James Webb Telescope: విశ్వం గుట్టు ఛేదించేందుకు అమెరికా, ఐరోపా, కెనడా అంతరిక్ష సంస్థలు సంయుక్తంగా ప్రయోగించిన 'జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు'(జేడబ్ల్యూఎస్‌టీ) దాదాపు నెలరోజుల అనంతరం పలు కక్ష్యలను విజయవంతంగా దాటుకుంటూ తన గమ్యస్థానాన్ని చేరింది. భూమి నుంచి 15 లక్షల కి.మీ దూరం ప్రయాణించి రెండో లాంగ్రేంజ్ పాయింట్(ఎల్2)ను చేరింది. ఇక అక్కడి నుంచి ఇది ఖగోళానికి సంబంధించి విలువైన సమాచారాన్ని మనకు అందివ్వనుంది. విశ్వరహస్యాలను ఛేదించేందుకు చేపట్టిన మిషన్ కీలక మైలురాయిని చేరినట్లు నాసా తెలిపింది. జేడబ్ల్యూఎస్‌టీతో విశ్వం రహస్యాలను తెలుసుకునేందుకు ఇంకో అడుగదూరంలో ఉన్నట్లు నాసా ప్రకటించింది.
గత డిసెంబర్ 25న ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించారు. నిప్పులు చిమ్ముకుంటూ ఎరియాన్-5 రాకెట్ దీన్ని నింగిలోకి తీసుకెళ్లింది. ఇప్పటికే రోదసీలో ఉన్న హబుల్ టెలిస్కోప్ స్థానంలో జేడబ్ల్యూఎస్‌టీని ప్రవేశపెట్టారు. ఈ అధునాతన సాధనంతో శాస్త్రవేత్తలు విశ్వం పుట్టుక, రహస్యం, నక్షత్రాలు వంటి పలు అంశాలను ఛేదించనున్నారు. భారీ వ్యయప్రయాసాల కోర్చి దాదాపు రూ.73 వేల కోట్లతో ఈ టెలిస్కోప్ ప్రయోగాన్ని చేపట్టారు. ఇది 5 నుంచి 10 ఏళ్ల పాటు సేవలందించనుంది.
ఇదీ చదవండి:
ఖగోళ దర్శిని ప్రయోగానికి సర్వం సిద్ధం.. ప్రత్యేకతలివే!