ఇంటర్నెట్ సెర్చింగ్‌ను సమూలంగా మార్చేసే ఏఐ చాట్బాట్లు టెక్ ప్రపంచంలో సంచలనంగా మారాయి. దిగ్గజ సంస్థలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ చాట్‌బాట్లను విడుదల చేసేందుకు పోటీ పడుతున్నాయి. ఓపెన్ ఏఐ అనే సంస్థ తయారు చేసిన చాట్‌జీపీటీ.. తొలుత ఈ సంచలనాలకు తెరతీసింది. ఒక్కసారిగా టెక్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసిందీ ఏఐ బాట్. ఇంటర్నెట్లో భవిష్యత్ అంతా వీటిదేనని తెగ చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టాప్ కంపెనీలు హడావుడిగా వీటిని మార్కెట్లోకి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఈ హడావుడిలోనే బొక్కబోర్లా పడుతున్నాయి. ఇటీవల గూగుల్‌కు ఇలాంటి ఎదురుదెబ్బ తగలగా.. తాజాగా మైక్రోసాఫ్ట్ వంతైంది.
అసలేమైందంటే?
ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఏఐ చాట్‌బాట్ 'ChatGPT'. దీన్ని అభివృద్ధి చేసిన ఓపెన్ ఏఐ అనే సంస్థలో మైక్రోసాఫ్ట్.. 2019లో ఒక బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. అంటే.. పరోక్షంగా ఈ మార్కెట్లో మైక్రోసాఫ్ట్ లీడింగ్‌లోనే ఉంది. అయితే, చాట్‌జీపీటీ ఎక్స్‌క్లూజివ్ యాక్సెస్ కోసం ఈ ఏడాది జనవరిలో మరో 10 బిలియన్ డాలర్లు ఓపెన్ఏఐలో పెట్టుబడిగా పెట్టింది. ఈ ఒప్పందం ప్రకారం మైక్రోసాఫ్ట్‌కు ఓపెన్ఏఐ సంస్థ.. ప్రత్యేక చాట్‌జీపీటీ సేవలను అందిస్తుంది. ఈ నేపథ్యంలోనే మైక్రోసాఫ్ట్... తన సెర్చ్ ఇంజిన్ అయిన 'బింగ్'తో చాట్‌జీపీటీని అనుసంధానం చేసింది. దానికి 'సిడ్నీ' అని పేరు పెట్టింది. ఈ నెల మొదట్లో దీన్ని విడుదల చేసింది. క్రేజ్ ఉన్న టెక్నాలజీ కాబట్టి యూజర్ల నుంచి భారీ స్పందన వచ్చింది. 48 గంటల్లోనే పది లక్షల మంది దీన్ని ట్రై చేసేందుకు ముందుకొచ్చారు. దీంతో ఈ 'సిడ్నీ' చేసిన నిర్వాకం బయటకొచ్చింది.
చంపేస్తానని బెదిరింపులు..
బింగ్ సెర్చ్ చాట్‌బాట్ సిడ్నీ.. దాన్ని టెస్ట్ చేసిన వారికి చుక్కలు చూపించింది. పొంతన లేని సమాధానాలు పక్కనబెడితే.. ఏకంగా చంపేస్తానని యూజర్లను బెదిరించింది. ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్‌కు ఈ అనుభవం ఎదురైంది. ఏదో ప్రశ్న అడిగిన ఆ ప్రొఫెసర్‌ను చంపేస్తానని బెదిరించింది సిడ్నీ. మరోవైపు, న్యూయార్క్ టైమ్స్‌లో పనిచేసే కెవిన్ రూస్ అనే జర్నలిస్టుకు పెళ్లి ప్రతిపాదన చేసింది. భార్యను వదిలేయాలని కూడా సూచించింది. ప్రస్తుత సంవత్సరం 2023 కాదని.. 2022 అని మరో యూజర్‌ను నమ్మించే ప్రయత్నం చేసింది.
మైక్రోసాఫ్ట్ ఏమందంటే?
చంపేస్తామని తీవ్ర హెచ్చరికలు చేసినప్పటికీ మైక్రోసాఫ్ట్ మాత్రం సిడ్నీని వెనకేసుకొచ్చింది. సిడ్నీని 169 దేశాల్లోని యూజర్లు టెస్ట్ చేశారని తెలిపింది. అందులో 71 శాతం మంది సానుకూలంగానే స్పందించారని పేర్కొంది. ఎక్కువ సేపు దాన్ని వాడితే ఇలా భిన్నమైన సమాధానాలు ఇస్తోందని వివరణ ఇచ్చింది. 15 కంటే ఎక్కువ ప్రశ్నలు అడిగితే చాట్‌బాట్ దారితప్పుతోందని తెలిపింది. యూజర్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ తమకు ఉపయోగకరంగా ఉందని, దాని ఆధారంగా చాట్‌బాట్‌ను మరింత మెరుగ్గా, సురక్షితంగా మార్చుతామని స్పష్టం చేసింది.
గూగుల్‌కు సైతం ఇలాగే..
ఏఐ చాట్‌బాట్ విషయంలో గూగుల్‌కు సైతం ఇలాంటి ఎదురుదెబ్బ తగిలింది. బార్డ్ అనే సెర్చ్ చాట్‌బాట్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేసింది. ఇంగ్లిష్ భాషలో అత్యుత్తమ రైటర్ ఇదేనంటూ ప్రకటించుకుంది. చివరకు బార్డ్ కోసం గూగుల్ చేసిన ప్రచారం అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. కంపెనీ ఈవెంట్లోనే బార్డ్ తప్పుడు సమాధానం చెప్పింది. దీంతో స్టాక్ మార్కెట్లో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ షేర్లు కుదేలయ్యాయి. మొత్తంగా 100 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. దీంతో గూగుల్ ప్రయత్నాన్ని పీఆర్ డిజాస్టర్‌గా కొట్టిపారేశారు విశ్లేషకులు.
అయితే, మైక్రోసాఫ్ట్ విషయంలో ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. మనిషి లాంటి చాట్‌బాట్లను రూపొందించటానికి గతంలోనూ ప్రయత్నించింది మైక్రోసాఫ్ట్. కానీ ఆ ప్రయత్నాలు సఫలం కాలేకపోయాయి. 2016లో ఆ కంపెనీ.. టే బాట్‌ను రూపొందించింది. యూజర్లు దీనికి జాతి వివక్షకు అనుగుణంగా ఉండటాన్ని నేర్పించారు. తాజాగా చాట్‌జీపీటీ ఆధారిత సిడ్నీని ప్రవేశపెట్టింది.
ఇవి ఎలా పనిచేస్తాయంటే?
మనం ఫోన్లలో టైప్ చేసేటప్పుడు తర్వాతి పదాన్ని కీబోర్డ్ దానంతట అదే చూపిస్తుంది. ఆ సెంటెన్స్‌లో ఏ పదాలు వస్తే బాగుంటుందని ఓ అంచనా వేసుకొని అది పనిచేస్తుంది. దాన్నే ఆటో-కంప్లీట్/కరెక్ట్ ఫీచర్ అంటారు. చాట్‌బాట్ దానికి అమ్మమ్మ అని చెప్పొచ్చు. చాట్బాట్ల వద్ద ఇంటర్నెట్లో ఉన్న సమాచారం అంతా ఉంటుంది. వికిపీడియా, రెడ్ఇట్, సోషల్ మీడియా, వార్తలు వంటి సమాచారం అంతటిని చాట్బాట్ల న్యూరల్ నెట్‌వర్క్‌కు అనుసంధానం చేస్తారు. వాటి ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేలా ఇంటరాక్టింగ్ బాట్‌ను రూపొందిస్తారు. భారీ స్థాయిలో సమాచారం ఉంటుంది కాబట్టి.. చాట్బాట్లు తర్వాత వచ్చే పదాన్ని మాత్రమే కాకుండా పూర్తి స్టోరీని రాయగలుగుతాయి.
మరి భవిష్యత్ ఎలా..
ప్రస్తుతం ఉపయోగిస్తున్న చాట్‌జీపీటీ అనేది 'జనరేటివ్ ప్రీ-ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్-3' (జీపీటీ-3) వెర్షన్‌పై నిర్మించారు. దీనికి అడ్వాన్స్డ్ వెర్షన్‌ను సైతం అభివృద్ధి చేస్తున్నారు. దాన్ని జీపీటీ-4గా వ్యవహరిస్తున్నారు. జీపీటీ-3లో 175 బిలియన్ల పారామీటర్లు ఉంటే.. జీపీటీ-4లో 100 ట్రిలియన్ల పారామీటర్లు ఉంటాయి. అంటే, సమాచార విశ్లేషణ, స్పందించే వేగం, సామర్థ్యం మరింత మెరుగుపడనుంది. అయితే, మైక్రోసాఫ్ట్ సిడ్నీని.. జీపీటీ-4పైనే అభివృద్ధి చేసి ఉంటారని పలువురు నిపుణులు చెబుతున్నారు.
ఇలాంటి కాలంలోనా?
ఇంటర్నెట్ నిండా ఫేక్‌న్యూస్‌లు, కుట్ర సిద్ధాంతాలు, తప్పుడు సమాచారం ఉన్న ఈ రోజుల్లో ఏఐ వంటి బాట్లు కూడా తప్పుడు సమాచారం ఇవ్వడం ఆందోళకరమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 'కనీస సమాచారం ఇస్తాయన్న ఆశతోనే గూగుల్‌లో సెర్చ్ చేస్తాం. ఇలాంటి విశ్వసనీయమైన సెర్చ్ ఇంజిన్లే ఇలా మారిపోతే మనం ఏమైపోతాం. కొత్త టెక్నాలజీలు ఏవైనా వస్తే ముందుగా అవి మనుషులకు హాని కలిగించకుండా ఉండాలి. ఎక్కువ సమాచారం ఉన్నంత మాత్రాన కొత్త చాట్బాట్లు మెరుగ్గా తయారు కావు' అని అంటున్నారు.
- ఇవీ చదవండి:
- వినూత్నం ఛాట్‌బోట్ ప్రపంచం.. అమెరికా శాస్త్రవేత్తల అరుదైన ఆవిష్కరణ
- ChatGPTకి పోటీగా గూగుల్ బార్డ్.. వెయ్యి కోట్ల డాలర్ల ప్రాజెక్టుతో వస్తున్న మైక్రోసాఫ్ట్
- AI, క్వాంటమ్ కంప్యూటింగ్.. ఈ ఏడాది డిజిటల్ రంగాన్ని మార్చేవి ఇవే!
- హైహై 'AI' నాయకా.. మీ పనులన్నీ చేసిపెట్టే వెబ్సైట్ల గురించి తెలుసా?