ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ప్రస్తుతం 5జీ హవా నడుస్తోంది. 5జీ అనేది ఇంటర్నెట్ పరంగా వేగవంతమైన ఆధునిక సాంకేతికత. మన దేశంలోనూ జియో, ఎయిర్టెల్ లాంటి అగ్రశేణి టెలికాం కంపెనీలు 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇవి దేశవ్యాప్తంగా 500 నగరాల్లోని వినియోగదారులకు వేగవంతమైన ఇంటర్నెట్ను అందిస్తున్నాయి. కానీ చాలామంది వినియోగదారులు 5జీ వాడుతున్నప్పుడు ఫోన్ బ్యాటరీ తొందరగా ఖాళీ అవుతుందని.. దీనికి 5జీనే కారణమని ఆరోపిస్తున్నారు. మీ ఫోన్ కూడా 5జీ వాడుతున్నప్పుడు వేగంగా ఖాళీ అవుతుందని (బ్యాటరీ డ్రెయిన్) అనిపిస్తోందా? అయితే ఇలా చేయండి!
ఇలా ఎందుకు అవుతోంది?
ప్రస్తుతమున్న నాన్ స్టాండ్ అలోన్ 5జీ నెట్ వర్క్‌లో బ్యాటరీ డ్రెయిన్ ప్రాబ్లమ్ ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి కారణం 4జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఆధారపడి ఉండటమే. 5జీ సేవలు హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తున్నప్పటికీ.. ఫోన్ కాల్స్, మెసేజులు ఇప్పటికీ 4జీ, 3జీ నెట్‌వర్క్‌ల ద్వారా అందుతున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. రెండు వేర్వేరు డివైజ్‌లు, రెండు వేర్వేరు నెట్‌వర్క్‌లకు కనెక్ట్ చేయడం వల్ల బ్యాటరీ వినియోగం పెరిగి ఈ సమస్య వస్తుందని పేర్కొన్నాయి.
ఏం చేస్తే బ్యాటరీ ఆదా ఆవుతుంది?
ఈ సమస్యను అధిగమించాలంటే 5జీ నెట్ వర్క్ నుంచి 4జీకి మారాలి. ఇలా చేయడం వల్ల బ్యాటరీ లైఫ్‌ను ఆదా చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రయాణ సమయంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింట్లో 5జీ నుంచి 4జీ ఎలా మారాలో ఇప్పుడు తెలుసుకుందాం.
How To Change 5g to 4g on Android : ఆండ్రాయిడ్ వినియోగదారులు
- మీ ఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి కనెక్షన్, మొబైల్ నెట్వర్క్స్ అనే ఆప్షన్‌పై ప్రెస్ చేయండి.
- ఆ తర్వాత మొబైల్ నెట్‌వర్క్స్‌లో.. నెట్వర్క్ మోడ్‌ను ఎంచుకోండి.
- అక్కడ మీకు వివిధ రకాల నెట్ వర్క్స్ జాబితా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి 4జీ ఎల్టీఈ/3జీ/2జీ వస్తుంది. ఆటో కనెక్ట్ ఆప్షన్‌ను ఎంచుకోండి. అప్పుడు 4జీ లేదా అంతకంటే తక్కువ నెట్‌వర్క్‌లకు మాత్రమే కనెక్ట్ అవుతుంది.
How To Change 5g to 4g on Iphone : ఐఫోన్ వినియోగదారులు
- ఫోన్లో సెట్టింగ్స్‌ను ఓపెన్ చేసి సెల్యులార్ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి.
- సెల్యులార్ మెనూలో సెల్యులార్ డేటా ఆప్షన్స్‌పై క్లిక్ చేయండి.
- తర్వాత వాయిస్ అండ్ డేటాపై క్లిక్ చేస్తే ఒక లిస్టు వస్తుంది. అక్కడి నుంచి 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్స్‌ను ఎంచుకోండి.
మీరు మీ ఐఫోన్లో ఆటో 5జీ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవచ్చు. దీని వల్ల మీకు అవసరం లేనప్పుడు 5జీ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవడం ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. ఐఫోన్ 12 సిరీస్,అంతకంటే పై మోడళ్లలో మాత్రమే 5జీ సపోర్ట్ చేస్తాయి.