే ఈ ఆటపై ఆరోపణలు ఉన్నాయి.
మూడ్ స్వింగ్స్కు కారణం..
ఈ గేమ్ వ్యక్తిగతంగానే కాకుండా ఉద్యోగరీత్యా పలు ఇబ్బందులకు కారణమవుతోంది. దీని కారణంగా శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక పరిస్థితులు తారుమారు అయిపోతున్నాయి. పబ్జీ వల్ల పిల్లల ప్రవర్తనలో మార్పు వస్తోంది. మల్టిపుల్ డిజార్డర్‌కు కారణమవడమే కాకుండా ఈ ఆట ఎక్కువగా ఆడటం వల్ల మనిషి భావోద్వేగాలను అదుపుచేసుకోలేని పరిస్థితిలోకి వెళ్లిపోతాడు. ఆటలో దూకుడు, దురాక్రమణకు పెద్ద పీట వేయడం వల్ల ఎప్పటికప్పుడు మూడ్ స్వింగ్స్ మారిపోయేలా ఆటగాళ్ల ప్రవర్తన ఉంటోంది.
ఓ వ్యక్తి రోజూ గంట ఏదైనా ఆటలు ఆడితే మంచిదే. అయితే రోజూ నాలుగు నుంచి ఆరు గంటలు ఆటలూ ఆడుతూ ఉంటే అది కచ్చితంగా మానసిక, శారీరక అంశాలను ప్రభావితం చేస్తుందని 2018లో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. దీని వల్ల వ్యక్తుల్లో ఆందోళన, ఒత్తిడి, అసహనం పెరిగిపోతుందని స్పష్టం చేసింది. ఎక్కువసేపు స్క్రీన్ చూస్తూ ఉండటం వల్ల అది చూపుపైనా ప్రభావం చూపిస్తుందని తెలిపింది. ఫలితంగా తలనొప్పి, శారీరక సమస్యలు సహా చిన్నారులు గదులకే పరిమితమైతే ఊబకాయం వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారని పేర్కొంది.
ఆడనివ్వకపోతే ఆత్మహత్యలు..
చాలా మంది ఉద్యోగులు తమ సమయాన్ని పబ్జీకి కేటాయించడం వల్ల పనిపై దృష్టిసారించలేకపోతున్నారు. ఫలితంగా ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఈ ఆట వ్యసనంగా మారడం వల్ల భాగస్వామితోనూ విడిపోయే పరిస్థితులు తెచ్చుకుంటున్నారు. ఇటీవల దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాకు చెందిన 13 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన తమ్ముడు పబ్జీ ఆడనివ్వకపోవడం వల్లే బలవన్మరణానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.
అసలు ఎలా..??
ఈ గేమ్ వ్యసనంగా మారేందుకు, ఆత్మహత్యల వైపు ప్రేరేపించేందుకు కారణాలున్నాయి. ఇందులో చంపుకోవడం, షూట్ చేయడం వంటి పనులు హింసను ప్రేరేపిస్తున్నాయి. ఇప్పటికే నేపాల్, చైనా, ఇరాక్, భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ యాప్‌ను కొంతకాలం నిషేధించారు. అంతేకాదు రాజ్‌కోట్ పోలీసు దాన్ని ప్లేస్టోర్ నుంచి తొలగించాలని గూగుల్‌ను కోరారు. ఇందులో ఆడియో చాట్ సహా లూటింగ్, స్పాటింగ్ వంటి యాక్షన్ అంశాలు ఎక్కువ మందిని ఆకర్షించి, ప్రభావితం చేయగలుగుతున్నాయి.
గెలిచిన వ్యక్తికి 'విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్' అనేది విజయ భావనను ప్రేరేపిస్తుంది. దీని వల్ల గెలిచిన వ్యక్తిలో ఉత్సాహం పెరిగితే... ఓడిపోయిన వ్యక్తి ఆత్మన్యూనతకు గురవుతాడు. అందుకే ఇది విషపూరిత ఆటల సంస్కృతికి కారకంగా మారిందన్నది నిపుణుల మాట.