'విలో’ అనే ఈ రోబో ఉంటే మనం చేత్తో బ్రష్ పట్టుకోనక్కర లేకుండా దంతాలు శుభ్రం చేసుకోవచ్చు. మనిషి దంతకట్టు ఆకారంలో ఉండి చివర నైలాన్ కుచ్చులు ఉన్న సిలికాన్ బ్రష్‌ని నోట్లో పెట్టి పెదాలు గట్టిగా మూసుకుని విలోని ఆన్ చేస్తే చాలు. దానిలోపల ఉండే టూత్‌పేస్ట్‌నీ మౌత్‌వాష్‌నీ తీసుకుని దంతాలనీ చిగుళ్లనీ నాలుకనీ శుభ్రం చేసేస్తుంది. దానికే జతచేసి ఉన్న పైప్ ద్వారా నీటిని బయటకు పంపించేస్తుంది.
మొత్తం దంతాలన్నిటినీ కవర్ చేసేలా ఉంటుంది కాబట్టి దాన్ని చేత్తో ఆ పక్కకీ ఈ పక్కకీ తిప్పే అవసరం కూడా ఉండదు. మామూలుగా చేత్తో బ్రష్ చేసుకుంటే దంతాలు 40 శాతం మాత్రమే శుభ్రమవుతాయనీ, అదే విలోతో అయితే దంతాలకు పట్టిన గార పూర్తిగా తొలగిపోతుందని హామీ ఇస్తున్నారు నిపుణులు. కరెంటుతో పనిచేసే దీన్ని ఎవరైనా రోజూ వాడుకోవచ్చట. పిల్లల నుంచి పెద్దల వరకూ వాడుకోవడానికి వీలుగా నాలుగు సైజుల్లో తయారుచేస్తోంది కంపెనీ.
- ఇదీ చూడండి : ఫ్రిజ్‌లు, టీవీలు మీ మాట వింటాయ్..!