తెలుపు రంగు కాంతిని శోషించుకోదు. చాలావరకు పరావర్తనం చెందిస్తుంది. ఇలా చల్లదనాన్ని కలిగిస్తుంది. అందుకే భూతాపానికి తెల్ల రంగుతో కళ్లెం వేయాలని పర్డ్యూ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అతి ప్రకాశవంతమైన, తెలుపు రంగును రూపొందించారు. దీన్ని భవనాల మీద పైపూతగా వాడుకుంటే ఏసీల వాడకం తగ్గుతుందని.. ఫలితంగా భూతాపం తగ్గటానికీ తోడ్పడుతుందని భావిస్తున్నారు.
10 కిలోవాట్ల వరకు చల్లదనం..
చల్లదనాన్ని ఇవ్వటానికి ఉపయోగపడేలా అత్యధికంగా కాంతిని పరావర్తనం చెందించే తెల్లరంగును సృష్టించటానికి పరిశోధకులు చాలాకాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఇందుకోసం టైటానియం డయాక్సైడ్ రంగుల వంటివీ అందుబాటులో ఉన్నాయి. కానీ ఇవి చుట్టుపక్కల పరిసరాల కన్నా అంత చల్లగా ఏమీ ఉండవు. ఇలాంటి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొనే తెల్లరంగులో వర్ణద్రవ్యంగా ఉపయోగించే బేరియం సల్ఫేట్‌తో సరికొత్త ప్రయోగాలు చేశారు. దీని రేణువుల సైజు, గాఢత భిన్నంగా ఉంటాయి. అతి ఎక్కువ కాంతి పరావర్తనం కావటానికి దోహదం చేస్తోంది ఇదే. అలాగని బేరియం సల్ఫేట్ మోతాదు మితిమీరినా ఎండిపోయినప్పుడు రంగు పెళుసుగా తయారై, పెచ్చులుగా మారిపోతుంది. దీన్ని అధిగమించటానికే అక్రిలిక్ మాధ్యమంలో సుమారు 60% బేరియం సల్ఫేట్‌ను కలిపి కొత్త 'తెలుపు'ను సృష్టించారు. దీన్ని కప్పుల మీద పూసి పరిశీలించగా.. చుట్టుపక్కల కన్నా కనీసం 4.5 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రత తక్కువగా ఉంటున్నట్టు తేలింది.
ఇది త్వరలోనే విస్తృతంగా అందుబాటులోకి వచ్చే అవకాశముందని, దీంతో ఏసీల వాడకం తగ్గగలదనీ ఆశిస్తున్నారు. "సుమారు 1,000 చదరపు అడుగుల కప్పు మీద పూతగా వేస్తే 10 కిలోవాట్ల వరకు చల్లదనం లభిస్తుంది. చాలా ఇళ్లలో వాడే సెంట్రల్ ఎయిర్ కండిషనర్ల కన్నా ఇది మరింత శక్తిమంతమైంది" అని పర్డ్యూ యూనివర్సిటీ ఇంజినీర్ ష్యూలిన్ రువాన్ చెబుతున్నారు.
ఇదీ చదవండి:చేసే పనులు వింత- శాలరీ ఊహించనంత!