ETV Bharat / science-and-technology

చంద్రుడి మీదికి మళ్లీ.. అక్కడే స్థిరనివాసం.. ఏర్పాట్లు ఎలా చేస్తారంటే?

అప్పుడెప్పుడో.. 1972లో జీన్‌ సెర్నన్‌ అనే వ్యోమగామి చంద్రుడి మీద నడిచారు. అప్పట్నుంచీ మరెవరూ అక్కడికి వెళ్లలేదు. తాజాగా తిరిగి చంద్రుడి మీద కాలు మోపాలనే కాంక్ష ఎక్కువైంది. త్వరలో నాసాకు చెందిన ఆర్టెమిస్‌ ప్రయోగాలూ ఆరంభం కానున్నాయి. వీటి ఉద్దేశం- 2025 కల్లా మళ్లీ జాబిల్లి మీదికి మానవుడిని పంపించటం. అక్కడ శాశ్వత ఆవాసం ఏర్పరచుకోవటం. ఇటీవలే చంద్రుడి ఆవలివైపునకు తొలిసారి రోవర్‌ను పంపించిన చైనా సైతం మనుషులను అక్కడికి పంపించాలని చూస్తోంది. మనదేశమూ మానవ సహిత ప్రయోగాలకు సిద్ధపడుతోంది. ఇవన్నీ మనం చంద్రాన్వేషణలో కొత్త యుగంలోకి ప్రవేశిస్తున్నామనే చెబుతున్నాయి. అయితే ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడే ఎందుకు జాబిల్లి మీదికి తిరిగి మనుషులను పంపాలని చూస్తున్నాం? ఇందుకోసం ఎలాంటి కొత్త పరిజ్ఞానాలను రూపొందించుకుంటున్నాం? అక్కడ ఆవాసం ఏర్పరచుకోవటానికి, జీవించటానికి ఎలాంటి సదుపాయాలు అవసరం? ఇవన్నీ ఆసక్తికరమైన ప్రశ్నలే.

man-going-back-to-the-moon
man-going-back-to-the-moon
author img

By

Published : Oct 26, 2022, 8:47 AM IST

NASA moon mission 2022: "భారీ పరిశ్రమలను చంద్రుడి మీద నెలకొల్పి భూమిపై పర్యావరణ ఒత్తిడిని తగ్గించాల్సిన అవసరముంది". ఇది అమెజాన్‌ వ్యవస్థాపకులు జెఫ్‌ బెజోస్‌ ఆలోచన. "భూమి మీద యుగాంతం వంటి వైపరీత్యాలు సంభవిస్తే మానవజాతి పూర్తిగా నశించకుండా చూసుకోవటానికి చంద్రుడి మీద ఆవాసాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది". స్పేస్‌ఎక్స్‌ సంస్థతో అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త ఒరవడికి నాంది పలికిన ఎలాన్‌ మస్క్‌ అభిప్రాయమిది. దేశాధినేతలతకైతే రాజకీయ కారణాలూ ఉండొచ్చు. "అంతరిక్షం మీద పట్టు సాధిస్తే ప్రపంచం మొత్తం మీద ఆధిపత్యం సాధించినట్టే" అన్నది అమెరికా మాజీ అధ్యక్షుడు లీండన్‌ జాన్సన్‌ వ్యాఖ్య. సోవియట్‌ యూనియన్‌ అప్పట్లో స్పుత్నిక్‌ను ప్రయోగించినప్పుడు దిగ్భ్రాంతిలో ఆయన అన్న మాటలివి. చంద్రుడి మీద పట్టు సాధించటమూ ఇందుకు తోడ్పడొచ్చు.

ఎవరి ఉద్దేశం ఏదైనా కావొచ్చు. కానీ శాస్త్రరంగం కోసం, అంతరిక్ష అన్వేషణ కోసం, జ్ఞాన సముపార్జన కోసం, ప్రతికూల పరిస్థితుల్లో సమన్వయం సాధించటాన్ని నేర్చుకోవటం కోసం మనం చంద్రుడి మీదికి వెళ్లాల్సిన అవసరమైతే ఉంది. చంద్రుడు ఓ కాల గని. సౌర కుటుంబం ఆరంభంలో ఎలాంటి పరిస్థితులుండేవనే విషయాలను తెలపగల నిధి. ఎందుకంటే సౌరవ్యవస్థ ఏర్పడినప్పట్నుంచీ జాబిల్లి ఏమాత్రం మారకుండా అలాగే ఉంది. ఇలాంటి ఖగోళపరమైన అంశాల దగ్గర్నుంచి చంద్రుడి మీద నీటి మంచు వరకూ ప్రత్యక్షంగా చూస్తే తేలికగా అర్థం చేసుకోవచ్చు. రోబోలు, రోవర్లు మనకన్నా బలంగా, ప్రతికూల పరిస్థితులను తట్టుకునేలా ఉండొచ్చు గానీ అవి మన మేధతో సరిపోలవు. ఒకసారి మనం చంద్రుడి మీద నివాసం ఏర్పరచుకుంటే పునర్వినియోగం, పునర్వినియోగ ఇంధన వాడకం వంటి వాటిని సమర్థంగా నేర్చుకోవటానికీ వీలుంటుంది. అంతేకాదు.. చంద్రుడి నివాసులుగా సఖ్యతగానూ మెలగాల్సి ఉంటుంది. అంతర్జాతీయ పౌరులుగా.. ఆ మాటొకొస్తే అంతర్విశ్వ పౌరులుగా మరింత సౌభ్రాతృత్వాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇవన్నీ కొత్త సాధానాలు, పరిజ్ఞానాన్ని సముపార్జించుకోవటానికి తోడ్పడేవే.

వాతావరణాన్ని తట్టుకునేలా..
చంద్రుడి మీద జీవనమంటే వెన్నెల్లో నడక కాదు. చంద్రుడు నెమ్మదిగా భ్రమిస్తుండటం వల్ల 15 రోజుల పాటు పూర్తి చీకట్లో గడపాల్సి ఉంటుంది. అప్పుడు ఉష్ణోగ్రతలు మైనస్‌ 173 డిగ్రీల సెల్షియస్‌కు పడిపోతాయి. అనంతరం 15 రోజుల పాటు నిరంతరం ఎండ కాస్తుంది. ఉష్ణోగ్రతలు 100 డిగ్రీల సెల్షియస్‌కు పైగా పెరుగుతాయి. రాత్రి కాకపోవటం వల్ల నిద్ర పట్టటం చాలా కష్టం. బయటకు వెళ్లి మరమ్మతులు చేయటం, శాస్త్ర విషయాలు పరిశోధించటమంటే చాలా ప్రమాదకరమైన పని. ఇలాంటి విపరీత పరిస్థితులను అధిగమించటానికి వ్యోమగాములు సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో.. అంటే ఉష్ణోగ్రతలు తట్టుకునేలా ఉన్నప్పుడే బయటకు వెళ్లాల్సి ఉంటుంది.

ధరించే సూట్లనూ ఎండను ప్రతిఫలించేలా, వేడిని తట్టుకునేలా.. అలాగే లోపల చల్లబరిచే వ్యవస్థ ఉండేలా ప్రత్యేకంగా డిజైన్‌ చేస్తున్నారు. అన్నేసి రోజుల పాటు భూమి నుంచీ, ఇంటికీ దూరంగా ఉంటే బెంగ మొదలు కాదూ! అయితే దీన్ని పరిష్కరించటం పెద్ద కష్టమేమీ కాదు. అదృష్టం కొద్దీ చంద్రుడి నుంచి భూమికి సమాచారం చేరటంలో జాప్యం కేవలం సెకండు కన్నా తక్కువగానే ఉంటుంది. అందువల్ల ఎప్పుడంటే అప్పుడు ఇంటికి వీడియో కాల్‌ చేసి, కుటుంబ సభ్యుల ముఖాలను చూస్తూ మాట్లాడుకోవచ్చు.

వినూత్న పరిజ్ఞానాలు
కొత్త మౌలిక వసతులే కాదు, ఆర్టెమిస్‌ ప్రయోగాల కోసం ఉపయోగిస్తున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానమూ భిన్నమైందే. చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలోనే ఆర్టెమిస్‌ వ్యోమనౌకలు దిగనున్నాయి. ఇది చాలా కీలకమైన ప్రాంతం. ఎందుకంటే ఇక్కడ పెద్దమొత్తంలో మంచు ఉందని భావిస్తున్నారు. రాకెట్‌ ద్వారా భూమి మీది నుంచి నీటిని తరలించాలంటే ఎక్కువ బరువును మోయాల్సి ఉంటుంది. అందువల్ల వ్యోమగాములు తాగునీటిని అక్కడ్నుంచే తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. నీటిని ఆక్సిజన్‌, హైడ్రోజన్‌గానూ విడగొట్టాల్సి ఉంటుంది. శ్వాసించటానికి ఈ ఆక్సిజన్‌ చాలా కీలకం. చంద్రుడిపై నుంచి అంగారకుడి మీదికి రాకెట్లను ప్రయోగించటానికి హైడ్రోజన్‌ ఇంధనంగా ఉపయోగపడుతుంది.

చంద్రుడి నీటి మంచు ఫ్రిజ్‌లోని ఐస్‌ గడ్డల కన్నా చాలా చల్లగా ఉంటుంది. ఇదంతా చంద్రుడి రాళ్లలో విస్తరించి ఉంటుంది. అక్కడి మంచు స్వభావాలను, దాన్ని ఎలా వాడుకోవాలనేది అర్థం చేసుకోవటం అత్యంత కీలకం. దీనికి కొత్త పరిజ్ఞానాలు అవసరం. ఇందుకోసం నోవా సి అనే ల్యాండర్‌ను ఈ సంవత్సరం చివర్లో పంపించనున్నారు. ఇది చంద్రుడి 'మట్టి'లో మీటరు లోతు వరకు గొయ్యిని తవ్వుతుంది. దీన్నుంచి మంచును సంగ్రహించి, విశ్లేషిస్తుంది. ఆర్టెమిస్‌ 3లో భాగంగా చంద్రుడి మీది నుంచి వెనక్కి వచ్చే వ్యోమగాములు మంచు నమూనాలను భూమికి తీసుకొస్తారు. ఇది తేలికగానే అనిపించొచ్చు గానీ ఇందుకోసం ప్రత్యేకమైన ఫ్రిజ్‌లు అవసరం. ఎందుకంటే మంచు నమూనాలను నిరంతరం అతి చల్లటి వాతావరణంలోనే ఉంచాలి. ఈ ఫ్రిజ్‌లను నాలుగు ఆర్టెమిస్‌ వ్యోమనౌకల ద్వారా పంపిస్తారు.

ముందు విద్యుత్‌ కేంద్రం
ఆవాసాన్ని నిర్మించటం కన్నా ముందు విద్యుత్‌ గ్రిడ్‌ ఏర్పాటు చేసుకోవటం ముఖ్యం. సౌర విద్యుత్తును తయారు చేయటం తేలికే. అయితే పక్షం పాటు చీకటిగా ఉండే రోజుల్లోనూ విద్యుత్తు తయారయ్యేలా చూసుకోవాల్సి ఉంటుంది. అతి శీతల వాతావరణాన్నీ తట్టుకునేలా విద్యుత్‌ తయారీ కేంద్రాన్ని నిర్మించాల్సి ఉంటుంది. విద్యుత్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాక ఆవాసాన్ని నిర్మించటమే అసలు సమస్య. ఇది చాలా కష్టమైన వ్యవహారం. నిర్మాణాలకు అవసరమైన సాధన సంపత్తిని ఉపగ్రహాల ద్వారా పంపించటం సాధ్యం కాదు. అందుకే అక్కడి వనరులను వాడుకోవటం మీద దృష్టి సారించారు. రాళ్లను తవ్వి తీయటం, చంద్రుడి ధూళితో ఇటుకలు తయారుచేయటం, చంద్రుడి ధూళితో చేసిన పదార్థాలతో 3డీ ప్రింటింగ్‌ చేయటం వంటి అవకాశాలను పరిశీలిస్తున్నారు.

అయితే చంద్రుడి ధూళిని వాడుకోవటం చాలా కష్టమైన పని. దీని రేణువులను మృదువుగా చేయటానికి అక్కడ గాలి, వాన వంటివేవీ ఉండవు. ఇవి ముళ్లలాగా పొడుచుకొని ఉంటాయి. పైగా విద్యుదావేశం కలిగుంటాయి. అంటే దేనికైనా అంటుకుపోతాయన్నమాట. స్పేస్‌ సూట్లకు, పరికరాలకూ అంటుకుంటాయి. ఎయిర్‌లాక్స్‌లోంచీ లోపలికి రావొచ్చు. వీటిని పీల్చుకుంటే జ్వరం (స్పేస్‌ హే ఫీవర్‌) వస్తుంది. ఇలాంటి అనర్థాలను తప్పించటానికి పరికరాలకు నానోకోటింగ్‌ వేయటం, ఆవాసాల్లో ప్రత్యేకమైన ఫిల్టర్‌ వ్యవస్థల వంటి వాటిని రూపొందిస్తున్నారు. జాబిల్లికి ఎలాంటి అయస్కాంత క్షేత్రం రక్షణ లేదు. దీంతో నిరంతరం రేడియేషన్‌ ప్రభావానికి గురవుతూనే ఉంటుంది. దీన్ని తట్టుకోవటానికీ కొత్త పరిజ్ఞానాలు అవసరం. అయితే ఒక ఊరట లేకపోలేదు. ఆవాసాన్ని ఏర్పాటు చేయటానికి వెళ్లినవారు అత్యవసరమైతే మూడు రోజుల్లోనే భూ వాతావరణంలోకి వచ్చే వీలుండటం.

ఆర్టెమిస్‌తో మొదలు..
చంద్రుడి మీద కాలు మోపాలనే ప్రస్తుత ప్రయత్నాల్లో నాసా ఆరంభించిన ఆర్టెమిస్‌ ప్రయోగాలే అన్నింటికన్నా ముందున్నాయి. మనిషి అక్కడికి వెళ్లటానికి సన్నాహాలు చేయటంతో మొదలయ్యే ఇవి మానవులను చంద్రుడి మీదికి దింపటమే కాదు.. స్థిర నివాసానికీ మార్గం వేయనున్నాయి. ఇవి ఐదు దశల్లో సాగుతాయి.

ఆర్టెమిస్‌ 1: ఇది చాలారోజుల పాటు చంద్రుడి ఉపరితలానికి 100 కిలోమీటర్ల ఎత్తున తిరుగుతుంది. వ్యోమగాములను మోసుకెళ్లే క్యాప్సూల్‌ 'ఓరియన్‌ క్రాఫ్ట్‌'ను అంతరిక్షంలో పరీక్షించటానికిది వీలు కల్పిస్తుంది.

ఆర్టెమిస్‌ 2: యాబై రెండేళ్ల తర్వాత చంద్రుడి వద్దకు చేరనున్న తొలి మానవ సహిత ప్రయోగం. ఓరియన్‌ స్పేస్‌క్రాఫ్ట్‌లో వ్యోమగాములను పంపించనున్నారు. ఇది చంద్రుడి చుట్టూ తిరిగి వ్యోమనౌకను పరీక్షిస్తుంది. తిరిగి భూమికి చేరుకుంటుంది. దీన్ని 2024లో ప్రయోగించనున్నారు.

ఆర్టెమిస్‌ 3: చంద్రుడి మీద మళ్లీ మానవుడు కాలు మోపటానికి తోడ్పడే ప్రయోగం. తొలిసారి ఒక మహిళా వ్యోమగామినీ ఇది చంద్రుడి మీదికి తీసుకెళ్లనుంది. దీన్ని 2025లో ప్రయోగించనున్నారు. ఇక్కడ్నుంచి చంద్రయానం తీరుతెన్నులే మారనున్నాయి. చంద్రుడి కక్ష్యలో గేట్‌వే అనే అంతరిక్ష కేంద్రాన్ని నెలకొల్పాలని నాసా తలపెట్టింది. ఇక్కడ్నుంచి ల్యాండర్‌ ద్వారా చంద్రుడి మీదికి రాకపోకలు సాగించాలన్నది దీని ఉద్దేశం. దీంతో చంద్రుడి మీదికి ప్రయాణం తేలికవుతుంది. ఖర్చూ తగ్గుతుంది.

ఆర్టెమిస్‌ 4: గేట్‌వే అంతరిక్ష కేంద్రానికి సంబంధించిన భాగాలను తీసుకెళ్లటం దీని ఉద్దేశం.

ఆర్టెమిస్‌ 5: చివరి ఆర్టెమిస్‌ ప్రయోగం ఇదే. చంద్రుడి మీద మనుషులు వాహనం వంటి వాటిని నడపటం దీని ద్వారా సాధ్యమవుతుంది. గేట్‌వేకు కొత్త ఇంధన వ్యవస్థను చేరవేయటానికీ తోడ్పడుతుంది.

కొత్త ప్రాంతాల్లో అన్వేషణ
ఒకప్పటి అపోలో ప్రయోగాలన్నీ చాలావరకు చంద్రుడి ఉపరితలం మీద కొద్ది ప్రాంతానికి, ఒకింత నివాసయోగ్య ప్రాంతానికే పరిమితయ్యాయి. ఇప్పుడు చాలా విస్తృతమైన ప్రాంతాల్లో అన్వేషణ సాగనుంది.

వైపర్‌ రోవర్‌ దిగే చోటు
రోబోటిక్‌ రోవర్‌ 'వైపర్‌'ను నోబైల్‌ బిలం వద్ద దించాలని నాసా నిర్ణయించింది. చంద్రుడి మీద 2024లో అడుగుపెట్టే ఇది నీటి మంచు, ఇతర వనరుల కోసం అన్వేషిస్తుంది. నోబైల్‌ దాదాపు పూర్తిగా చీకటి ప్రాంతంలోనే ఉంటుంది. సౌర వ్యవస్థలో అత్యంత శీతల ప్రదేశాల్లో ఇదొకటి. మానవ సహిత ఆర్టెమిస్‌ ప్రయోగాలూ నోబైల్‌కు సమీపంలోనే దిగొచ్చు.

బెరెషీట్‌ కుప్పకూలిన ప్రాంతం
ప్రైవేటు సంస్థ స్పేస్‌ఐఎల్‌ 2019లో చేపట్టిన బెరెషీట్‌ మూన్‌ ల్యాండర్‌ ప్రయోగం విఫలమైంది. టార్డిగ్రేడ్స్‌ అనే సూక్ష్మక్రిములను మోసుకెళ్లిన ఇది అక్కడ కుప్పకూలింది. ఈ క్రిములు బతికి బయటపడ్డాయని కొందరు భావిస్తుంటారు. అయితే అవి నలిగిపోయినట్టు అనంతర ప్రయోగాలు సూచిస్తున్నాయి. త్వరలో వీటి గుట్టు తేలిపోనుంది.

టైటానియం నిల్వలు
నాసాకు చెందిన లూనార్‌ రికానసన్స్‌ ఆర్బిటర్‌ 2011లో చంద్రుడి పటాన్ని రూపొందించింది. ఇది అక్కడి ఉపరితలం మీదుండే మూలకాలను వెల్లడించింది. ముఖ్యంగా సీ ఆఫ్‌ ట్రాంక్విలిటీలోని రాళ్లలో పెద్దఎత్తున టైటానియం నిల్వలు ఉన్నట్టు గుర్తించింది. కొన్ని ప్రాంతాల్లోనైతే భూమి మీది రాళ్ల కన్నా 10 రెట్లు ఎక్కువగా టైటానియం ఉన్నట్టు తేల్చింది. వీటిని సమగ్రంగా శోధించనున్నారు.

నీటి మంచు
చంద్రుడి మీద సుమారు 40వేల చదరపు కిలోమీటర్ల భాగం చీకటిగా, చల్లగా ఉంటుంది. ఇక్కడ మంచు రూపంలో నీరు ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. వ్యోమగాములు దీన్ని వెలికి తీసి, అందులోంచి పీల్చుకోవటానికి ఆక్సిజన్‌, ఇంధనం కోసం హైడ్రోజన్‌ను తయారుచేసే అవకాశముంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.