ప్రమాదానికి గురై అవయవాలు ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సిన పరిస్థితిలో ఆ బాధితులకు సెట్ అయ్యే అవయవాలు దొరకక ఎంతో మంది ప్రాణాలొదులుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మనిషిని కాపాడగలిగే ఓ వినూత్న పరిశోధనకు ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆచార్యలు, పరిశోధక విద్యార్థులు తెర తీశారు. త్రీడీ ప్రింటింగ్ సాంకేతికతతో(3D Printing Technology) కృతిమ అవయవాలను(Artificial Organs) తయారు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని అవయవాలను(Artificial Organs) అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ బృందం.. కృత్రిమ గుండె(Artificial heart) తయారీలోనూ పురోగతి సాధించారు.
ఉస్మానియా విశ్వవిద్యాయంలో సీపీడీడీఏఎంను రూ.6 కోట్లతో రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ 2.0లో భాగంగా అందుబాటులోకి తెచ్చారు. కృత్రిమ అవయవాల తయారీకి జర్మనీ నుంచి తెప్పించిన రెండు యంత్ర పరికరాలు (వీటిని ప్లాస్టిక్ త్రీడీ ప్రింటర్లుగా వ్యవహరిస్తారు), ఒక మెటల్ త్రీడీ ప్రింటర్, త్రీడీ స్కానర్ ఏర్పాటు చేశారు. కేంద్రానికి ఓయూ మెకానికల్ ఇంజినీరింగ్ ఆచార్యుడు, పరీక్షల విభాగం నియంత్రణాధికారి ప్రొ.శ్రీరామ్ వెంకటేశ్ సంచాలకుడిగా వ్యవహరిస్తున్నారు. కొన్ని నెలలుగా ప్రత్యేకంగా కృత్రిమ అవయవాల తయారీపై పరిశోధనలు చేపట్టారు. పక్కటెముకలు, మోకాలి చిప్పలు, కింది దవడ, పుర్రె భాగం, డెంటల్ సేఫ్‌గార్డ్‌లను విజయవంతంగా తయారు చేశారు. వీటి కోసం కోబాల్ట్, అల్యూమినియం, నికెల్, టంగ్‌స్టన్, స్టెయిన్‌లెస్‌స్టీల్ వినియోగిస్తున్నారు. పక్కటెముకను తయారు చేసి వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి అందించగా రోగికి అమర్చారు. తొలిసారిగా 3డీ సాంకేతికతను వినియోగించి కృత్రిమ గుండె తయారీలో నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకోవడంతో ప్రయోగాత్మకంగా పరీక్షించగా మంచి ఫలితాలు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. మరిన్ని ప్రయోగాల తర్వాత తుది నమూనాను రూపొందించనున్నారు.
భవిష్యత్తులో డిమాండ్ అధికం
భవిష్యత్తులో త్రీడీ ప్రింటింగ్ సాంకేతికతకు విపరీతమైన డిమాండ్ ఉంది. మేకిన్ ఇండియాలో భాగంగా కృత్రిమ అవయవాలు, రక్షణ రంగంలో పరికరాలు సహా ఎన్నో రకాల ఉత్పత్తులు త్రీడీ ప్రింటింగ్ సాయంతో తయారు చేస్తున్నాం. సహజ అవయవాల పనితీరుకు ఏ మాత్రం తీసిపోకుండా కృత్రిమ అవయవాలను రూపొందిస్తున్నాం. డీఆర్‌డీవో, ఎస్కీ, ఎడిఫైపాత్, ఇన్నోవా ఆసుపత్రి వంటి సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. మా వద్ద ఉన్న సౌకర్యాలు, పనితీరు తెలుసుకుని మరికొన్ని సంస్థలు ఒప్పందం చేసుకునేందుకు ముందుకు వస్తున్నాయి.
- ప్రొ.శ్రీరామ్ వెంకటేశ్, సీపీడీడీఏఎం సంచాలకుడు