భారత్‌లో పబ్‌జీ (PUBG) తర్వాత అత్యంత ఆదరణ పొందిన రాయల్ బ్యాటిల్ గేమ్ 'గరీనా ఫ్రీ ఫైర్' (Garena Free Fire). తాజాగా ఈ గేమ్‌ను గూగుల్ ప్లే స్టోర్ (Googel PlayStore), యాపిల్ యాప్ స్టోర్ (Apple App Store) నుంచి అనూహ్యంగా తొలగించారు. దీంతో ఈ గేమ్ గురించి ఆన్‌లైన్‌లో చర్చ మొదలైంది. శనివారం నుంచి ఈ గేమ్ డౌన్‌లోడింగ్‌కు అందుబాటులో లేకపోవడంతో సామాజిక మాధ్యమాల వేదికగా గేమర్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న యూజర్స్ మాత్రం తమ డివైజ్‌లలో గేమ్‌ను ఆడుకోగలుతున్నామని చెబుతున్నారు.
మరోవైపు ఈ గేమ్‌ను భారత్‌లో నిషేధించినట్లు సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. ఫ్రీ ఫైర్ గేమ్‌ను ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి తొలగించడంపై గరీనా సంస్థ త్వరలో ప్రకటన చేయనున్నట్లు సమాచారం. తమ గేమ్ డిజైన్‌ను గరీనా ఫ్రీ ఫైర్ కాపీ కొడుతుందని, దానిపై చర్యలు తీసుకోవాలని పబ్‌జీ గేమ్‌ను రూపొందించిన క్రాఫ్టన్ సంస్థ ఫిర్యాదు చేసినట్లు టెక్ వర్గాలు పేర్కొంటున్నాయి.
పబ్‌జీ మొబైల్ గేమ్ బీజీఎమ్‌ఐ (బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా) డిజైన్‌తోపాటు, గేమ్‌లోని ఎయిర్ డ్రాప్, ఆయుధాలు, యుద్ధం జరిగే ప్రదేశం, కలర్ స్కీమ్స్ వంటి ఫీచర్స్‌ను గరీనా సంస్థ కాపీ చేసినట్లు క్రాఫ్టన్ సంస్థ తన ఫిర్యాదులో పేర్కొందని అంటున్నారు. అలానే కాపీ చేసిన గేమ్‌ను ప్లేస్టోర్, యాప్ స్టోర్‌లో ఉంచినందుకు గూగుల్, యాపిల్ కంపెనీలతోపాటు, గేమ్‌ను వీడియో స్ట్రీమింగ్ చేసేందుకు అనుమతించిందనే కారణంతో యూట్యూబ్‌పై కూడా దావా వేసినట్లు టెక్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ కారణం చేతనే గరీనా ఫ్రీ ఫైర్‌ను భారత్‌లో నిషేధించినట్లు టెక్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే దీనిపై సదరు సంస్థలు అధికారికంగా స్పందిచలేదు. 2021లో 24 మిలియన్ల మంది ఈ గేమ్‌ను డౌన్‌లోడ్ చేశారు. ప్రస్తుతం గరీనా ఇంటర్నేషనల్ సంస్థ రూపొందించిన ప్రీ ఫైర్ మాక్స్ (Free Fire Max) గేమ్‌ను మాత్రమే యూజర్లు అందుబాటులో ఉంది.
ఇదీ చదవండి: క్రోమ్ బ్రౌజర్‌లో ఈ పది ట్రిక్స్ గురించి తెలుసా..?