Laptop Buying Mistakes : ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరికీ ల్యాప్‌టాప్, పర్సనల్ కంప్యూటర్ తప్పనిసరి అవసరంగా మారాయి. సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లడానికి ల్యాప్‌టాప్‌లు చాలా బాగుంటాయి. అందుకే ఎక్కువమంది లాప్టాప్ కొనేందుకే మొగ్గు చూపుతూ ఉంటారు. మీరు కూడా ల్యాప్‌టాప్ కొందామని అనుకుంటున్నారా? అయితే ల్యాప్‌టాప్ కొనేటప్పుడు ఎక్కువ మంది తరచుగా చేసే తప్పులు ఏమిటో ముందుగా తెలుసుకోండి.
ల్యాప్‌టాప్ కొనాలని అనుకునేవారు కొన్ని కీలకమైన అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. అప్పుడే మనం వెచ్చించే ధరకు తగిన, మనం కోరుకున్న ఫీచర్స్ కలిగిన ల్యాప్‌టాప్ సొంతం చేసుకోవచ్చు. లేదంటే, కొన్న తర్వాత బాధపడ్డా ప్రయోజనం ఉండదు. ఏదైనా కొత్త వస్తువు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు.. ఎవరికైనా సరే చాలా ఆతృతగా ఉంటుంది. దానికి తోడు మార్కెట్లో ఉన్న రకరకాల లాప్‌టాప్‌లు వారిని ఆకర్షిస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి సమయంలో ఎలాంటి గాబరా పడకూడదు. అందుబాటులో ఉన్న వాటిలో.. మనకు అవసరమైన స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఉన్న ల్యాప్‌టాప్‌ను ఎంచుకోవాలి. ఇందు కోసం 8 కీలకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అవేెంటో ఇప్పుడు చూద్దాం
1. చాలా చిన్నది... చాలా పెద్దది
Laptop Screen Size Importance : ల్యాప్‌టాప్ అనేది మనం సులువుగా క్యారీ చేసేందుకు అనువుగా ఉండాలి. పెద్ద స్క్రీన్ కలిగిన ల్యాప్‌టాప్ తీసుకుంటే, మన కంటికి మంచి ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. కానీ మనతో పాటు తీసుకెళ్లడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. మరీ చిన్న ల్యాప్‌టాప్ తీసుకుంటే స్క్రీన్ చిన్నగా ఉంటుంది. అలాగే టైపింగ్ చేసేందుకు కీబోర్డ్ అనువుగా అనిపించదు. అందుకే పోర్టబుల్ ల్యాప్‌టాప్ తీసుకుంటే బెటర్.
2. ప్రింటర్స్, మైక్స్
ల్యాప్‌టాప్ తీసుకునేటప్పుడు ఎక్స్టర్నల్ డివైజెస్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. మీరు కొనుక్కునే ల్యాప్‌టాప్‌కు సూట్ అయ్యే.. ప్రింటర్స్, మైక్స్, ఛార్జర్స్, యూఎస్బీ కేబుల్స్‌ను ఎంచుకోవాలి. ల్యాప్‌టాప్‌లో ఉన్న కంటెంట్‌ను ప్రజెంటేషన్ రూపంలో చూపించాల్సి వచ్చినప్పుడు.. ఏయే డివైజెస్ అవసరమో ముందే గుర్తించాలి. వీటన్నింటిని కూడా అందుబాటులో పెట్టుకోవాలి. మంచి స్పీకర్స్, మైక్రోఫోన్స్ సెట్ చేసుకోవాలి. అప్పుడే ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఎలాంటి అంతరాయాలు ఏర్పడవు.
3. క్వాలిటీ చెకింగ్
Laptop Quality Check : ల్యాప్‌టాప్‌లో హై క్వాలిటీ డిస్ప్లే చాలా ముఖ్యమైంది. ఇది ఓవరాల్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను ప్రభావితం చేస్తుంది. అందుకోసం స్క్రీన్ రిజల్యూషన్, సైజ్, ప్యానల్ టైప్, రిఫ్రెష్ రేట్, కలర్ అక్యురసీ, గ్రాఫిక్స్ కార్డ్, ప్రాసెసర్ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
4. ముందే టెస్ట్ చేసుకోవాలి
Laptop Configuration Check : మీరు కొనాలనుకునే ల్యాప్‌టాప్ మోడల్ గురించి ముందే తెలుసుకోవాలి. ఇందుకోసం ఆన్లైన్లో రివ్యూస్ చదవాలి. స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకోవాలి. కొనేముందు ల్యాప్‌టాప్ ఫంక్షన్ ఎలా ఉందో కూడా టెస్ట్ చేయాలి. టైపింగ్, క్యారీయింగ్తో పాటు, కీబోర్డ్ కంఫర్ట్, టచ్ ప్యాడ్ ఎక్స్పీరియన్స్, బ్యాటరీ లైఫ్ అవసరాలకు తగిన విధంగా ఉన్నాయా? లేదా? చూసుకోవాలి.
5. బ్యాటరీ సైజును ఇగ్నోర్ చేయవద్దు!
Laptop Battery Health Check : ల్యాప్‌టాప్ బ్యాటరీ సైజ్ చాలా ముఖ్యం. ఒక్కోసారి ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం లేని సందర్భం రావచ్చు. అలాంటప్పుడు బ్యాటరీ పైనే ఆధారపడాల్సి వస్తుంది. కనుక బ్యాటరీ సైజ్ గురించి ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి. బ్యాటరీని ఒకసారి ఫుల్‌ఛార్జ్ చేసుకోవడానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవాలి. ఇందుకోసం ల్యాప్‌టాప్ కొనే ముందు కచ్చితంగా యూజర్ల రివ్యూస్ చదవాలి.
6. కొత్త టెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వాలి
Laptop Latest Generation : ల్యాప్‌టాప్‌లు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌తో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయి. మనం వెచ్చించే డబ్బుతో పాత ఫీచర్స్ కలిగిన ల్యాప్‌టాప్ కొనుగోలు చేయడానికి బదులు.. అదే రేటుకు సరికొత్త ఫీచర్స్ కలిగిన ల్యాప్‌టాప్ ఏదైనా అందుబాటులో ఉందో చూసుకోవాలి. ఆ రోజుకు ఉన్న కొత్త టెక్నాలజీ ల్యాప్‌టాప్ కొనుక్కుంటే కొంతకాలం పాటు వాడుకోవచ్చు. లేదంటే కొత్త స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ కోసం త్వరగానే మరొకటి కొనుక్కోవాల్సి వస్తుంది.
7. జిమ్మిక్కులతో మోసపోవద్దు!
Laptop Advertising : చాలా మంది మార్కెటింగ్ జిమ్మిక్కులతో, అనవసర ఫీచర్స్‌కు ఆకర్షితులై మోసపోతుంటారు. కంపెనీలు తమ ప్రకటనల్లో చాలా ఫీచర్స్ గురించి చెబుతుంటాయి. కానీ అవన్నీ వాస్తవంలో ఉండకపోవచ్చు లేదా పనిచేయకపోవచ్చు. మార్కెట్లోని ల్యాప్టాప్స్ చూడగానే నచ్చుతాయి. కానీ నిజంగా అందులో ఏవి మనకు అవసరమో, ఏవి అవసరం లేదో ఆలోచించాలి. మనం వాడని ఫీచర్స్ కోసం ఎక్కువ రేట్ కలిగిన ల్యాప్‌టాప్ కొనాల్సిన అవసరం లేదు. ప్రాసెసింగ్ స్పీడ్, ర్యామ్, స్టోరేజ్ స్పేస్, గ్రాఫిక్స్ పెర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ లాంటి కీలక అంశాలను మాత్రం కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి.
8. రివ్యూస్ చదవడంలో జాగ్రత్తలు
Laptop Reviews : ఎవరైనా తాము కొనాలనుకున్న ల్యాప్‌టాప్ గురించి రివ్యూస్ చదివే విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. టెక్నాలజీకి సంబంధించి నమ్మకమైన యూట్యూబ్ ఛానల్స్‌లో రివ్యూ చూడడం బెటర్. అంతేకాకుండా, సేమ్ మోడల్ ల్యాప్‌టాప్ వాడుతున్న స్నేహితులను అడిగి తెలుసుకోవడం కూడా చాలా ఉత్తమం. నచ్చిన, మెచ్చిన ల్యాప్‌టాప్ కొనేముందు పైన పేర్కొన్న 8 జాగ్రత్తలు తీసుకుంటే.. కొన్న తర్వాత బాధపడాల్సిన అవసరం ఉండదు. ఆన్లైన్లో, అలాగే ప్రత్యక్షంగా ఫ్రెండ్స్ ద్వారా రీసెర్చ్ చేసి, చాలా ఆలోచించి ల్యాప్‌టాప్ కొనుక్కుంటే బెటర్.