నిత్యం చేసే వ్యాయామం, శారీరక శ్రమ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు అనేక రకాల పెడోమీటర్ అప్లికేషన్లు (స్టెప్ కౌంటర్ యాప్స్) అందుబాటులో ఉన్నాయి. మన ఫోన్ లోని జీపీఎస్, యాక్సెలరోమీటర్లను ఉపయోగించి అవి మన కదలికల్ని అర్థం చేసుకుంటూ పని చేస్తాయి. రోజంతా ఎంత దూరం నడిచాం, ఎన్ని అడుగులు వేశాం, తద్వారా ఎన్ని క్యాలరీలు ఖర్చయ్యాయి అనే విషయాలు అంచనా వేసి ఆ వివరాలు మనకు తెలియజేస్తాయి.
ఈ యాప్‌లను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగానే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కానీ కొన్ని అదనపు ఫీచర్లు కావాలంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సిందే. ఏదేమైనప్పటికీ వీటిని వాడటం వల్ల సానుకూలతలతో పాటు కొన్ని ప్రతికూలతలూ ఉన్నాయి. మరి ఆ లాభ నష్టాలేంటో మీరూ తెలుసుకోండి.
లాభాలు :
- మిమ్మల్ని మరింత చురుకుగా ఉండేలా ప్రోత్సహిస్తాయి..
మీకు వ్యాయామం చేయాలంటే బద్ధకమా? అయితే ఇవి మిమ్మల్ని వర్కౌట్ చేసేలా ప్రోత్సహిస్తాయి. అన్ని యాప్‌లు మీ నడక, పరుగు రికార్డులను ట్రాక్ చేస్తాయి. కొన్ని అప్లికేషన్లు అయితే మోటివేషనల్ బ్యాడ్జిలు ఇస్తాయి. - శారీరక శ్రమను ట్రాక్ చేస్తాయి..
పెడోమీటర్లు మీ వ్యాయామ వివిధ దశలను ట్రాక్ చేస్తాయి. సాధారణంగా ఇవి నడచిన దూరం, క్యాలరీలు అంచనా వేస్తాయి. పురోగతిని తెలుసుకోవడానికి గ్రాఫ్‌లు సైతం అందిస్తాయి. కొన్ని యాప్‌లు మనం తీసుకునే నీరు, ఎక్కిన మెట్లు సైతం ట్రాక్ చేస్తాయి. - తక్కువ ఖరీదు..
శారీరక శ్రమను అంచనా వేయడానికి ధరించే కొన్ని గ్యాడ్జెట్‌ల కంటే ఇవి చౌకైనవి. ప్రత్యేకంగా గ్యాడ్జెట్స్ వాడాలంటే.. అదనంగా డబ్బులు ఖర్చు చేయాలి. వాటికి ఛార్జింగ్ పెట్టడం, ధరించడం మర్చిపోవడం లాంటివి జరుగుతాయి. అదే మీరు స్మార్ట్ ఫోన్‌ను ఎప్పుడూ మీతోనే ఉంచుకునే అవకాశముంది. ఆ యాప్‌లు మీ కదలికల్ని ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తాయి.
నష్టాలు :
- వందశాతం కచ్చితమైనవి కావు..
ఉత్తమమైన పెడోమీటర్ యాప్‌లు ట్రాక్ చేయడానికి జీపీఎస్ లాంటివి ఉపయోగించినప్పటికీ అవి సేకరించే డేటా ఎల్లప్పుడూ కచ్చితమైంది కాదని గుర్తుంచుకోవాలి. కొన్ని సార్లు డేటా సేకరణలో పొరపాట్లు జరిగే అవకాశముంది. - అధిక బ్యాటరీ వినియోగం..
మెజారిటీ పెడోమీటర్ అప్లికేషన్లు మన యాక్టివిటీని రికార్డు చేస్తాయి. వాటిని ప్రారంభించడానికి ప్రత్యేకంగా బటన్ నొక్కాల్సిన అవసరం లేదు. వాటంతట అవే స్వయంగా పనిచేస్తాయి. దీనికోసం అధికంగా బ్యాటరీని వినియోగించుకుంటాయి. ఇదొక ప్రతికూలత. - హృదయ స్పందన రేటు లెక్కించవు..
స్మార్ట్‌వాచ్ వంటి గ్యాడ్జెట్స్.. మీ హృదయ స్పందన, నడక, మీరు ఎంత ప్రభావవంతంగా వ్యాయామం చేస్తున్నారో తెలియజేస్తాయి. పెడోమీటర్ యాప్‌లు మీ హార్ట్ బీట్, స్ట్రైడ్ లెంథ్ను ట్రాక్ చేయలేవు.