Russia Luna 25 Technical Glitch : చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగాలన్న లక్ష్యంతో రష్యా ప్రయోగించిన లూనా-25 ల్యాండర్‌లో సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో దాని భవితపై నీలినీడలు అలుముకున్నాయి. సమస్యను విశ్లేషించేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్‌కాస్మోస్ వెల్లడించింది. ప్రస్తుతం ఆ వ్యోమనౌక చందమామ కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ల్యాండింగ్‌కు ముందు కక్ష్యకు చేరడానికి శనివారం లూనా-25 కీలక విన్యాసాన్ని చేపట్టింది. ఆ ప్రయత్నంలో వ్యోమనౌకలోని ఆటోమేటిక్ స్టేషన్‌లో అత్యవసర పరిస్థితి తలెత్తింది. దీంతో నిర్దేశిత పరిమితులకు అనుగుణంగా సంబంధిత విన్యాసం సాగలేదని రోస్‌కాస్మోస్ తెలిపింది. ఈ నేపథ్యంలో దాని ల్యాడింగ్ వాయిదా పడుతుందా అన్నదానిపై ఈ సంస్థ స్పష్టత ఇవ్వలేదు. ఈ వ్యోమనౌక ఇప్పటికే చందమామకు సంబంధించిన ఫోటోలను అందించింది.
Russia Moon Mission Update : దాదాపు 50 సంవత్సరాల విరామం అనంతరం జాబిల్లిపై పరిశోధనల కోసం రష్యా సన్నద్ధమైంది. ఇందుకోసమే లూనా-25 ప్రయోగాన్ని చేపట్టింది. లూనా-25ను ఈ నెల 11న రష్యాలోకి వోస్తోక్నీ కాస్మోడ్రోమ్ నుంచి నింగిలోకి ప్రయోగించింది. 11 రోజుల వ్యవధిలోనే చందమామపై దీన్ని దించేందుకు ప్రణాళికలు రచించుకుంది. భారత్ చేపట్టిన చంద్రయాన్-3 కంటే ఒకటి, రెండు రోజులు ముందే లునా-25... చందమామ దక్షిణ ధ్రువంపై దిగాల్సి ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో రష్యా ప్రయోగ ఫలితం ఆసక్తికరంగా మారింది.
Russia Chandrayaan Mission : చంద్రుడిపై మట్టి ఆనవాళ్లను సేకరించేందుకు అవసరమయ్యే రోబోటిక్ చేతులు రష్యా ప్రయోగించిన లూనా-25లో ఉన్నాయి. డ్రిల్లింగ్ హార్డ్‌వేర్‌తో పాటు ఇతర శాస్త్రీయ పరికరాలను సైతం అందులో పంపించారు. చంద్రయాన్-3, లూనా-25 వ్యోమనౌకలు చంద్రుడి దక్షిణ ధ్రువంపైనే దిగనున్నాయి. ఈ నేపథ్యంలో అవి రెండూ ఢీకొనే ప్రమాదం ఉందా అనే సందేహాలు తలెత్తాయి. కాగా, వీటిపై రష్యా స్పష్టతనిచ్చింది. రెండు దేశాల అంతరిక్ష నౌకలు ల్యాండ్ అయ్యే ప్రాంతాలు వేర్వేరనీ, అవి ఢీకొనే ప్రమాదమేం లేదని వెల్లడించింది. లూనా-25 ప్రయోగం నేపథ్యంలో రష్యాకు.. ఇస్రో అభినందనలు చెప్పడం విశేషం. అంతరిక్ష ప్రయాణంలో మీటింగ్ పాయింట్ ఉండటం అద్భుతం అంటూ రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్కాస్మోస్ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది ఇస్రో. చంద్రయాన్-3, లూనా-25 ప్రయోగాలు వాటి లక్ష్యాలు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొంది.
ISRO Chandrayaan 3 : జాబిల్లికి అడుగు దూరంలో 'విక్రమ్'.. సూర్యోదయం కాగానే ల్యాండింగ్