Triple Murder in Palnadu District: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం రక్త సంబంధీకులే ముగ్గురిని మట్టుబెట్టారు. పిన్ని, సోదరుడు, సోదరిని దారుణంగా చంపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ధూళిపాళ్లకు చెందిన పెద్దమీర్సా , చిన్న మీర్సా అన్నదమ్ములు. పెద్దమీర్సా కుటుంబం కొన్ని సంవత్సరాల కిందటే ఉపాధి నిమిత్తం సత్తెనపల్లిలో స్థిరపడింది. చిన్నమీర్సా కుటుంబం స్వగ్రామంలోనే జీవిస్తోంది. వీరిద్దరూ కొన్నాళ్ల కిందట మృతి చెందారు. చిన్న మీర్సాకు భార్య షేక్ రహిమున్నీసా (65), కుమార్తె మాలింబీ (36), కుమారుడు రహమాన్(38) ఉన్నారు. వీరికి రెండు ఎకరాల పొలం ఉంది.
ఆ పొలంపై పెద్దమీర్సా కుమారుడు ఖాసిం కన్నేశాడు. పొలంలో సగభాగం రాసివ్వాలని తరచూ రహిమున్నీసాతో గొడవ పడేవాడు. బుధవారం మధ్యాహ్నం.. ఖాసిం తన కుమారుడైన బాలుడితో కలిసి సత్తెనపల్లి నుంచి ధూళిపాళ్లకు బయలుదేరాడు. దారిలో ఎదురైన రహమాన్పై దాడి చేసి చంపేసి, మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచి ఓ దాబా వెనుక గుంతలో పడేశాడు. అనంతరం రహమున్నీసా ఇంటికి వెళ్లి, కర్రలతో దాడి చేశాడు, అడ్డొచ్చిన ఆమె కూతురు మాలింబీని విచక్షణారహితంగా కొట్టాడు. రహీమున్నీసా తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడిన మాలింబీని సత్తెనపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. దాడి అనంతరం ఖాసిం, ఆయన కుమారుడు. పరారయ్యారు. పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం గుంతలో పడేసిన రహమాన్ మృతదేహాన్ని గుర్తించారు.
ఉద్యోగం వదులుకుని.. కుటుంబానికి అండ: రహీమున్నీసా పెద్ద కుమారుడు అబ్దుల్ జబ్బార్, రెండో కుమారుడు రహమాన్ డిగ్రీ చదివారు. కూతురు మాలింబీ చదువు మధ్యలోనే ఆగింది. అబ్దుల్ జబ్బార్ రక్షణదళంలో కొలువుకు ఎంపికైనా వెళ్లలేదు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటే వారి బాగోగులు చూసుకోవడం కష్టమని భావించి.. ఉద్యోగం వదులుకున్నాడు. వ్యవసాయం చేస్తూ కుటుంబానికి అండగా ఉండేవాడు. నాలుగేళ్ల కిందట చిన్న మీర్సా అనారోగ్యంతో చనిపోయారు. పిల్లలకు పెళ్లికాలేదని రహిమున్నీసా బాధపడేవారు. తొలుత చెల్లి మాలింబీకి పెళ్లిచేయాలని జబ్బార్ సంబంధాలు చూసినా కుదరలేదు. ఏడాదిన్నర క్రితం కండరాల వ్యాధితో జబ్బార్ మరణించడం ఆ కుటుంబాన్ని తీవ్ర వేదనకు గురిచేసింది. రెండో కుమారుడు.. రహమాన్ సత్తెనపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఉద్యోగం చేస్తూ కుటుంబానికి చేదోడుగా నిలిచాడు. వీరి పొలంపై కన్నేసిన ఖాసిం.. ఇప్పుడు ఆ కుటుంబంలోని ముగ్గురిని హతమార్చాడు.