కరోనా కారణంగా మరణించిన వారి కుటుంబాలకు పరిహారం (Covid death compensation) అందించాలన్న కేంద్ర నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రశంసించింది. ప్రపంచంలో ఏ దేశం చేయని విధంగా.. భారత్ చేసిందని అభినందించింది. ఎన్నో కుటుంబాల కన్నీళ్లు తుడిచేందుకు కేంద్రం తీసుకున్న చర్యపై హర్షం వ్యక్తం చేసింది.
"బాధపడిన వ్యక్తులకు కొంత ఊరట లభించినందుకు సంతోషంగా ఉన్నాం. ఈ పరిహారం కుటుంబాల కన్నీళ్లు తుడుస్తుంది. జనాభాతో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ.. ఏం జరిగిందన్న వాస్తవాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లాలి. భారత్ చేసినట్లు మరే దేశం చేయలేకపోయింది" అని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది.
న్యాయవాది గౌరవ్ కుమార్ బన్సాల్, కొవిడ్ -19 కారణంగా తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన కొందరు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది.
కేంద్రం సమర్పించిన రెండు అఫిడవిట్‌లను పరిశీలించిన ద్విసభ్య ధర్మాసనం.. అక్టోబరు 4న కొన్ని దిశానిర్దేశాలతో ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేయడంలో వివాదాలు తలెత్తితే.. ఆస్పత్రి రికార్డుల పరిశీలనకు జిల్లా స్థాయిలో ఫిర్యాదుల పరిష్కార కమిటీలకు అధికారం ఇచ్చేలా ఈ ఉత్తర్వులు ఉంటాయని తెలిపింది.
ఇదీ చూడండి: Ex-gratia: కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేలు పరిహారం!