ప్రస్తుత జీవనశైలిలో మొబైల్ వినియోగించనివారు అరుదు. స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు ప్రపంచం మన చేతిలో ఉంటుందనే భావన. గతంలో సమాచార బదిలీకి మాత్రమే పరిమితమైన ఫోన్ వినియోగం..సాంకేతికత అభివృద్ధితో మెసేజ్‌లు, వీడియో కాలింగ్, పేమెంట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సేవలకు ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ యూజర్స్ లక్ష్యంగా సైబర్ మోసాలు పెరిగిపోయాయి. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన ఫోన్‌లోకి వైరస్ వచ్చి చేరుతుంది. కొత్త యాప్ లేదా వెబ్ పేజ్‌లను యాక్సెస్ చేసినప్పుడు వైరస్/మాల్‌వేర్‌తో హ్యాకర్స్ దాడి చేస్తున్నారు. మరి ఫోన్‌లో వైరస్ ఉన్న విషయం ఎలా గుర్తించాలి..మాల్‌వేర్ బారి నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనేది తెలుసుకుందాం.
పాప్-అప్ యాడ్
కొన్నిసార్లు ఫోన్‌లో సోషల్ మీడియా, ఈ-మెయిల్ లేదా ఇతర యాప్‌లు ఉపయోగించినప్పుడు మీ ప్రమేయం లేకుండా ఫోన్ స్క్రీన్ మీద కొన్ని రకాల పాప్-అప్ యాడ్స్ కనిపిస్తుంటాయి. వీటిని యాడ్‌వేర్ అంటారు. అలాంటి వాటిని గుర్తిస్తే మీ ఫోన్‌లో మాల్‌వేర్/వైరస్ ఉన్నట్లు భావించాలి. అలానే ఏదైనా యాప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత తరచుగా వ్యాపార ప్రకటనలు కనిపిస్తే సదరు యాప్‌ను తొలగించడం ఉత్తమం.
ఫోన్ పనితీరు, బ్యాటరీపై ప్రభావం
ఒక్కోసారి మీ ఫోన్ ఉన్నట్లుండి నెమ్మదిస్తుంది. అంతేకాకుండా సడెన్‌గా స్విఛ్‌ఆఫ్ అయిపోవడం, తరచుగా వేడెక్కడం వంటివి జరుగుతుంటే, మీ ఫోన్‌లో మాల్‌వేర్/వైరస్ ఉన్నట్లు గుర్తించాలి. ఇవి బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తూ మన ఫోన్‌లో సమాచారాన్ని హ్యాకర్స్‌కి చేరవేస్తాయి. అలానే ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోవడం, మళ్లీ ఛార్జింగ్ చేయాల్సి రావటం, ఫోన్ ఛార్జ్ అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంటే కూడా అనుమానించాల్సిందే. దీనితోపాటు గుర్తు తెలియని ప్రాంతాల్లో ఫోన్లు ఛార్జింగ్ చేయకపోవడమే మేలు.
![how to protect Smartphones from virus](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11208687_phone.jpg)
పేమెంట్ కోసం డిమాండ్
ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఏదైనా యాప్ లేదా ఫైల్ ఓపెన్ చేసినప్పుడు మీ ప్రయేయం లేకుండా వాటంతటవే క్లోజ్ అవుతాయి. తిరిగి మీరు వాటిని ఉపయోగించాలంటే కొంత నగదు చెల్లించమని మెసేజ్ కనిపిస్తుంది. దీన్నే రాన్సమ్‌వేర్ అంటారు.
అపరిచిత అప్లికేషన్స్
మన అవసరాని తగినట్లుగా ఎన్నో రకాల అప్లికేషన్లను డౌన్‌లోడ్ చేస్తుంటాం. అయితే కొన్నిసార్లు మీ ప్రమేయం లేకుండానే కొన్ని అప్లికేషన్లు వాటంతటవే డౌన్‌లోడ్ అవుతుంటాయి. అలా ఏదైనా యాప్ మీ ఫోన్‌లో కనిపిస్తే వెంటనే డిలీట్ చేయండి. వాటి ద్వారా వైరస్/మాల్‌వేర్ మీ ఫోన్‌లో వ్యాపించే ప్రమాదం ఉంది. ఇలాంటి వాటిలో ఎక్కువ స్పైవేర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవి ఫోన్‌పై నిరంతరం నిఘా పెడుతూ, యూజర్ డేటాను హ్యాకర్స్‌కి చేరవేస్తాయి. వాటి వల్ల ఫొటోస్, వీడియోలతో పాటు ఫోన్లలో నిక్షిప్తం అయ్యే డేటాకు ప్రమాదం పొంచి ఉన్నట్లే. అలానే ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంటే వెంటనే సదరు యాప్‌ను డిలీట్ చేయండి. ఎక్కువ శాతం హ్యాకర్స్ యాప్స్ ద్వారానే వైరస్‌ను ఫోన్లలోకి పంపుతుంటారు.
![beware of unknown apps](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11208687_sm.jpg)
మాల్‌వేర్‌ను అడ్డుకోవడం ఎలా..?
మీ ఫోన్‌లో మాల్‌వేర్/వైరస్ ఉన్నట్లు అనుమానం వస్తే తప్పనిసరిగా యాంటీ వైరస్ లేదా యాంటీ మాల్‌వేర్ ప్రోగ్రాం ఇన్‌స్టాల్ చేసుకోమని సూచిస్తున్నారు టెక్ నిపుణులు. ఇవి ఫోన్‌ని పూర్తిగా స్కాన్ చేసి ఏమైనా ప్రమాదకరమైన ప్రోగ్రామ్స్ ఉంటే గుర్తించి రిపోర్టు చూపిస్తుంది.
ఫోన్‌లో మాల్‌వేర్ తొలగించేందుకు ఉన్న మరో మార్గం ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్. ఇలా చేయడం వల్ల ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన అన్ని ప్రోగ్రాములు డిలీట్ అయిపోయి, సెట్టింగ్స్ మారిపోయి ఫోన్ కొన్నప్పుడు ఎలా ఉందో అలా మారిపోతుంది. ఒకవేళ మీ ఫోన్ ప్యాక్టరీ రీసెట్ చేయాలంటే మీ కాంటాక్ట్స్‌తో పాటు ఇతర డేటాను బ్యాకప్ చేసుకోవడం మరిచిపోకండి.
ఇదీ చదవండి:శాంసంగ్ కొత్త ఆఫర్- ఫ్రీగా 75వేల పాడ్‌కాస్ట్‌లు!