IPhone Life Span :స్మార్ట్ ఫోన్లు వాడే చాలా మందికి ఐఫోన్ కొనాలనేది ఒక కలగా ఉంటుంది. అయితే దాని ధరకు భయపడి చాలామంది తమ కోరికను పక్కనపెట్టేస్తారు. ఒక ఐఫోన్ ఖరీదు డిజిటల్ కెమెరా ధర కంటే కూడా ఎక్కువంటేనే అదెంత ఖర్చుతో కూడుకున్న వస్తువో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రీమియం మొబైల్స్ కొనాలనుకునేవారితో పాటు ఫీచర్లు, టెక్నాలజీ విషయంలో అస్సలు రాజీ పడనివారికి ఐఫోన్ ఫస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. మార్కెట్లో అందుబాటులో ఉన్న ఐఫోన్ల ధరలు సుమారుగా రూ.50 వేల నుంచి రూ.లక్షకు పైనే ఉన్నాయి. ఇంత ఖరీదు పెట్టి కొనే ఫోన్లను జాగ్రత్తగా చూసుకుంటే తప్ప ఎక్కువ రోజులు వాడలేం. ఈ నేపథ్యంలో ఐఫోన్ యూజర్లు దాని వాడకం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఫోన్ లైఫ్ స్పాన్‌ను ఈజీగా పెంచుకోవచ్చు.
నాన్-యాపిల్ ఛార్జర్లు వాడొద్దు..
How To Increase IPhone Life Span : ఐఫోన్‌ను ఎక్కువ కాలం వాడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని నిపుణులు అంటున్నారు. ఐఫోన్లో బ్యాటరీని చాలా కీలకంగా చెప్పొచ్చు. డివైజ్‌కు పవర్‌ను ఇచ్చే బ్యాటరీ పాడవ్వకుండా ఉండాలంటే ఐఫోన్ ఛార్జర్ మాత్రమే వినియోగించాలి. నాన్-యాపిల్ ఫాస్ట్ ఛార్జర్లు ఉపయోగిస్తే ఐఫోన్ బ్యాటరీ త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంది. మార్కెట్లో దొరికే థర్డ్ పార్టీ ఛార్జర్లు తక్కువ నాణ్యతతో తయారు చేసినవే ఉంటాయి. వీటిని వాడితే ఐఫోన్ లైఫ్ స్పాన్ పెరగకపోగా.. తగ్గిపోతుంది. కాబట్టి యాపిల్ కంపెనీకి చెందిన ఛార్జర్లను మాత్రమే వినియోగిస్తే మంచిది. ఒకవేళ యాపిల్ ఛార్జర్ అందుబాటులో లేకపోతే యాపిల్ ఎంఎఫ్ఐ సర్టిఫైడ్ ఐఫోన్ యాక్సెసరీస్‌ను వాడుకోవచ్చు.
నీటికి ఆమడ దూరంలో ఉంచాలి..
How To Increase IPhone Life : ఐఫోన్ లైఫ్ స్పాన్ తగ్గిపోవడానికి మరో కారణం మొబైల్ తడవడం. నీళ్లు లేదా ఇతర లిక్విడ్స్‌ను కొంతవరకు తట్టుకునే శక్తి ఐఫోన్లకు ఉంటుంది. కానీ ఇవి పూర్తిగా వాటర్ ప్రూఫ్ కాదని గుర్తించుకోవాలి. కాబట్టి పొరపాటున కూడా ఐఫోన్ నీళ్లలో పడకుండా, వర్షపు నీటిలో తడవకుండా చూసుకోవాలి లేకపోతే మొబైల్ పాడయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ ఫోన్ తడిస్తే దాన్ని ఏదైనా బట్టతో శుభ్రం చేయాలి. ఛార్జింగ్ కేబుల్‌తో పాటు పోర్ట్‌లో కూడా తేమ లేకుండా చూసుకోవాలి. తరచూ నీళ్లలో పనిచేయాల్సి వస్తే వాటర్ ప్రూఫ్ ఐఫోన్ కేస్‌ను కొనుక్కోవడం మేలు.
వైరలెస్ కంటే కేబులే బెస్ట్..
How To Increase IPhone Battery Life : ఐఫోన్లో కీలకమైనది బ్యాటరీ. దీన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే ఐఫోన్ మన్నిక అంత ఎక్కువ కాలం ఉంటుంది. ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టేటప్పుడు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలి. వేడి ఎక్కువగా ఉన్న చోట మొబైల్‌ను ఛార్జ్ చేయకూడదు. వాతావరణం మరీ వేడిగా లేదా మరీ చల్లగా ఉన్న సమయంలో ఛార్జింగ్ పెడితే ఐఫోన్ బ్యాటరీ లైఫ్ దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి ఐఫోన్‌కు ఎక్కువ ఎండ తగలకుండా చూసుకోవాలి. నిద్రపోయే సమయంలో ఫోన్‌ను తలగడ కింద పెట్టి ఛార్జింగ్ చేయకూడదని గుర్తుపెట్టుకోవాలి. ఈమధ్య కాలంలో ఫోన్లను వైర్లెస్ ఛార్జింగ్ పెట్టడం ఎక్కువైంది. దీని వల్ల ఎక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది. మొబైల్ కూడా స్లోగా ఛార్జ్ అవుతుంది. కాబట్టి వైర్లెస్ ఛార్జింగ్ కంటే కేబుల్‌తో ఫోన్లను ఛార్జ్ చేయడమే ఉత్తమమని నిపుణులు అంటున్నారు.
సొంత ప్రయోగాలు వద్దు..
How To Increase Mobile Life : ఐఫోన్ ధరను దృష్టిలో పెట్టుకుంటే అది పాడైతే బాగు చేయించడానికి ఎంత ఖర్చు అవుతుందో కూడా అర్థం చేసుకోవచ్చు. ఖరీదైన మొబైల్ కాబట్టి రిపేరింగ్ ఖర్చు భారీగానే ఉంటుంది. అలాగని ఐఫోన్ పాడైతే ఖర్చులకు భయపడి సొంత ప్రయోగాలతో బాగు చేద్దామనుకుంటే ఇబ్బందులు తప్పవు. మంచి అనుభవం ఉన్న టెక్నీషియన్ అయితే తప్ప ఐఫోన్‌ను బాగు చేయడానికి ప్రయత్నించకపోవడమే మేలు. ఒకవేళ కాదని ఫోన్‌ను రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తే దాని లైఫ్ స్పాన్ తగ్గుతుందని మర్చిపోవద్దు.
వాటిని ఇన్స్టాల్ చేయొద్దు..
How To Increase IPhone Lifetime Usage : ఐఫోన్ లైఫ్ స్పాన్ పెరగాలంటే బీటా సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేసి వాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. డెవలప్మెంట్ దశలో ఉన్న బీటా సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తే ఫోన్ లైఫ్ స్పాన్ బాగా తగ్గిపోతుందని గుర్తించుకోవాలి. బగ్స్ నిండిన సాఫ్ట్వేర్ వల్ల యాప్స్ క్రాష్ అయ్యే ప్రమాదం ఉంది. దీని వల్ల బ్యాటరీపై ప్రభావం పడుతుంది. అది కాస్తా డివైజ్ లైఫ్ స్పాన్ తగ్గిపోవడానికి దారితీస్తుంది. ఒకవేళ మీరు డెవలపర్ అయితే యాప్‌ను టెస్ట్ చేయాలనుకుంటే ఫైనల్ వెర్షన్ విడుదలయ్యే వరకు వేచి ఉండి తర్వాత ఇన్స్టాల్ చేయడమే ఉత్తమం.
ప్రొటెక్టివ్ కేస్లు వాడండి..
IPhone Protection Case : ఐఫోన్ల తయారీ నాణ్యత గురించి తెలిసిందే. హై క్వాలిటీ మెటీరియల్‌ను ఉపయోగించి వీటిని రూపొందిస్తారు. స్టెయిన్ లెస్ స్టీల్‌తోపాటు సెరామిక్ షీల్డ్ కోటింగ్ వేసి అందుబాటులోకి తీసుకొస్తారు. దీని వల్ల ఫోన్ పొరపాటున కింద పడినా ఎలాంటి స్క్రాచ్‌లు పడవు. దీనర్థం జాగ్రత్తగా ఉండొద్దని కాదు. బాగా ఎత్తు నుంచి పడినా, గట్టి ఉపరితలం మీద పడినా ఐఫోన్ పగిలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మొబైల్ కిందపడినా కాపాడే ప్రొటెక్టివ్ కేస్‌లను వినియోగించడం ఉత్తమం. దీని వల్ల ఫోన్ కిందపడినా తక్కువ డ్యామేజీతో బయటపడుతుంది.