ETV Bharat / science-and-technology

Artificial Intelligence: కృత్రిమ మేధ.. ఇప్పుడిదే సర్వాంతర్యామి - కృత్రిమ మేధ గురించి

Artificial Intelligence: ఇందుగలదందు లేదని సందేహం వలదన్న మాట కృత్రిమమేధకి సరిగ్గా సరిపోతుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌... అనగానే అదేదో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల భాష, మనకు సంబంధం లేదనుకుంటాం కానీ, తెల్లారి లేచిందగ్గర్నుంచీ రాత్రి పడుకునేదాకా అడుగడుగునా అది మన వెన్నంటే ఉంటోంది. ఒక వస్తువైనా, సేవ అయినా కృత్రిమమేధని అదనంగా చేర్చితే దాని విలువ ఏకంగా రెట్టింపు అవుతోంది. అందుకే... విద్య నుంచి వైద్యం వరకూ, వ్యాపారం నుంచి వ్యవసాయం వరకూ ఇప్పుడు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రమేయం లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదు.

Artificial Intelligence
Artificial Intelligence
author img

By

Published : Dec 12, 2021, 10:30 AM IST

Artificial Intelligence: పొద్దున్నే లేచి మొబైల్‌ చూసుకుంటారా? ఎలా తెరుస్తారు దాన్ని..? ఫేస్‌ ఐడీ అయితే ముఖాన్ని చూపించి, ఫింగర్‌ ప్రింట్‌ అయితే వేలిని తాకించి అన్‌లాక్‌ చేస్తాం. మనం అలా ఒకసారి ఫోన్‌ని ముఖం ముందు పెట్టి తీసి తెరుచుకున్న దాంతో మన పని మనం చేసుకుంటాం కానీ ఆ కాసేపట్లో ఫోనులోపల ఎంత పని జరుగుతుందో తెలుసా? ఫోన్‌ని తెరిచేందుకు వాడే ఫేస్‌ ఐడీ ఎదురుగా ఉన్న ముఖాన్ని త్రీడీలో చూస్తుంది. ఆ ఒక్క క్షణంలోనే మనకు కన్పించకుండా దానినుంచి 30వేల ఇన్‌ఫ్రా రెడ్‌ చుక్కలు ముఖంమీద పడి ఫొటో తీస్తాయి. వెంటనే మెషీన్‌ లెర్నింగ్‌కి సంబంధించిన అల్గారిథమ్స్‌ రంగంలోకి దిగి అప్పటికే ఫోనులో స్కాన్‌ చేసి స్టోర్‌ చేసి పెట్టిన మన ఫొటోనీ ఇప్పుడు తీసిన ఫొటోనీ పోల్చి చూసి అవునో కాదో చెబుతాయి. దాన్నిబట్టి అన్‌లాక్‌ అవ్వొచ్చా లేదా అన్నది నిర్ణయించుకుంటుంది ఫోను. ఈ పని మొత్తం జరిగేది ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)తోనే.

ఇక, ఫోన్‌ తెరవగానే సోషల్‌మీడియా ఆప్స్‌లోకి వెళ్లడం చాలామందికి అలవాటే. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టా.. ఎందులోకి వెళ్లినా అక్కడ మనకున్న వందలాది స్నేహితులు పోస్టు చేసేవన్నీ మనకు కన్పించడం అసాధ్యం, వాటిల్లోనుంచి కొన్ని మాత్రమే కన్పిస్తాయి. మనం ఎక్కువగా ఎలాంటి విషయాలున్న పోస్టులను చదువుతామో, ఎటువంటి ఫొటోలను చూస్తామో దాన్నిబట్టి మన ఆసక్తులను కనిపెట్టి ఆ విషయాలకు సంబంధించిన పోస్టులే కనపడేలా చేయడం వెనక ఉన్నది కృత్రిమమేధే. అంతేకాదు, ఈ సోషల్‌ మీడియా వేదికలకు వర్చువల్‌ రియాలిటీ హంగులద్ది 'మెటావర్స్‌'గా మన ముందుకు తేవడంలోనూ కీలకపాత్ర దానిదే.

ఆఫీసులో పనిచేసేటప్పుడు ఏదో సందేహం వస్తుంది. ఫలానా సంఘటన ఎప్పుడు జరిగిందో నిర్ధారణ చేసుకోవాలి. గబుక్కున గూగుల్‌ సెర్చ్‌కి వెళ్తాం. మన సందేహాన్ని అక్కడ టైప్‌ చేసిన క్షణంలోనే కింద వరసబెట్టి ఆ విషయంపైన సమాచారం వచ్చేస్తుంది. ఇంటర్నెట్‌లో ఉండే కోట్లాది అంశాలనుంచి మనకు కావలసిన ఒక్క అంశాన్ని అంత తక్కువ సమయంలో వెతికి తేగలగడం ఎలా సాధ్యమవుతోందీ అంటే- ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)తోనే.

Artificial Intelligence
కృత్రిమ మేధ

ఏ పని కావాలన్నా సిరినో, అలెక్సానో, గూగుల్‌ అసిస్టెంట్‌నో అడిగేయడం ఈ తరానికి బాగా అలవాటైపోయింది. పర్సనల్‌ సెక్రెటరీల్లా తయారైన ఆ ఆప్స్‌ పనిచేసేదీ ఏఐ సాయంతోనే మరి.

ఇదీ చూడండి: Students Innovation : ట్రాఫిక్ పోలీసులు "చిల్" అయ్యేలా.. ఐడియా అదిరింది గురూ..!!

జీపీఎస్‌ ఆన్‌ చేసుకుని ఎక్కడికో బయల్దేరతాం. ఆ దారిలో ముందు భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఉందన్న విషయం చెప్పి ప్రత్యామ్నాయమార్గం చూపించేదీ ఏఐ సాయంతోనే. మన దగ్గర ఇంకా రాలేదు కానీ విదేశాల్లో కొన్నిచోట్ల పూర్తిగా ఏఐతోనే డ్రైవర్‌ లేని కార్లు తిరుగుతున్నాయి.

ఈ-మెయిల్‌లో ఫిల్టర్లూ, స్మార్ట్‌ రిప్లైలూ.. ఓటీటీలో మూవీ రికమెండేషన్లూ.. వెబ్‌సైట్స్‌లో చాట్‌బాట్స్‌... అసలు ఏఐ లేనిదెక్కడ? కంప్యూటర్‌ సైన్స్‌లో ఒక విభాగమైన ఏఐ.. మెషీన్‌ లెర్నింగ్‌ లాంటి వాటితో కలిసి యంత్రాలను స్మార్ట్‌గా మార్చేస్తోంది. వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచేస్తోంది.

'నీకిష్టమని ఈ కూర వండాను' అని అమ్మ అంటే ఆ మాటకే సగం కడుపు నిండిపోతుంది. ఏదైనా మనకోసం ప్రత్యేకంగా తయారైందంటే దాని విలువే వేరు! అందుకే ఇప్పుడు మన పనులన్నిటినీ పర్సనలైజ్‌ చేస్తోంది- ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌. ఆ క్రమంలో మన సమయాన్నీ, డబ్బునీ, శక్తినీ ఆదా చేస్తోంది. పనుల్ని సులభతరం చేస్తోంది. అసలింతకీ కృత్రిమ మేధ అంటే ఏమిటీ..?

Artificial Intelligence
కృత్రిమ మేధ

ఒకనాటి ఊహ..!

Uses of Artificial Intelligence: మనిషి కోసం మనిషి తయారుచేసుకున్న మేధస్సు.. కాబట్టే దీన్ని కృత్రిమమేధ అంటున్నారు. యంత్రాలు- వాటికి అందజేసిన సమాచారాన్నీ, అనుభవాన్నీ ఉపయోగించుకుని ఒక స్థాయి వరకూ ఆలోచిస్తాయి, సమస్యల్ని పరిష్కరిస్తాయి. డీప్‌ లెర్నింగ్‌, నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ అనే విధానాలను అందుకు ఉపయోగించుకుంటాయి. ఏఐ సాంకేతికతతో ఫలానా పని చేసేలాగా కంప్యూటర్లకు శిక్షణ ఇవ్వవచ్చు. అందుకు అవసరమైన 'డేటా'ని అందించడమే మన పని. ఆ డేటా ఎంత ఎక్కువ ఉంటే అంత కచ్చితమైన ఫలితం ఉంటుంది.

యంత్రాల చేత మనిషిలా పనిచేయించు కోవాలన్న కోరిక ఇప్పటిది కాదు. ఇంటర్నెట్‌ కనిపెట్టకముందే 1956లోనే ‘కృత్రిమమేధ’ అన్న పదాన్ని మొదటిసారి వాడారు. కంప్యూటర్ల మీద ప్రయోగాలూ మొదలు పెట్టారు. అంతకన్నా ముందు 1927లో ‘మెట్రోపొలిస్‌’ అనే జర్మన్‌ సినిమా వచ్చింది. మూకీ సినిమా రోజుల్లోనే వచ్చిన ఆ తొలి సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలో అచ్చం మనిషిలాగే తయారుచేసిన రోబో ఉంటుంది. నాటి ఆ ఊహే నేడు నిజమైంది. ఇంటర్నెట్‌ రాకతో ఊపందుకున్న ప్రయోగాలు కృత్రిమమేధని అన్ని రంగాల్లోకీ తీసుకొచ్చాయి. అదెలాగో చూద్దాం..!

వైద్యరంగంలో..

Artificial Intelligence in healthcare: కృత్రిమ మేధను ఉపయోగించడం ద్వారా హెల్త్‌ రికార్డులను డిజిటలైజ్‌ చేయడం దగ్గర్నుంచీ పరిశోధనల వరకూ వైద్యరంగం ఎన్నో విధాలుగా లబ్ధి పొందుతోంది.

  • ఏఐ సాయంతో ఎక్కువ సమాచారాన్ని విశ్లేషించడం సాధ్యమవుతుంది కాబట్టి రోగనిర్ధారణ త్వరగా, కచ్చితంగా చేయవచ్చు. ఉదాహరణకి- ఆకస్మిక మరణాలకు దారి తీస్తున్న గుండె వైఫల్యాన్ని ముందుగా గుర్తించడం ఇంతకు ముందు సాధ్యమయ్యేది కాదు. ఐబీఎంకి చెందిన పరిశోధక బృందం పేషెంట్‌ ఎలక్ట్రానిక్‌ హెల్త్‌ రికార్డులను కృత్రిమమేధ సాయంతో విశ్లేషించి గుండె వైఫల్యం సంభవించే అవకాశాలను రెండేళ్లు ముందుగానే కనిపెట్టవచ్చని తేల్చింది.
  • ఎంఐటీ పరిశోధకులు శక్తిమంతమైన కొత్త యాంటిబయోటిక్‌ ఔషధాన్ని కనిపెట్టారు. ‘హాలిసిన్‌’ అని పేరు పెట్టిన ఈ మందు ఇప్పటివరకూ నయం కాని ఒకరకం క్షయతో సహా ఎన్నో బ్యాక్టీరియాలను చంపేస్తుందట. మందు అంటేనే కొన్నిరకాల రసాయనాల సమ్మేళనం. మెషీన్‌ లెర్నింగ్‌ సాయంతో లక్షలాది రసాయనాల కాంబినేషన్లను వివిధ నిష్పత్తుల్లో కలపడం ద్వారా ప్రయోగాలు చేసి, ఏఐ సాయంతో విశ్లేషించగా ఇది సాధ్యమైందనీ కేవలం మనుషులే చేయాలంటే ఇంత ఎక్కువ డేటాని విశ్లేషించడం అసాధ్యమనీ శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.
  • సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ, అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ లాంటివాటిని నిశితంగా పరిశీలించ డానికి డాక్టర్లకు చాలా సమయం పడుతుంది. ఏఐ ఆ పనిని సులువుచేయడమే కాదు, కంటికి కనపడని అత్యంత సూక్ష్మమైన తేడాలను కూడా గుర్తించి క్యాన్సర్‌లాంటివి రాకముందే హెచ్చరించగలుగుతుంది.
  • కేటరాక్ట్‌, ఆర్థోపెడిక్‌ లాంటి సర్జరీలను ఇప్పుడు దాదాపుగా పెద్ద ఆస్పత్రుల్లో చాలాచోట్ల రోబోలు నిర్వహిస్తున్నాయి. పలుచోట్ల వైద్యులకు సహాయకులుగానూ అవి సేవలందిస్తున్నాయి.
  • కరోనా కారణంగా ఏఐ సామర్థ్యమున్న రోబోల వాడకం ఒక్క ఏడాదిలోనే 25 శాతం పెరిగిందట. ఐసొలేషన్‌లో ఉన్న పేషెంట్లకు మందులూ ఆహారమూ అందించడంలో, ఆస్పత్రిని శానిటైజ్‌ చేయడంలో, ఓపీలో రోగులను పరిశీలించి వారి సమస్యను బట్టి సంబంధిత విభాగానికి పంపడం లాంటివన్నీ రోబోలు చేసి వైద్యసిబ్బందికి పనిభారం తగ్గించాయి.
  • వృద్ధులకు ఇళ్లలోనూ ఆస్పత్రుల్లోనూ ఆత్మీయ సహాయకుని పాత్ర పోషించే రోబోలకు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటా మంచి గిరాకీ ఉందట.
    Artificial Intelligence
    వైద్యరంగంలో కృత్రిమ మేధ

పారిశ్రామిక విప్లవం 4.0

Artificial Intelligence in industry 4.0: ఆవిరి యంత్రం తొలి పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం చుట్టగా, రకరకాల ఆవిష్కరణలతో పెద్ద ఎత్తున వస్తు ఉత్పత్తికి తెరలేపుతూ సైన్సు రెండో దఫా విప్లవాన్ని తెచ్చింది. ఆ తర్వాత వచ్చిన డిజిటల్‌ రివల్యూషన్‌ని మూడో పారిశ్రామిక విప్లవంగా పరిగణించిన పరిశోధకులు ప్రస్తుతం కృత్రిమమేధని నాలుగో పారిశ్రామిక విప్లవం అంటున్నారు. కృత్రిమమేధ వాడకం వల్ల వస్తువులకు పెరుగుతున్న విలువ చూశాక అన్నిరకాల వ్యాపారాలూ ఇప్పుడు ‘ఏఐ ఎనేబుల్డ్‌’ అన్న ట్యాగ్‌ తగిలించు కుంటున్నాయి. తద్వారా తాము కాలంతో కలిసి సాగుతున్నామని ప్రకటిస్తున్నాయి.

ఈ-కామర్స్‌: ఈ కామర్స్‌ అంతా నడిచేది ఏఐతోనే. ప్రకటనలతో వినియోగదారుని ఆకట్టుకోవడంతో మొదలుపెట్టి వెబ్‌సైట్‌ ద్వారా వర్చువల్‌ షాపింగ్‌ అనుభూతిని కలిగించి, వస్తువు కొనగానే వేర్‌హౌస్‌ నుంచి వినియోగదారు ఇంటివరకూ చేరవేయడం, ఆ క్రమంలో ప్రతి దశనీ అతడికి ఈ-మెయిల్‌ ద్వారా సమాచారమివ్వడం... ఇదంతా ఏఐ చలవే. అమెజాన్‌లో కొనాలనుకున్నవన్నీ కార్ట్‌లో వేశాక మనం ఇంకా ‘బై’ మీద క్లిక్‌ చేయకముందే ఆయా వస్తువుల్ని మన అడ్రస్‌కి షిపింగ్‌ చేసే పని మొదలై పోతుందనీ, సంస్థ అల్గారిథమ్స్‌ అంత వేగంగా పనిచేస్తాయనీ చెబుతారు. ఈ సంస్థలో ఏఐ లేని విభాగమే లేదట.

కర్మాగారాలు: ఏఐతో పనిచేసే స్మార్ట్‌ కెమెరాలు పరిశ్రమల్లో ప్యాకేజింగ్‌ దశలోనే క్వాలిటీ కంట్రోల్‌ బాధ్యతలు చేపడుతున్నాయి. నాణ్యమైన ఉత్పత్తికి ఉండే లక్షణాలన్నీ ముందుగానే వీటికి ఫీడ్‌ చేయడంతో ఏ కాస్త తేడా ఉన్నా దాన్ని వెంటనే వేరు చేయడం ద్వారా ఇవి పరిశ్రమలు నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉండడానికి తోడ్పడుతున్నాయి. దాదాపు అన్ని ఫ్యాక్టరీల్లోనూ, వేర్‌హౌసుల్లోనూ బరువులెత్తడానికి రోబో ఆర్మ్స్‌ వినియోగం బాగా పెరిగింది. కార్ల ఫ్యాక్టరీల్లో వెల్డింగ్‌, అసెంబ్లింగ్‌తో మొదలుపెట్టి పెయింటింగ్‌ వరకూ అంతా రోబోలే చేస్తాయి.

మానవ వనరులు: కృత్రిమమేధతో పనిచేసే 'హెచ్‌ఆర్‌ ఎనలిటిక్స్‌' ఉద్యోగాల భర్తీలో కీలక పాత్ర పోషిస్తోంది. ఉద్యోగ ప్రకటన దగ్గర్నుంచీ సరైన అభ్యర్థి ఎంపిక వరకూ అడుగడుగునా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ వినియోగిస్తున్నారు. తాము కోరుకుంటున్న అభ్యర్థికి ఏ లక్షణాలు ఉండాలో వాటిని కీ వర్డ్స్‌గా పెట్టి వందలాది దరఖాస్తుల్ని క్షణాల్లో వడపోస్తున్నారు. మొదటి దశ ఇంటర్వ్యూలను చాట్‌బాట్స్‌ చేసేస్తున్నాయి. అభ్యర్థి సోషల్‌ మీడియా పోస్టుల్ని స్కాన్‌ చేసి అతడి గుణగణాల ప్రొఫైల్‌ని సిద్ధం చేస్తోంది ఏఐ సాఫ్ట్‌వేర్‌. దీనివల్ల తక్కువ సమయంలో సరైన అభ్యర్థిని ఎంపికచేయడం సాధ్యమవుతోందంటున్నాయి హెచ్‌ఆర్‌ సంస్థలు.

ఇదీ చూడండి: E-waste Recycling: ఎలక్ట్రానిక్​ వ్యర్థంలోనూ పరమార్థం!

బ్యాంకింగ్‌: ఒకప్పుడు బ్యాంకులో ఒక ఖాతానుంచి మరో ఖాతాకి డబ్బు బదిలీ చేయాలంటే ఒక పూట పని. ఇప్పుడు చేతిలో ఉన్న ఫోనుతో నిమిషంలో ఆ పని చేసేస్తున్నాం. పని ఎంత సులువైందో అక్రమాలకు అవకాశమూ అంతగా పెరిగింది. అయినా రోజూ కోట్లాది లావాదేవీలు ఇబ్బంది లేకుండా సాగిపోతున్నాయంటే దానికి కారణం బ్యాంకింగ్‌ సాఫ్ట్‌వేర్‌లో ఏఐ వాడకమే. ఒక్క ట్రాన్సాక్షన్‌ అనుమానాస్పదంగా కన్పించినా వెంటనే ఈ సాఫ్ట్‌వేర్‌ సాయంతో ఆ ఖాతాలో లావాదేవీలను నిలిపేయడమే కాదు, అంతకు ముందు జరిగిన లావాదేవీల ఆనుపానులన్నీ క్షణాల్లో కనిపెట్టేయొచ్చు. దాంతో నేరాలను నివారించడం తేలికవుతోంది.

ఇన్వెస్ట్‌మెంట్‌: పెట్టుబడుల రంగంలో, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీల్లో రోబో అడ్వైజర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్‌ సేవల రూపంలో ఉండే ఇవి ముందుగా కస్టమర్‌ని పలు ప్రశ్నలు వేస్తాయి. వయసూ ఆసక్తులూ ఆదాయమూ అప్పులూ రిస్క్‌ తీసుకోగల ధైర్యం ఏపాటి ఉందీ లాంటివన్నీ అందులో ఉంటాయి. బ్యాంకు, క్రెడిట్‌ కార్డు లావాదేవీల సమాచారాన్నీ తీసుకుంటాయి. ఆ సమాచారాన్నంతా క్రోడీ కరించి ఇన్వెస్టర్‌ ప్రొఫైల్‌ని తయారుచేస్తాయి. దాని ఆధారంగా పెట్టుబడులు ఎప్పుడు, ఎలా, ఎక్కడ పెట్టాలన్న సలహాలు ఇస్తాయి.

Artificial Intelligence
పారిశ్రామిక విప్లవం 4.0

సాగుకి సాయం

కంప్యూటర్‌ అంటే ఏమిటో తెలియని రైతుకీ ఆధునిక సాంకేతిక సేవల్ని అందించడం ఏఐతో సాధ్యమైంది. విదేశాల్లో ఇప్పటికే ఏఐ సాంకేతికతతో పనిచేస్తున్న యంత్రాలు మనిషి అవసరం లేకుండా వాటంతటవే నాట్లు వేస్తున్నాయి, నీళ్లు పెడుతున్నాయి, కలుపు తీస్తున్నాయి, ఎరువులు వేస్తున్నాయి, కోతలు కోస్తున్నాయి. పంటని పైనుంచి పర్యవేక్షించడం, క్రిమిసంహారకాలను చల్లడం లాంటి పనులను డ్రోన్లు చేస్తున్నాయి. హైడ్రోపోనిక్స్‌, వర్టికల్‌ ఫార్మింగ్‌లాంటి ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో అయితే అచ్చంగా ఆటోమేటెడ్‌ సాగు చేస్తున్న సంస్థలూ ఉన్నాయి. అంటే అక్కడ పనులన్నీ మనుషుల సాయం లేకుండా ప్రోగ్రామ్‌ చేసిన యంత్రాలే పూర్తిచేస్తాయి. ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో విశాలమైన మైదానాల్లో మేతకు వెళ్లే పశువులకు వాటి చెవుల వెనకాల అగ్గిపెట్టె సైజు పరికరం అమర్చి ఉంటుంది. సౌరశక్తితో పనిచేసే ఆ పరికరం ఆధారంగా పశువు ఎక్కడ ఉంది, ఏ పరిస్థితిలో ఉంది, ఎలాంటి మేత తిన్నదీ తదితర సమాచారాన్నంతా యజమాని ఇంటి దగ్గర నుంచే గమనించగలుగుతాడు.

ఇదీ చూడండి: శాటిలైట్​ ఇంటర్నెట్​​ కనెక్షన్​ కావాలా? ఏడాదికి రూ.లక్షన్నర కట్టాల్సిందే!

మనదేశంలోనూ ఏఐ సాయంతో తయారుచేసిన ‘కిసాన్‌ సువిధ’ లాంటి ఆప్స్‌ రైతులకు సేవలందిస్తున్నాయి. వాతావరణ సూచనలు ఇవ్వడం, వేసిన పంటకి ఎప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియ జేయడం, తెగుళ్ల గురించి హెచ్చరించడం, పంట అమ్ముకోవడానికి తోడ్పడడం... వంటివి చేసిపెట్టే ఆప్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, సిస్కో.. ఈ మూడు సంస్థలతో ఇటీవలే ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. తగిన సాంకేతికతా, మౌలిక వసతులూ లేనందున దేశంలో ఏటా పెద్ద ఎత్తున పంట వృథా అవుతోంది. ఈ సంస్థలు కృత్రిమమేధ సాయంతో ఆ సమస్యని పరిష్కరించడమే కాక దిగుబడినీ పెంచాలన్నది లక్ష్యం. అందుకుగాను దాదాపు ఐదు కోట్ల మంది రైతుల సమాచారాన్ని ప్రభుత్వం ఈ సంస్థలకు అందజేసింది. మైక్రోసాఫ్ట్‌ వంద గ్రామాలను ఎంచుకుని పని ప్రారంభించగా, అమెజాన్‌ మొబైల్‌ ఆప్‌తో రైతులకు మార్గదర్శకత్వం వహిస్తోంది. ఈ ప్రయోగాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన చోట గతేడాది 30 శాతం అధిక దిగుబడి సాధించినట్లు నీతి ఆయోగ్‌ పేర్కొంది.

Artificial Intelligence
సాగుకు సాయం

చదువూ ఉద్యోగం... అన్నీ సులువే..!

విద్య, ఉద్యోగం, పాలనా రంగం... అసలు కృత్రిమమేధ ప్రవేశించని రంగమంటూ ఏదీ కనిపించడం లేదు. ఉద్యోగుల హాజరు నమోదు చేసే బయోమెట్రిక్‌ సిస్టమ్‌తో మొదలుపెట్టి శాంతిభద్రతల పరిరక్షణకు, ఆనకట్టల పర్యవేక్షణకు వాడే డ్రోన్ల వరకూ పరిపాలనలో కృత్రిమమేధ ఎప్పుడో ప్రవేశించింది.

  • పిల్లలు బడికెళ్లి చదువుకోవటానికి ఏఐతో ఏమిటి సంబంధం అనుకుంటే పొరపాటే. మన విద్యారంగంలో ఏఐ మార్కెట్‌ విలువ గతేడాదే 75వేల కోట్లు. అది ఏటా 40శాతం చొప్పున పెరుగుతోందట. ఆన్‌లైన్‌ చదువులు వచ్చాక, తరగతి గదిలో టీచరు చెప్పాల్సిన పాఠాలను రకరకాల ఆప్స్‌ ద్వారా ఫోన్‌ తెరమీద చెప్పడానికీ, ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణకీ ఏఐ సాయం కీలకమవుతోంది. విద్యార్థి సామర్థ్యాలనూ నైపుణ్యాలనూ బేరీజువేసి ఒక్కొక్కరి బలాబలాలను గుర్తించడం ద్వారా టీచర్లు వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేకశ్రద్ధ తీసుకోవడానికి వీలు కలుగుతోంది.
  • తప్పుల్లేకుండా ఉద్యోగానికి దరఖాస్తు రాయడమెలా అన్న సందేహం అక్కర్లేదిప్పుడు. ‘గ్రామర్లీ’ లాంటి ఏఐ ఎనేబుల్డ్‌ సాఫ్ట్‌వేర్‌ తోడుంటే అది సాధ్యమే. ఒక్కో వాక్యం రాసేటప్పుడే తప్పుల్లేకుండా దరఖాస్తుని దిద్దిపెడుతుంది ఆ సాఫ్ట్‌వేర్‌.
  • ఆ మధ్య బోయింగ్‌ సంస్థ ఒక సర్వే చేసింది. 700 మంది పైలట్లు పాల్గొన్న ఈ సర్వేలో విమానాల కాక్‌పిట్‌లను ఏఐతో అనుసంధానించడం వల్ల విమానం నడిపే టప్పుడు ఒక్కో ట్రిప్‌లో ఏడు నిమిషాలకు మించి తాము చేత్తో పనిచేయాల్సిన అవసరం ఉండటం లేదని చెప్పారట.
  • గొంతుని గుర్తుపట్టే సాంకేతికతనే ఇంకాస్త మెరుగుపరిచి సంగీత స్వరకల్పనకీ ఉపయోగిస్తోంది ఓ సంస్థ. ఇది తయారు చేసిన ఏఐ పరికరం ‘ఐవా (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వర్చువల్‌ ఆర్టిస్ట్‌)’ కేవలం సంగీత విద్వాంసులకే సాధ్యం అనుకుంటున్న శాస్త్రీయ సంగీత స్వరకల్పనని నేర్చుకుని స్వయంగా చేయగలుగుతోంది. అది తయారుచేసిన మ్యూజిక్‌ని సౌండ్‌ట్రాక్స్‌గా సినిమాలకీ, ప్రకటనల సంస్థలకీ విక్రయిస్తోంది ఈ సంస్థ.
  • యూట్యూబ్‌లో ఏదో మీటింగ్‌కి సంబంధించిన ఉపన్యాసం వింటున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌ శబ్దాల వల్ల ప్రసంగం స్పష్టంగా వినిపించకపోతే... ఆ సమస్యకీ పరిష్కారం ఉంది. నేపథ్యంలోని చప్పుళ్లను తగ్గించి ప్రసంగించే గొంతు మాత్రమే వినపడేలా చేస్తుంది మొజిల్లా ఆర్‌ఎన్‌ నాయిస్‌.

ఈ దశాబ్దం చివరికల్లా అదనంగా దాదాపు వెయ్యి లక్షల కోట్ల రూపాయల విలువైన ఆర్థికోత్పత్తిని ప్రపంచానికి అందించగల సత్తా కృత్రిమ మేధకు ఉందని నిపుణుల అంచనా.

నిప్పు.. విద్యుత్తు.. ఎలాగైతే మానవజాతి అభివృద్ధిని కీలక మలుపులు తిప్పాయో అలాగే కృత్రిమమేధ కూడానంటారు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌. మనిషీ యంత్రమూ చేయీ చేయీ కలిపి ఆడుతూ పాడుతూ పనిచేసే రోజులు వచ్చేశాయంటారాయన.

కృత్రిమమేధ సాయంతో యంత్రాలు ఇప్పుడు చదవగలవు, రాయగలవు, మాట్లాడగలవు... మనిషి చేసే ఎన్నో పనుల్ని అవి చేయగలుగుతున్నాయి కాబట్టి వాటికి ఆ పనులు అప్పజెప్పి మనుషులు అంతకన్నా పై స్థాయిలో... సృజనాత్మకత, ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ అవసరమైన పనులు చేసుకోవాలన్నది నిపుణుల సూచన. అంటే, ఇక ముందు ఏఐ అన్ని రంగాల్లోనూ మనకి కుడిభుజంగా మారనుందన్న మాట!

Artificial Intelligence
కృత్రిమ మేధ

ఇదీ చూడండి: log4shell bug: ప్రమాదంలో 'ఇంటర్నెట్'.. కొత్త బగ్​తో పెనుముప్పు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.