రకరకాల కారణాలతో ఏటా 40 శాతం తేనెటీగలు మరణిస్తున్నట్లు అంచనా. తేనెటీగల్ని పెంచేవారు కూడా ఈ ప్రమాదాలను ముందుగానే పసిగట్టలేకపోతున్నారు. అందుకని ఆటోమేటెడ్ ‘బీహోమ్’ని తయారుచేశారు ‘బీవైజ్’ సంస్థ పరిశోధకులు. రోబోటిక్స్, కంప్యూటర్ విజన్, కృత్రిమ మేధల సాయంతో తయారైన ఈ కృత్రిమ తేనెపట్టు ఒక చిన్న గదిలా ఉంటుంది. దాన్నిండా అరలు అరలుగా ఉండే తేనెపట్టుల్లో 20 లక్షల తేనెటీగల్ని పెంచవచ్చు. వాటి సహజమైన తేనెపట్టులో ఎలాంటి వాతావరణం ఉంటుందో అచ్చం అలాగే ఇందులోనూ ఉంటుంది.
తేనెటీగల ఆరోగ్యాన్ని ఇరవైనాలుగ్గంటలూ పర్య వేక్షిస్తుంది ఈ బీహోమ్. బయటి నుంచి క్రిమికీటకాలు ఏవైనా దాడి చేస్తే వెంటనే వాటిని చంపేసే మందుల్ని చల్లడం, వాతావరణంలోని మార్పులతో సంబంధం లేకుండా బీహోమ్‌లో ఎప్పుడూ సహజమైన ఉష్ణోగ్రత ఉండేలా చూడడం కూడా దాని పనే. అంతేకాదు స్మార్ట్ టెక్నాలజీ సాయంతో తేనెటీగల మరణాలను బాగా తగ్గించడం ద్వారా తేనె ఉత్పత్తిని రెట్టింపు చేయగల సామర్థ్యమూ దీనికుంది. తేనెటీగల్ని పెంచేవారు ఒకసారి హోమ్‌ని కొనుక్కున్నాక నెలకింతని డబ్బు కడితే సాంకేతిక సేవల్ని అందజేస్తుంది ఇజ్రాయెల్‌కి చెందిన ‘బీవైజ్’ కంపెనీ.
- ఇదీ చూడండి : 'వచ్చే ఏడాది సరికొత్త శిఖరాలను అధిరోహిస్తాం'