ప్రముఖ మెసేజింగ్ యాప్.. ఫేస్‌బుక్‌కు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఈ-కామర్స్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా యాప్‌లో 'షాప్' అనే ప్రత్యేకమైన ట్యాబ్‌ను తీసుకొచ్చింది. ఇందులోకి వెళ్తే పలురకాల బ్రాండ్లు కనిపిస్తాయి. వాటిపై క్లిక్ చేస్తే ఆ సంస్థల ప్రొడక్ట్‌లు దర్శనమిస్తాయి. ఏవైనా వస్తువులు నచ్చితే యాప్ నుంచి బయటకు వెళ్లకుండా అక్కడే కొనుగోలు చేయొచ్చు. ఇందుకోసం 'చెక్అవుట్' బటన్‌ను తన యాప్‌లో ఏర్పాటు చేసింది. ప్రసుత్తం ఇందులో.. వస్తువులు అమ్ముకునేవారు అమ్మకపు ఫీజులు కట్టాల్సి ఉంటుంది. షాప్ పేజ్‌లో సెర్చ్ ద్వారా మనకు కావాల్సిన వస్తువులను వెతుక్కోవచ్చు.
![Instagram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8058456_instagram.jpg)
ఏదైనా వస్తువును కొనాలన్నా, డొనేషన్లు చెల్లించాలన్నా 'ఫేస్బుక్ పే'ను కూడా వినియోగించుకోవచ్చు. ఇప్పటికే దీన్ని అమెరికాలో ప్రయోగాత్మకంగా పరిశీలించారు. త్వరలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.
భద్రత పక్కానా..?
ఇన్స్టాగ్రామ్ ప్రకటన ప్రకారం.. మొదటిసారి కొనుగోలు చేసే సమయంలో నమోదు చేసిన సమాచారం (చెల్లింపు వివరాలు, క్రెడిట్ కార్డు / డెబిట్ కార్డు సమాచారం) మీ భవిష్యత్తు అవసరాల కోసం నిల్వ చేస్తారు. అయితే, సమాచారం దుర్వినియోగం విషయంలో ఇప్పటికే అనేక సమస్యలను ఎదుర్కొన్న ఫేస్బుక్.. దీనిని సక్రమంగా ఎలా నిర్వహిస్తుందో చూడాలి.
![Instagram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8058456_instagram2.jpg)
ప్రస్తుతం అడిడాస్, బర్బెర్రీ, డియోర్, హెచ్&ఎమ్, నైక్, ఆస్కార్ డీ లా రెంటా, ప్రాడా, గ్లాసెస్ రీటైలర్ వార్ బై పార్కర్ వంటి ఎన్నో అంతర్జాతీయ బ్రాండ్లు, మింత్రా, డెల్,స్నాప్‌డీల్, మ్యాక్స్, ఎఫ్‌బీబీ,రిలయన్స్ వంటి ఎన్నో సంస్థల వస్తువులు చెక్అవుట్ ఫీచర్లో ఉన్నాయి.