పిల్లలు పిజ్జా అంటూ మారాం చేస్తున్నారని ఇంట్లోనే హెల్దీ పిజ్జా తయారుచేసింది వనజ. అయితే దాన్ని బేకింగ్ ట్రే నుంచి ప్లేట్లోకి మార్చేటప్పుడు సరైన గరిట ఉపయోగించకపోవడంతో అది మధ్యలోనే జారి కింద పడిపోయింది.
ఇంటికి బంధువులొస్తున్నారని ఫిష్ ఫ్రై చేస్తోంది హిమజ. అయితే ఈ క్రమంలో ఆ ముక్కల్ని తిప్పడానికి సాధారణ స్పూన్ ఉపయోగించింది. దాంతో ముక్కలన్నీ చిన్న చిన్న పీసెస్‌గా విడిపోయాయి. ఇక చేసేదేం లేక అలాగే అతిథులకు వడ్డించేసింది.
మహిజ ఈవెనింగ్ స్నాక్స్ కోసమని చాక్లెట్ కప్ కేక్స్ తయారుచేస్తోంది. ఈ క్రమంలో వంటింట్లో చేతికందిన స్పూన్ తీసుకొని చాక్లెట్ బ్యాటర్‌ని కప్ కేక్ మౌల్డ్స్‌లో నింపుతోంది. దాంతో ఆ బ్యాటర్ కాస్తా కింద పడిపోవడం, మరికాస్త స్పూన్‌కి అంటుకుపోవడం.. ఇలా చాలా వరకు వృథాగా పోయింది.
వంట చేసే క్రమంలో ఇలాంటి అనుభవాలు మనలో చాలామందికి ఎదురవుతూనే ఉంటాయి. ప్రత్యేక వంటకాలు చేసేటప్పుడు కూడా మనం 'ఏదో ఒకటి లే..' అని వంటింట్లో మన చేతికందిన స్పూన్లు, గరిటలు ఉపయోగించడమే ఇందుకు కారణం. మరి, అలా జరగకుండా ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైన స్పూన్స్ (స్పాచులాస్)కు కిచెన్‌లో చోటు కల్పించాల్సిందే! ప్రస్తుతం అలాంటి స్పెషల్ స్పాచులాస్ మార్కెట్లో బోలెడన్ని అందుబాటులో ఉన్నాయి. మరి, అవేంటి? అవి మనకు అనునిత్యం ఎలా ఉపయోగపడతాయి? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే!
అడ్జస్టబుల్ స్పాచులా
మనం ఇంట్లో ఇడ్లీ, మైసూర్ బజ్జీ, ఆనియన్ పకోడా, కప్ కేక్స్.. వంటివి తరచూ చేసుకుంటూనే ఉంటాం. అయితే వీటిని ఆయా మౌల్డ్స్‌లో నింపేటప్పుడు లేదంటే నూనెలో వేసేటప్పుడు ఏదో ఒక స్పూన్‌ని ఉపయోగిస్తే.. అంతా దానికి అంటుకుపోవడం లేదంటే కాస్త కింద పడిపోవడం.. వంటివి జరుగుతూనే ఉంటాయి. ఇక వాటిని శుభ్రం చేయడం ఓ పెద్ద పని. మరి, అలా జరగకుండా, బ్యాటర్ వృథా కాకుండా పని సులువుగా పూర్తవ్వాలంటే 'అడ్జస్టబుల్ స్పాచులా' ఉపయోగించాల్సిందే!
ఫొటోలో చూపించినట్లుగా స్పూన్ మాదిరిగా ఉండే దీనికి మధ్యలో ఓ బటన్ ఉంటుంది. దానికి అనుసంధానమై ఉన్న మరో స్పాచులా ముందుకు, వెనక్కి అనేలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈ స్పూన్ సహాయంతో బ్యాటర్‌ని తీసుకొని దాన్ని ఫొటోలో చూపించినట్లుగా బటన్‌ని ముందుకు ప్రెస్ చేస్తుంటే బ్యాటర్ పూర్తిగా వచ్చి మౌల్డ్స్‌లో పడుతుంది. తద్వారా ఆ పదార్థం కింద పడకుండా, స్పూన్‌కు అంటుకొని వృథా కాకుండా ఉంటుంది. ఇలా ఎంతో సౌకర్యవంతంగా ఉండే ఈ స్పూన్ విభిన్న రంగుల్లో ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతోంది. దీని నాణ్యతను బట్టి ధర రూ. 375 నుంచి రూ. 1,283 వరకు ఉంది.
ఫ్లిప్పర్ స్పాచులా
బ్రెడ్ ఆమ్లెట్, పిజ్జా.. వంటివి ఇంట్లో ప్రిపేర్ చేసుకునేటప్పుడు లేదా సర్వ్ చేసుకునేటప్పుడు వాటికి ఏ స్పూన్ పడితే ఆ స్పూన్‌ని ఉపయోగించలేం. గ్రిప్ ఉన్న స్పూన్ అయితే అవి జారిపోయి కింద పడిపోయే అవకాశం ఉండదు. మీరు కూడా ఇదే ఆలోచనలో ఉన్నారా? అయితే అందుకు 'ఫ్లిప్పర్ స్పాచులా' చక్కటి ఎంపిక.
ఫొటోలో చూపించినట్లుగా గ్రిప్పర్‌లా ఉండే దీనికి కింది లేయర్‌లో వెడల్పాటి స్పూన్‌లా ఉంటుంది. ఇక పై లేయర్‌లో 'యు' షేప్‌లో కట్ అయిన స్పూన్‌లా ఉంటుంది. ఈ రెండు లేయర్ల చివర్లు కలిసిపోయి గ్రిప్పర్‌లా ఉంటుందీ స్పాచులా. మనం సర్వ్ చేసుకోవాలనుకున్న పదార్థాన్ని ఫొటోలో చూపించినట్లుగా ఈ స్పాచులాలో బంధించి కింద పడకుండా, ఎంతో ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫ్లిప్పర్ స్పాచులాస్ ప్రస్తుతం మార్కెట్లో విభిన్న ఆకృతుల్లో మార్కెట్లో కొలువుదీరాయి. వాటి నాణ్యత, ఆకృతిని బట్టి ధర రూ. 429గా ఉంది.
ఫిల్లింగ్ స్పాచులా
సమోసా వంటి స్నాక్స్‌తో పాటు ఇంట్లో కొన్ని ఫిల్లింగ్, స్టఫ్డ్ రెసిపీస్‌ని ప్రిపేర్ చేస్తుంటాం. ఈ క్రమంలో ఫిల్లింగ్ చేసేటప్పుడు చేతికందిన స్పూన్ తీసుకొని వాటిలో ఆయా పదార్థాల్ని నింపుతుంటాం. వాటితో సరిగ్గా ఫిల్ చేయడం కుదరక కాస్త కింద పడడం, చేతికి అంటుకోవడం.. వంటివి జరుగుతుంటాయి. అలాకాకుండా ఈజీగా స్టఫ్ లేదా ఫిల్ చేయాలంటే 'ఫిల్లింగ్ స్పాచులా' కొనేసుకుంటే సరిపోతుంది.
ఫొటోలో చూపించినట్లుగా టాంగ్ మాదిరిగా ఉండే దీనికి ముందు భాగంలో వెడల్పాటి స్పూన్‌లా ఉంటుంది. టాంగ్‌ను ప్రెస్ చేస్తున్న కొద్దీ ఇది వెడల్పుగా, ముడుచుకుపోయేలా.. ఇలా ఫ్లెక్సిబుల్‌గా ఎటు పడితే అటు వంగుతుంది. ఫిల్లింగ్ కోసం తయారుచేసుకున్న పదార్థాన్ని ఈ స్పాచులాలోకి తీసుకొని.. కింద పడకుండా, చేతికి అంటుకోకుండా ఈజీగా ఫిల్ చేసుకోవచ్చు. ఇలా చేతికి ఎంతో అనువుగా ఉండే ఈ స్పాచులా నాణ్యతను బట్టి దీని ధర రూ. 299 నుంచి రూ. 349 వరకు ఉంది.
ఫిష్ టర్నర్
ఫిష్ ఫ్రై అంటే ఎవరికిష్టముండదు చెప్పండి. కనీసం వారానికోసారైనా దీని రుచి చూడకపోతే మనసు మనసులో ఉండదు కదా! అయితే ఈ చేప ముక్కల్ని ఫ్రై చేయడానికి ప్రత్యేకమైన కుకింగ్ సెట్ కావాలి. అంటే వెడల్పాటి ప్యాన్‌తో పాటు వెడల్పాటి స్పూన్ కూడా అవసరమే. అలాంటిదే ఈ 'ఫిష్ టర్నర్' కూడా! సాధారణ స్పూన్‌ని వాడడం వల్ల చేప ముక్కల్ని ఫ్రై చేస్తున్నప్పుడు సరిగ్గా తిప్పడం రాకపోవచ్చు.. దాంతో అవి చిన్న చిన్న ముక్కలుగా వూడిపోవచ్చు. అందుకే ఈ ఫిష్ టర్నర్‌ను ఉపయోగించి ఆ పనిని మరింత సులభతరం చేసుకోవచ్చు.
ఫొటోలో చూపించినట్లుగా అచ్చం స్పూన్ మాదిరిగా ఉంటుందీ స్పాచులా. అయితే ముందు భాగంలో మాత్రం సాధారణ స్పూన్ కంటే కాస్త వెడల్పుగా, సమానంగా ఉంటుంది. దీంతో ఫ్రై చేస్తున్నప్పుడు చేప ముక్కల్ని తిప్పడం, ఆపై వడ్డించడం కూడా చాలా సులువవుతుంది. ఇలాంటి ఫిష్ టర్నర్స్ ప్రస్తుతం మార్కెట్లో విభిన్న డిజైన్లలో లభ్యమవుతున్నాయి. వాటి ఆకృతి, నాణ్యతను బట్టి ధర రూ. 499 నుంచి రూ. 2,969 వరకు ఉంది.
స్పాచులా స్క్రాపర్
హల్వా వంటి పదార్థాల్ని తయారుచేసేటప్పుడు నాన్‌స్టిక్ ప్యాన్ ఉపయోగించినా అవి అడుగంటుతుంటాయి. అలా జరగకుండా పదే పదే కలపాల్సి వస్తుంది. అలాంటప్పుడు సాధారణ స్పూన్ వాడితే ఆ ప్యాన్‌పై గీతలు పడి దాని నాణ్యత తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే 'స్పాచులా స్క్రాపర్' చక్కటి ఎంపిక.
ఫొటోలో చూపించినట్లుగా చిన్న హ్యాండిల్, దానికి కింది భాగంలో కాస్త పదునుగా ఉండే ఈ స్క్రాపర్‌ను సిలికాన్‌తో తయారుచేస్తారు. కాబట్టి సాఫ్ట్‌గా ఉండి మనం కాస్త బలంగా కలిపినా ప్యాన్‌కు ఎలాంటి డ్యామేజ్ జరగదు. ఇలా పదార్థాలు అడుగంటకుండా కలపడానికి ఎంతో సౌకర్యవంతంగా ఉండే ఈ స్క్రాపర్స్ ప్రస్తుతం మార్కెట్లో విభిన్న డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి. వాటి నాణ్యత, డిజైన్‌ను బట్టి ధర రూ. 99 నుంచి రూ. 349 వరకు ఉంది.
- ఇదీ చదవండి : చాట్.. టిక్కీ.. భుజియా.. ఆలుతో సరదాగా!